ఈ లోకాధికారి ఎవరు? : God of this world

20/02/2010 10:08

       ప్రేమగలిగిన సృష్టికర్త సాతానును సృజించినాడా? సాతాను ఎవరు? సాతాను యొక్క పనేంటి? దేవుని వాక్యం ఏమిచెపుతుంది? ఈ విషయాలు మనం ఖచ్ఛిత్తంగా తెలుసుకోవాలి. దేవుడు ఈ సృష్టికంటే ముందుగా దేవదూతలను సృజించెను. దేవదూతలు మరణం లేనివి, సొంత నిర్ణయాలు తీసుకోగలవు. దేవుని వాక్యం మూడు ప్రధాన దేవదూతలను గూర్చి చెపుతుంది.

 

1) లూసిఫర్ (Light Bringer) : ఇప్పుడు సాతానుగా మారాడు. “తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కు ననున్న సభాపర్వతముమీద కూర్చుందును మేఘ మండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మన స్సులో అనుకొంటివిగదా? (యషయ 14:12-14)” .

2) గబ్రియేలు : రెండు సార్లు దానియేలుకు కనబడెను. (దానియేలు 8:16; 9:21). ఒకసారి బాప్తిస్మమిచ్చు యోహాను తండ్రియైన జకర్యాకు కనబడెను. (లూకా 1:39). మరియు ఒకసారి యేసుక్రీస్తు తల్లియైన మరియకు కనబడెను. (లూకా 1:26).

3) మిఖాయేలు : ఒక ప్రధాన దేవదూత. (దానియేలు 10:13), (యూదా 1:9).

          దేవుడు ప్రధాన దేవదూతయైన లూసిఫర్ ను మరికొంతమంది దేవదూతలను భూమిమీద ఏలుటకు నియమించెను. భూమి యొక్క సింహాసనమును లూసిఫర్ కు ఇచ్చినాడు. అయితే లూసిఫర్ దేవునికి విధేయత చూపించలేదు, లోబడలేదు. లూసిఫర్ దేవునికి వ్యతిరేఖముగా పాపం చేసి (ఆజ్ఞాతిక్రమమే పాపం) సాతానుగా (దేవుని శత్రువుగా) మారినాడు. ఇంకా వానితో ఉన్న దేవదూతలు దెయ్యాలుగా మారినాయి. అన్ని ప్రస్తుతం ఈ భూమి మీదే సంచరిస్తూ ఉన్నాయి. అవి మానవులను ఏమి చేయలేవు కాని కేవలం మానవుల మైండ్స్ లో చెడు ఆలోచనలు మాత్రమే పెట్టగలవు.

        లూసిఫర్ యొక్క పాపము వలన భూమి నిరాకారంగాను శూన్యంగాను మారిపోయింది. “భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధజలము పైన కమ్మియుండెను (ఆ.కా 1:2)” . ఈ సృష్టిలోనే మొట్టమొదటిగా పాపం జరిగింది. తరువాత దేవుడు భూమిని సరిచేసి ప్రతిసృష్టి చేసినాడు. ఆ క్రమంలో భూమి యొక్క సింహాసనము మీదనుండి సాతాన్ని తొలగించుటకు మనిషిని సృజించినాడు. అయితే మనిషికూడా దేవునికి విధేయత చూపకుండా పాపంచేసి దేవునికి దూరం అయినాడు. ఇంకా భూమియొక్క సింహాసము మీద సాతాను ఆసీనుడైయున్నాడు.

