అసలు విశ్వాసమంటే ఏమిటి?

06/07/2011 12:58

అసలు విశ్వాసమంటే ఏమిటి?

          దేవుని వాక్యములో చాలా చోట్ల ఇలా వ్రాయబడివుంది. యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవు రక్షించబడుదువు. యేసునందు విశ్వాసముంచడం అంటే ఏమిటి? యేసుక్రీస్తును నమ్ముకోవడమా? లేదా ఏదైనా సువార్త సభలో చెయ్యెత్తడమా? దేవుని వాక్యం ఏమి చెపుతుంది?.

          యేసుక్రీస్తు ప్రకటించిన లేదా భోధించిన మెస్సేజ్ ని నమ్మి అనుసరించడమే యేసునందు విశ్వాసముంచడమంటే. ఇంతకి యేసు ప్రకటించినదేమిటి? యేసుక్రీస్తు సువార్తను ప్రకటించెను. మానవులకు ఇంతకంటే పెద్ద శుభవార్త వుండదు. యేసుక్రీస్తు దేవుని రాజ్యము గూర్చిన సువార్తను ప్రకటించెను. పరిశుద్ధులు మాత్రమే దేవుని రాజ్యమును చేరతారు. కనుక యేసునందు ఒక్కసారి విశ్వాసముంచితే సరిపోదు. దానిని కొనసాగించాలి. మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మనయెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము (హెబ్రి 12:2). పరిశుద్ధాత్మ ఫలాలలో విశ్వాసము కూడా ఒకటి. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. (గలతి 5:22). 

ఎవరిని విశ్వసించాలి?

          ఈ ప్రపంచంలో ఎవరు ఎవర్నైనా విశ్వసించవచ్చు. కాని నీవు విశ్వసించినది లేదా విశ్వసించిన వాడు మోసపూరితమైనదైతే నీ విశ్వాసము వ్యర్ధమౌతుంది. అంటే మనము ఎవరిమీద విశ్వాసముంచుతున్నామో అన్నది ముఖ్యమైన విషయం.

          గమనించండి! ఒక అమ్మాయి తనను పెళ్లిచేసుకొంటాడని ఒక తెలిసిన ఒక అబ్బాయి మీద విశ్వాసముంచింది అనుకొండి. తీరా ఆ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొంటే ఆ అమ్మాయి విశ్వాసము ఏమౌతుంది? ఆ అమ్మాయి విశ్వాసముంచడం అనే ప్రక్రియలో తప్పులేదు కాని ఒక నమ్మకస్తుడుకాని అబ్బాయి మీద విశ్వాసముంచి తప్పుచేసింది. అలాగే మన విశ్వాసము ఎవరిమీద లేదా ఏ మాట మీద ఉంచుతున్నాం అన్నది ప్రాముఖ్యమైన విషయం.

          యేసుక్రీస్తు సువార్తను ప్రకటించెను. ఆయన - నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమేగదా నేను పంపబడితినని వారితో చెప్పెను. (లూకా 4:43). అయితే ఆయనను మనం ఎందుకు నమ్మాలి? ఎందుకు విశ్వాసముంచాలి? ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. వాగ్ధానము చేయబడిన మెస్సయ్య. ఆయన జననం, మరణం ప్రత్యేకం. ఆయన నీతిమంతమైన జీవితం జీవించెను. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట కపటమును లేదు. మనకొరకు తన ప్రాణం పెట్టెను. క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలనుబట్టి నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను. ఆయన పాపముచేయలేదు; ఆయన నోటను కపటమును కనబడలేదు. ఆయన దూషింపడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదరింపక, న్యాయముగా తీర్పు తీర్చు (దేవునికి ) తన్నుతాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతివిషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. (1 పేతురు 2:21-24).

          ఆయన సువార్త ప్రకారం మనం పరిశుద్ధులమవుటకు తన శరీరం చీల్చి మార్గము ఏర్పరచినాడు. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమును, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది (హెబ్రి 10:19,20). మనకోసం ఆయన సిలువ మరణం పొందెను అన్న విషయం ఆ రోజుల్లో అన్యజనులకు వెర్రితనంగా అనిపించినది. ఎందుకంటే అలాంటి మరణం కేవలం ఒక భయంకరమైన నేరస్తుడికి వేస్తారు. సిలువనుగూర్చిన వార్త నశించుచున్నవారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. (1 కొరింథీ 1:18). అన్నింటికంటే ముఖ్య విషయంఆయన చెప్పినట్లు మూడు రోజుల తరువాత మరణం గెలచి తిరిగి లేచాడు.

          కనుక దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్తను ఖచ్చితంగా విశ్వసించవచ్చు. ఆయనయందు విశ్వాసముంచినప్పుడు మన జీవితాలలో స్వస్థత, జ్ఞానము, వివేకము, శాంతి, సమాధానము, పరిశుద్ధత మరియు చివరికి నిత్యజీవమును(రక్షణ) కలుగజేస్తాడు.

          యేసునందు విశ్వాసముంచడం అంటే ఆయన సువార్త యందు, ఆయన 31/2 సంవత్సరాల బోధయందు, ఆయన పరిశుద్ద జననం మీద, ఆయన మరణపునుధ్ధానాలమీద విశ్వాసముంచడం. జీవితంలో ప్రతి విషయం మరియు ప్రతిపని ఆయన వాక్యానుసారం చేయడమే విశ్వాసం. ఇలాంటి విశ్వాసం మాత్రమే రక్షిస్తుంది. అయ్యలారా, రక్షణ (నిత్యజీవమును) పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు - ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ (నిత్యజీవమును) పొందుదురని చెప్పిఅతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము(దేవుని సువార్తను) బోధించిరి. (అ.కా 16:30-32).

          కేవలం యేసుక్రీస్తు సువార్తను విని, పాపినని గుర్తించి, పాపం విషయమై నిజమైన పశ్చాత్తాపం చెంది, మారుమస్సు పొందినవారు మాత్రమే యేసునందు విశ్వాసం ఉంచినవారౌతారు. కనుక! యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవు రక్షించబడతావు.