అంత్యదినాలలో మానవులు పరిస్థితి

28/04/2010 21:44

           నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని బైబిల్ చెపుతుంది. కాని ఎవరైతే ఆసంగతి గ్రహించి, సువార్తను నమ్మి(నిజమైన సువార్త ఏమిటి? మాకు వ్రాయండి ఉచితంగా పంపిస్తాం.) యేసునందు విశ్వాసముంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. పరిశుద్దులౌతారు.

          ఈనాడు మనుష్యులు మోసం చేయడంలోను అబద్దాలు చెప్పడంలోను పోటిపడుతున్నారు. ఎవరు ఎంత తెలివిగా మోసంచేస్తే అంత గొప్పగా ఫీలవుతున్నారు. కాలం మారిందని అందరు అనుకొంటున్నారు కాని మారింది కాలం కాదు మానవులు. చాలా విపరీతంగా మానసికంగాను భౌతికంగాను వారిని వారే చెరిపేసుకుంటున్నారు. ప్రేమించాను నీకోసం ప్రాణమిస్తాను. ఇది పాత డైలాగు. ప్రేమించాను కనుక నన్ను ప్రేమించు లేకపోతే నీ ప్రాణం తీస్తాను. ఇది ఇప్పటి డైలాగు.

          ఒక వ్యక్తి ఒక సిద్దాంతమును నమ్మి పాటిస్తు ఇతరులకు బోధిస్తూ 20 గడిచాయనుకోండి. తరువాత తాను పాటిస్తున్న సిద్దాంతము తప్పు అని తెలిసివచ్చింది. ఇప్పుడేమి చెయ్యాలి? ఆ సిద్దాంతమును ముందుకు పాటించలా? లేదా వదిలేయలా? తాను నమ్మిన సిద్దాంతము విడిచిపెట్టలేక పోతున్నాడు. ఎందుకంటే తాను తప్పుడు మనిషి అయిపోతాడు కాబట్టి. ప్రజలదృష్టిలో తప్పుఅవుతాడని సిగ్గుపడి పిరికివాడిలాగా భయపడతాడు. ఒకవేళ తాను కనుక సత్యమైన మనసాక్షి కలిగిఉంటే ఇన్నేళ్లు తాను పాటించిన దానికి పశ్చాత్తాపం చెంది మార్పుచెందుతాడు. కేవలం మారుమనస్సు పొందిన వ్యక్తికి ఇలాంటి మనసాక్షి ఉంటుంది.

          సత్యం తెలిసిన కూడా కళ్లకు కట్టినట్లుగా కనబడుతున్నాకూడా చాలా బాగా అర్ధమైనా కూడా దానికి కొంచం అయినా విధేయత (రెస్పాన్స్) చూపలేని తరం ఇప్పుడు వచ్చింది. “ఈ ప్రజలు కన్నులార చూచి చెవులారా విని మనస్సార గ్రహించి నా వైపు తిరిగి నావలన స్వస్థత పొందుకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసికొనియున్నారు. అని పరిశుద్ధాత్మ యెషయాప్రవక్తద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే.” (అ.కా 28:27).

          దేవుని వాక్యంలోని సత్యం తెలియపరచబడినప్పుడు మనిషిలో పరిశుద్దాత్మ ఉంటే ఆ సత్యాన్ని హత్తుకొంటుంది. అంతేకాని అందరు తప్పా? లేదా దేవుని వాక్యం తప్పా? అనే ఆలోచనా రాదు. మీరే అలోచించండి. అందరు తప్పా అవుతారా? లేదా దేవుని వాక్యం తప్పా అవుతుందా? అందరు తప్పు అవుతారేమో గాని దేవుని వాక్యం ఎన్నటికిని తప్పవదు. “మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానముచేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి.”(ఎఫెసి 1:13).

          కొంచం గమనించండి. అందరు సిగ్గుపడాల్సిన విషయాలలో గర్వపడుతున్నారు. ఈనాడు తల్లిదండ్రులు తమ పిల్లలు జ్ఞానం సంపాదించారా అని ఆలోచించడంలేదు. ఎలాగైనా సరే మార్కులు 90% వచ్చాయా? మంచి గ్రేడ్ వచ్చిందా? పాసయ్యడా లేదా అని మాత్రమే చూస్తున్నారు. అంతేకాకుండా డబ్బు సంపాదించాడా లేదా అనేదాన్ని చూస్తున్నారు కాని దాన్ని ఎలా సంపాదించాడు. ఏఏ పనులుచేసి, ఎందరిని మోసంచేసి సంపాదించాడు అనే విషయం ఈనాడు ఎవరూ గమనించడం లేదు.

