ఏమి తెలియదు

01/07/2012 11:51

ఏమి తెలియదు

మనకు ఏది తెలియదో, ఆ తెలియదనే సంగతి కూడా తెలియదు. మనము జన్మించినపుడు మనకు జీరో నాలెడ్జ్. ఇక ఆలోచించే వయస్సు వచ్చేసరికి ఏ నాలెడ్జ్ బుర్రలోకి వచ్చిందో తెలియదు. ఏదో జన్మించాము. చనిపోయేదాక బ్రతకాలి కదా అనట్లు బ్రతికేస్తాం. ఏదో ఒకటి చేసి బ్రతక్కపోతే మళ్లా నలుగురి లో నామోషి. ఇక నలుగురిలో నారాయణ అన్న సామెతలాగా జీవిస్తాము.

ఎప్పుడూ... మన దగ్గర లేనిదాని కోసం ఆరాట పడతాము. మన దగ్గర లేకపోయినా లెవెల్ కొట్టి మరి, మాకు కూడ ఉంది అని ఫోజులిస్తాము. మనకు చేతకానిది ఇంకెవరైన చేస్తే ఏడుస్తాము. చివరకు అది ఎవరైనా చేస్తారు అని కవర్ చేస్తాము. ఇంతచేసి చివరకు ఎలాగో బ్రతుకుతుంటే, జీవితంలో మనశ్శాంతి కరువైతుంది. ఇంక మింగలేక కక్కలేక అన్నట్లు ఈ సారికి ఈ జీవితం ఏలాగో అలా తొందరగా గడచిపోతే బాగుణ్ను అని అనిపిస్తుంది. ఎవరైన పుట్టినప్పుడు అందరితో సంతోషం నటిస్తాం. ఎవరైన చనిపోతే అయ్యో పాపం అని అందరితో భాద పడతాం.

మనకు ఉపయోగపడే వారికి గౌరవమిస్తాం. చక్కగా సంబోధిస్తాం. మన ఉపయోగం ఎవరికైతే ఉందో వారిని ఒక ఆటాడుకుంటాం. మన ఇంట్లో ఎలా ఉన్నా లేదా మన ఆలోచనలు ఎంత చండాలంగా ఉన్నా బయటకు మాత్రం చాలా చక్కగా చూపిస్తాం. ప్రస్తుతం పొజిషన్ బాగా ఉంటే గత జీవితం మర్చి పోతాం. లేకపొతే గతాన్నే పదేపదే అందరికి చెప్పుకుంటాం. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు లైఫ్ తయారౌ తుంది.

ఏలాగో కష్టపడి చదివి ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించిన తరువాత కూడా ఇదే తంతు. అసలు ఇంకా ఎక్కువగా ఉంటుంది. విషయం ఏమిటంటే ఈ సంగతులు సరైన కోణంలో చాలామందికి బోధపడేది ముసలి వయస్సులోనే. అప్పటి వరకు కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లే ఉంటుంది.

ఈ పరిస్థితి కేవలం పేదవారిలో మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరబడట్టే. ప్రస్తుతం చాలావరకు అందరిది ఇదే పరిస్థితి.  బేసిగ్గా మనకి మన జీవితం గురించి ఏమి తెలియదు. మనమెందుకు ఇలా ఉన్నామో అసలే తెలియదు. ఈలాంటి వారినే దేవుని వాక్యం ప్రకృతి సంబంధియైన మానవుడు అంటుంది.(“వారైతే అంధకారమైన మనస్సు గలవారై, తమ హృదయకాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానముచేత  దేవుని వలన కలుగు జీవములోనుండి వేరు పరచబడినవారై, తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.”(ఎఫెసి 4:18) వీరికి ఏమి తెలియదు, మనస్సు కేవలం భూసంబంధమైన సిస్టమ్ లో కొట్టిమిట్టు ఆడుతూ ఉంటుంది. ఏమైన తెలియాలంటే దేవుని సంఘమునకు వచ్చి నేర్చుకోవలెను. ◌