క్రొత్త నిబంధనా లేదా పాత నిబంధనా

18/02/2010 23:32

             చాలా మంది క్రైస్తవులు బైబిలలో ఉన్న క్రొత్త నిబంధన మాత్రమే చదివితే (లేదా పాటిస్తే) చాలని మరియు అనుకుంటారు. ఎందుకంటే యేసయ్య గురించి క్రొత్త నిబంధనలో ఉందని, చదవటానికి సులభంగా ఉంటుంది కాబట్టి. కొంతమందైతే పాతనిబంధనే మనం చదవాల్సింది. యెహోవాయే దేవుడు క్రొత్త నిబంధన అంతగా చదవాల్సిన పనిలేదు అన్నట్లు మాట్లాడతారు. ఇంతకి మనం చదవాల్సింది క్రొత్త నిబంధనా లేదా పాత నిబంధనా?

            యేసుక్రీస్తుకు ముందు వ్రాయబడిన గ్రంథం పాత నిబంధన. క్రీస్తు తరువాత వ్రాయబడిన గ్రంథం క్రొత్త నిబంధన. క్రైస్తవులంటే క్రీస్తును వెంబడించువారు. అయితే క్రైస్తవులు క్రొత్త నిబంధన పాటించాలా? లేదా పాత నిబంధన పాటించాలా?

నిబంధనలు

          గమనించండి! క్రొత్త నిబంధన ఉందంటే పాత నిబంధన కూడా ఉన్నట్లే. దేవుడు క్రీస్తునందు మాన వులందరితో క్రొత్త నిబంధన చేసియున్నాడు. తద్వారా అంతకుముందు దేవుడు మోషే ద్వారా చేసిన నిబంధన పాతదై పోయింది. కాని నిబంధన ఎన్నడు కొట్టి వేయబడదు. నిబంధన చేసుకున్న వారిలో ఎవరో ఒకరు చనిపోవువరకు. ఉదాహరణకు వివాహం ఒక నిబంధన. దేవుడు పాత నిబంధన ఇశ్రయేలు జనాంగముతో చేసియున్నాడు. ఇది ఇహలోక(భౌతికమైన) నిబంధన. ఇది భౌతికమైన వాగ్దానాలతో కూడిన నిబంధన. కాని క్రొత్త నిబంధన భౌతికమైన ఈ నిబంధన కంటే ఎంతో ఉన్నతమైనది. ఇది పరలోక నిబంధన. దేవుడు మానవులతో యేసుక్రీస్తునందు పరలోక సంబంధమైన నిబంధన చేసియున్నాడు. దీనికి భౌతికమైన వాగ్ధానాలు మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన ఫలితాలు వస్తాయి. మానవులు దేవుని కుమారులవుటకు(నిత్యజీవం పొందుటకు మరియు ఎన్నటికి మరణంలేని జీవితాలు పొందుటకు) ఈ క్రొత్త నిబంధన చేసియున్నాడు.

            ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసముంచు తారో వారు ఈ క్రొత్త నిబంధనకు సంబంధించి నియమాలు మరియు షరతుల(Terms and Conditions) క్రిందికి వస్తారు. క్రీస్తునందు విశ్వాసముంచడం అంటే కేవలం నమ్ముకోవడం మాత్రమే కాదు. ఈ క్రొత్త నిబంధన మీద మనం సంతకం చేసినట్లు. మరి నియమాలు మరియు షరతుల మీకు తెలుసా?

కాబట్టి ఎవరైనా డిగ్రి చదవాలంటే ఇంటర్మిడియట్ ఎలాయైతే చదివుండాలో అలాగే క్రొత్తచనిబంధనలోకి రావాలంటే ఖచ్చితంగా పాత నిబంధన తెలిసుండాలి. పాత నిబంధన క్రొత్త నిబంధనకు మూలం(Base) వంటిది. పాత నిబంధన క్రొత్త నిబంధనకు బాలశిక్ష వంటిది.  

             గమనించండి! యేసుక్రీస్తు మొదలుకొని తన 12 మంది శిష్యులు మరియు పౌలుతో సహా అందరు సమాజమందిరాలలో దేవుని వాక్య గ్రంథం చదివి బోధించారు. మరి వారందరు చదివింది ఏ గ్రంథం? అప్పటికింకా క్రొత్త నిబంధన వ్రాయబడలేదు కదా! వారందరు చదివింది పాత నిబంధన గ్రంథమే. క్రొత్త నిబంధనలో చాలా చోట్ల పాత నిబంధన వాక్యా లను ఎత్తి వ్రాసి వివరించారు. అలా అని పాత నిబంధన మాత్రమే చదవమని కాదు. యేసయ్య చాలా సార్లు ప్రశ్నలకు సమాధానం చెపుతూ "ఈ విధంగా వ్రాయబడి ఉన్నది" (లూకా 4:4) అని అన్నాడు. ఎక్కడ వ్రాయబడి ఉంది? పాత నిబంధన వాక్యంలో వ్రాయబడి ఉంది.క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన మొత్తం కలిపితేనే దేవుని వాక్యం.

పాత నిబంధనలో చరిత్ర, ధర్మశాస్త్రము, జ్ఞానము, సాహిత్యము మరియు ప్రవచనాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు జీవితము, మొదటి క్రైస్తవుల చరిత్ర, సంఘముకు వ్రాసిన పత్రికలు, నిజ దేవుని సంఘక్రమం మరియు ప్రవచనాలు ఉన్నాయి. నూతన నిబంధనలోకి వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని వాక్యం వలన జీవించవలెను. "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.(మత్తయి 4:4)" . ఇది ఎలాగా? గమనించండి. దేవుని వాక్యము మాత్రమే జీవము గలది. చాలా చాలా శక్తి గలది. "ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.(హెబ్రి 4:12). ఈ వాక్యమే ".....వాక్యము శరీరధారియై, కృపా సత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను (యోహాను 1:14)"

            కేవలం ఏదో ఒక నిబంధన మాత్రమే చదివితే మన ఆధ్యాత్మిక జీవితాలకు ఏమి ఉపయోగం ఉండదు. అంతేకాకుండా wrong directionలో వెళ్ళే అవకాశం ఉంది. దేవుని భక్తులు దైవావేశం పొంది దేవుని వాక్యము వ్రాసినారు. "దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది (2 తిమోతి 3:16,17)"..

            కాబట్టి క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన మొత్తం కలిపితేనే దేవుని వాక్యం◌