          ఎవరు మంచి. ఎవరు చెడు. ఏది నిజం ఏది అసత్యం. నీతి న్యాయం ధర్మం ప్రేమ జాలి అనే విషయాలను గురించి ఆలోచించేవారు ఎక్కడున్నారు. ఈనాడు డబ్బు ఎక్కడుంటే అక్కడే ఇవన్ని ఉంటున్నాయి. డబ్బు వీటింన్నిటి కొనేస్తుంది. డబ్బు కోసం అందరు వీటిని అమ్మేస్తున్నారు. అందరు ఒకటి మరిచిపోతున్నారు. దేవుని యొక్క శిక్షనుండి ఎవరు తప్పించుకోలేరు. కంగారేమిలేదు. ఎవరి జీతం వారికి దేవుడు ఖచ్ఛితంగా పొందుతారు. “అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయును, అపవిత్రుడుడైనవాడు ఇంకను అపవిత్రుడుగానే యుండును, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండును.  ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని జీతము నాయొద్ద ఉన్నది.”(ప్రకటన 22:11,12).

          నలుగురు నమ్మినంత మాత్రాన అసత్యం సత్యం అయిపోదు. దాని ఫలితం ఒకనొకనాటికి బయటపడుతుంది. దేవుడు సత్యవంతుడు. నీతిమంతుడుని దేవుడు ఎల్లప్పుడు దృష్టించితాడు. “ప్రభువు కన్నులు నీతిమంతులమీదను, ఆయన చెవులు వారిప్రార్థనలవైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికివిరోధముగా ఉన్నది.”(1 పేతురు 3:12).

          చాలా మంది సైన్సును నమ్ముతాము అని అంటారు. అసలు సైన్సు అంటే వారకి తెలుసా? ఒక క్రమంలో విషయాన్ని పరిశిధించి విజ్ఞానం సంపాదించేదే సైన్సు. సైన్సు లేకపోతే పరిసరాల విజ్ఞానం లేదు. విజ్ఞానం లేకపోతే ఈ సృష్టి అర్ధం కాదు. సృష్టి అర్ధం కాకపోతే దానిని సృజించిన దేవుని తెలుసుకోవటం సాధ్యపడదు. నిజమైన సైన్సు సృష్టికర్తను తెలియజేస్తుంది. మరి మీకు ఎలాంటి సైన్సు తెలుసు?

          మానవ చరిత్రను తెలిసుకోవడం చాలా చాలా ముఖ్యం. చరిత్ర తెలియక పోతే భవిష్యత్తు ఎలా ఉండపోతుందో కూడా తెలియదు. కనీసం మన చరిత్ర మనకు తెలియాలి. ఎందుకంటే చరిత్ర ఇప్పటికే అనేక సార్లు రిపీట్ అయ్యింది(పునరావృత్తం అవుతుంది). మనం జాగ్రర్త వహించకపోతే మరలా రిపీట్ అవుతుంది.

          అంత్య దినాలలో మానవులు ఎలా ఉంటారో అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా వ్రాశాడు. “ఏలాగనగా మనుష్యులు 1. స్వార్థప్రియులు, 2. ధనాపేక్షులు, 3. బింకములాడువారు, 4. అహంకారులు, 5. దూషకులు, 6. తలిదండ్రులకు అవిధేయులు, 7. కృతజ్ఞతలేనివారు, 8. అపవిత్రులు, 9. అనురాగరహితులు, 10. అతిద్వేషులు, 11. అపవాదకులు, 12. అజితేంద్రియులు, 13. క్రూరులు, 14. సజ్జనద్వేషులు, 15. ద్రోహులు, 16. మూర్ఖులు, 17. గర్వాంధులు, 18 .దేవునికంటె సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, 19. పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు, 20 .పాపభరితులై నానావిధములైన దురాశలవలన నడిపింపబడి, యెల్లప్పుడును నేర్చుకొనుచున్నను, సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీలయొక్క యిండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. ”(2 తిమోతి 3:2-7).

ఈ సభ్యసమాజం మానవ మాత్రుడు బాగుచేయలేనంతగా పాడైపోయింది. మంచి మాటలతో కాని బోధనల వలన కాని మార్పచెందలేనంతగా మానవులు చెడిపోయారు. కాని ఏ బాషలో చెపితే వారికి అర్ధమౌతుందో ఆ బాషలోనే వారికి చాలా స్పష్టంగా దేవుడు చెప్పనున్నాడు.

ఈ అంత్యదినాలలో క్రైస్తవులనే వారే దేవుని నామానికి అవమానం తెస్తూ పాపాలలో పడిపోతుంటే మరి భక్తిహీనుల పరిస్థితేంటి? “మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు?” (1 పేతురు 4:18). ఆలోచించండి!!!