కృపా సత్యము

12/09/2010 14:58

           క్రైస్తవులు కృప, సత్యము అను మాటలు చాలా ఎక్కువుగా వాడుతుంటారు. ఇంతకి కృప అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? దేవుని వాక్యం ఏమి చెపుతుంది?

సత్యము :

        మన జీవితంలో సత్యము చాలా చాలా ప్రాముఖ్యమైనది. గమనించండి! సత్యం లేకపోతే అంతా చీకటి మయమౌతుంది. ఏది పడితే అది సత్యం అవదు. సత్యం అంటే నిరూపించబడిన నిజం. అయితే ఈ లోకంలో ఉన్న ప్రతివిషయం వెనుక మానవునికి ఒక సందేహం ఉంటుంది. అదేమిటంటే ఏది సత్యం? లేదా ఏది అసత్యం? అనే సందేహం. గమనించండి. సత్యం ఎల్లప్పుడు నిరూపించబడుతుంది. సత్యమును తెలుసుకొనుటకు ఇదొక్కటే మార్గం.

          బైబిల్ దేవుని వాక్యమే సత్యమని చెపుతుంది. (“నీ వాక్యమే సత్యము.”యోహాను 17:17) వాక్యం అనేకసార్లు నిజమని నిరూపించబడింది. గమనించండి. ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. పాపము వలన వచ్చు జీతం మరణం. (“పాపముచేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.” 1 యోహాను 3:4) సత్యం ఎల్లప్పుడు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. అంటే పాపం చేయు ప్రతివాడు మరణించాల్సిందే. నేరంచేయు ప్రతివాడు శిక్షకు పాత్రుడు. అలాగున పాత నిబంధనలో ఖచ్చితంగా నెరవేర్చబడింది. మనిషులు జన్మతోనే ఎవరు పాపులు అవరు. పాపం చేయడం వలన మనిషి పాపాత్ముడు అవుతున్నాడు. ఎందుకంటే పాపంలో(పాపంతో కాదు) జన్మిస్తున్నాడు కాబట్టి పాపం చేస్తున్నాడు. “నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.”(కీర్తనలు 51:5).  కనుక పాపం చేయు ప్రతివాడు శిక్షింపబడవలెను. ఇదే దేవుని వాక్యం చెపుతుంది. ఇదే సత్యము.

          సర్వ శక్తిమంతుడైన దేవుడు పాపాన్ని ఎంతమాత్రం క్షమించిడు. అయితే ఆయన ఒకటి చేస్తున్నాడు. అదేమిటంటే పాపిని ప్రేమిస్తున్నాడు. అతనిలో పాపాన్ని ద్వేశిస్తున్నాడు. దేవుడు సత్యవంతుడు కాబట్టి మానవులు చేసిన పాపానికి శిక్ష పడక తప్పదు.

కృప :

        కృప అంటే అర్హతలేని వారిపై చూపించు ప్రేమ. (ఉదాహరణ: పబ్లిక్ పరీక్షలలో గ్రేస్(కృప) మార్కులు అని ఉంటాయి. అంటే పరీక్ష పాస్ అవుటకు 1 లేదా 2 మార్కులు తగ్గిన ఎడల పాస్ అవుటకు ఈ మార్కులు కలుపుతారు. నిజానికి ఈ మార్కులు విధ్యార్ధి సంపాదించినవి కావు. ఇవి కేవలం కృప మార్కులు.) దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు. పాపాన్ని ద్వేశిస్తున్నాడు. కనుక శిక్షకు అర్హులైన మానవులందరిని కేవలం ఆయన కృపచేత వారిని శిక్షనుండి తప్పించి రక్షణ మార్గం చూపించినాడు. మానవులపైన పడవలసిన శిక్షను ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు మీద వేసినాడు.

ఈ రితిన దేవుడు తన కృప చేత మానవులందరి మీద పడాల్సిన శిక్షను తొలగించినాడు. నిజానికి మానవులు అందుకు అర్హులు కారు. అందుకే ఆయన కృప చూపించినాడు.

కృపాసత్యాలు కలిసిపోయినవి

        యేసుక్రీస్తుని కృపాసత్య సంపూర్ణుడని దేవుని వాక్యం అంటుంది. “ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.”(యోహాను 1:16) ఎందుకంటే ఆయనలో కృపా సత్యాలు కలిసిపోయినవి. ఆయనలో ఉన్న సత్యమేమో న్యాయము జరిగించమంటుంది. కృపయేమో దయచూపమంటుంది. మానవ జాతిని పాప ప్రభావం నుండి విముక్తి కలిగించుటకు కుమారుడైన యేసుక్రీస్తులో కృపాసత్యాలు కలిసిపోయాయి. అంటే శిక్ష విధించడమైనది మరియు మానవులు శిక్ష నుండి రక్షింపబడినారు కూడా!

మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తుతి కలుగునుగాక!