ఎండమావులు

01/05/2011 12:21

ఎండమావులు

        వేసవి వచ్చేసింది. మనదేశంలో ఎండలు విపరీతంగా వేస్తాయి. అయితే విపరీతమైన ఎండల్లో దూరంగా నీళ్లు కనబడతాయి. కాని అవి నీళ్లు కావు. మరియ దాహం తీర్చలేవు. వాటిని ఎండమావులంటారు. నీళ్లు లేని చోట నీళ్లకోసం మనం ఆరాటపడితే మనం నిరాశపాలవుతాం. మనదేశంలో రకరకాల ఋతులున్నాయి. వాటిలో వేసవికాలం ఒకటి. ఈ ఋతువులో కనబడే ఒక వింత ప్రక్రియే ఎండమావులు. ఈ ఎండమావులు మానవులకు ఎన్నో పాఠాలు నేర్పుతున్నాయి.

ఈలోక సుఖాలు

        పైన చెప్పిన ప్రకారం ఎండమావుల వలన దాహం తీరదు. ఎందుకంటే ఎండమావుల్లో నీళ్లు ఉండవు. కాని ఉన్నట్లు కనబడతాయి. అదే విధంగా ఈ లోకంలో మానవులకు ఎన్నో సుఖాలు, భోగాలు ఉన్నాయి. పంచేంద్రియాల ద్వారా మానవులు అనేక రకాల ఈలోక తప్పుడు ఆనందాలకు సుఖాలకు అలవాటు పడినాడు. కాని మానవ జీవితం చాలా పరిమితమైనది. ఈ లోక ఆనందాలు కేవలం కొంతకాలం వరకే మానవుల చుట్టు ఉంటాయి. కాని అవి మానవులయొక్క అన్ని వయసులలో ఆనందాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే మానవులయొక్క వయస్సు సహకరించదు. కనుక మానవ జీవితం పరిమితమైనది. గమనించండి. ఈలోక ఆనందాలు, సుఖాలు, భోగభాగ్యాలు శాశ్వితమైనవి కావు. ఒకనాటి ఆనందపు అనుభవం ఎన్నటికి అలానే ఉండదు. అవి కనబడి కనబడునట్లు ఉండే ఎండమావుల వంటివి.

        ఈలోక ఆనందాలు మనుషులకు మంచిగాను, ఆకర్షనీయంగాను మరియు శాశ్వితమైనవిగాను కనబడతాయి కాని నిజానికి అవి ఎండమావుల వంటివే. ఎందుకంటే ఈలోక ఆనందాల విషయంలో మనిషి ఎన్నటికి నిజమైన సంతృప్తి పొందలేడు.

లాజరు ఉపమానము

          ధనవంతుడు మరియు లాజరు ఉపమానములో మరణం తరువాత కలుగు శాశ్వితమైన ఆనంద స్థితిని గూర్చి యేసుక్రీస్తు తెలుసుకోమన్నాడు. ఈ ఉపమానంలో ధనవంతుడు తనకు ఇష్ట వచ్చినట్లు తాను ఈలోకపరంగా వివిధ రకాలుగా ఆనందించాడు. కాని లాజరు అలాంటి ఆనందాలేమి రుచి చూడలేదు కాని దేవునియందు ఆనందించాడు. అందుకు అబ్రాహాము - కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతనపడుచున్నావు.”(లూకా 16:25). అయితే ఈలోకంలో భోగభాగ్యాలో జీవించిన ధనవంతుడి జీవితం తనకు ఏమి ఉపయోగపడలేదు. కాని పేదరికం అనుభవించిన లాజరు జీవితం తనకు నిత్యజీవితానికి అర్హుడను చేసినది. అయితే మోసపోవద్దు కేవలం పేదరికంలో ఉన్నవారందరు నిత్యజీవం పోదుకోలేరు. కేవలం దేవునియందు ఆనందించిన జీవితాలు మాత్రమే లాజరు వలే నిత్యజీవానికి అర్హులౌతారు.

          ఈలోకంలో ఎంత భోగభాగ్యాలతో జీవించామన్నది లెక్కకురాదు కాని మరణం తరువాత వచ్చు మన జీవితం ఎలా ఉండపోతుందో అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అది ఈలోకంలో మనిషి జీవించే దేవుని సంభంధమైన జీవితం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎండమావుల వంటి ఈలోకపు తప్పుడు ఆనందాలు, సుఖాలు ఆశించరాదు.

ఏ ఎండకు ఆ గొడుగు

        శరీర సంభంధమైన లేదా శరీరానుసారమైన ఆనందాలన్ని ఈలోక ఆనందాలంటారు. మానవులు తమ తప్పులకు కప్పుకోవడానికి ఎలాంటి సాకులైన చెపుతారు. ఎండమావుల వంటి ఈలోకపు తప్పుడు ఆనందాలను అనిభవించడానికి ఎన్ని కారణాలైనా చెపుతారు. గమనిచండి. ఈలోక ఆనందాలు మనవుల మనస్సులకు తృప్తిపరచలేవు. అంటే దాహం తీర్చలేవు. ఎందుకంటే ప్రాధమికంగా అవి ఎండమావులవంటివి. యేసుక్రీస్తు సమరయ స్త్రీతో చెప్పినట్లుగా ఆయన మాత్రమే మానవులయొక్క దాహం తీర్చగలడు. “అందుకు యేసు - ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవము కలుగుటకై వానిలో ఊరెడి నీటిబుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.” (యోహాను 4:13,14). మరియు ఎన్నటికి శరీరానుసారమైన ఆనందాలవైపుకి మానవులు వెళ్లనవసరం లేదు.

        అయితే సాతాను భయంకారమైన ప్రేరణ వలన మానవుడు ఈలోకమును ఆశించి, తమ తప్పిదములను కప్పిపుచ్చుకోవాడానికి ఎన్నెన్నో రకాల కారణాలు చెప్పి ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు.

ఒకే ఒక మార్గం

        శరీరానుసారమైన మనస్సు దేవుని వ్యతిరేఖమైనది. “శరీరానుసారులు శరీరవిషయములను మనసుంతురు; ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది;అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావముగల వారు దేవుని సంతోషపరచనేరరు.”(రోమా 8:5-8). దేవునియందు భయభక్తులు కలిగి ఈలోక ఆశలను విసర్జించి విశ్వాసముతో యేసుక్రీస్తుని ఎవరైతే వెంబడిస్తారో వారుమాత్రమే శాశ్వితమైన దేవుని రాజ్యము చేరతారు. ఇదోక్కటే మార్గం.

                   ఎండమావులు ఎలాగైతే దాహం తీర్చలేవో అలాగే ఈ లోకం, దాని కోరికలు, నిన్ను ఎన్నటికి తృప్తిపరచలేవు. దేవుడు మానవులను ప్రేమంచి వారనుసరిస్తున్న పాపమార్గాలను తొలగించి, నిజమైన శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వదలచి తన కమారుడైన యేసుక్రీస్తుని పంపినాడు. కనుక యేసే మార్గము, సత్యము మరియు జీవమైయున్నాడు.