సాతాను యొక్క భయంకరమైన మోసం

                భూమిమీద సమస్త పాపములకు సాతాను వాని సంబంధులే కారణం. మానవ చరిత్ర మొదటినుండి ఇప్పటి వరకు మానవులను పాపానికి ప్రేరేపిస్తునే ఉన్నాడు. దేవుని వాక్యం సాతానుని ఈ లోకాధికారి అంటున్నది. “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశమువారికి ప్రకాశింప కుండునిమిత్తము, ఈ యుగసంబంధ మైన దేవత(ఈ లోకాధికారి) (God of this world) అవిశ్వాసులైనవారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసి యున్నాడు. (2 కొరింథీ 4:4)” . ఏ కార్యమైనా మనస్సులో ఒక ఆలోచనతో మొదలౌతుంది. అది మంచిదై నా లేదా చెడ్డదైనా సరే. మనిషికి దుష్ట ఆలోచనలు ఎందుకొస్తాయి? ఎలా వస్తాయి? మనస్సు కొంచం సేపు మంచిగా ఆలోచిస్తుంది. కొంచం సేపు ధారుణంగా ఆలోచిస్తుంది. ఒక క్షణం మంచిగా మరుక్షణమే ధారుణమైన ఆలోచనలు వస్తాయి. ఎందుకు? “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? (యిర్మియ 17:9)” . మానవ హృదయం ఎందుకింత మోసకరమైనది? ఎందుకింత ఘోరమైన వ్యాధికలది? ఎందుకంటే సాతాను మానవులను ధారుణంగా మోసం చేస్తున్నాడు. వివిధ రకాలైన చెడ్డ ఆలోచనలను మానవుల మనస్సులలో పెట్టగలిగే శక్తి వాడి కుంది. “మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైనవారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి (ఎఫెసి 2:2)” . “Satan is the prince of power of air. He is capable of broadcasting wrong moods and thoughts directly into the minds of the human beings”.  

             మన మనస్సులు direct గా సాతానుకి tune అయివున్నాయి. మన రేడియో వివిధ రకాల స్టేషన్ల యొక్క సిగ్నల్స్ ను రిసీవ్ చేసుకొనుటకు ఎలాగైతే tune చేయబడి ఉందో అలాగే మన మనస్సులు సాతానుకు tune చేయబడి ఉన్నాయి. సాతాను మరియు వాని సంబంధులు ఈరకంగా మోసం చేస్తున్నారు. “.... ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. (ఎఫెసి 6:12)” . మానవులు వారికే ఈ ఆలోచనలన్ని వస్తున్నాయన్న భ్రమలో, మోసంలో ఉన్నారు. ఈవిధంగా సాతాను ఈ ప్రపంచం మొత్తాన్ని తన దుష్ట ఆలోచనలతో పాపాలు చేయిస్తూ అందరిని భ్రష్టత్వములోకి నడిపిస్తున్నాడు. ఈ లోక ప్రభుత్వాలను, మతాలను, వ్యపారాలను, విధ్యను ప్రభావితం చేస్తూ సత్యం తెలియకుండా వివిధ రకాలుగా మోసంచేస్తూ మానవులను శాశ్వితంగా నిజమైన దేవునినుండి దూరం చేస్తున్నాడు.  

            మారుమనస్సు పొందినవ్యక్తి పరిశుద్ధాత్మను పొందుతాడు కాబట్టి సాతాను తంత్రములను (ఆలోచనలను) ఎరుగుటకు వాటిని ధైర్యముగా ఎదుర్కొనుటకు సాధ్యమౌతుంది. యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు సాతాను ఈ లోకాధికారిగా ఉంటాడు. యేసుక్రీస్తు రెండవ రాకడతో దేవుని రాజ్యము మొదలౌతుంది. అప్పుడు ఇంక జనములను మోసపరచకుండా సాతాను బంధించబడుతుంది. “అతడు ఆది సర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి పాతాళములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరములు గడచుపర్యంతము ఇక జనములను మోస పరచకుండునట్లు పాతాళము ను మూసి దానికి ముద్రవేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. (ప్రకటన 20:2,3)” .

            కాబట్టి! ప్రస్తుత ఈ లోకాధికారియైన సాతాను దేవుని సత్యమును మనం గుర్తించకుండా మోసంలో పడవేస్తున్నాడు. ◌