చెవులుగలవాడు వినును గాక!

29/04/2010 22:40

           ప్రతిరోజు మనం రోజువారి పనుల్లో నిమగ్నమైపోతాం. టైం ఎలా గడిచిపోయిందో కూడా ఒకోసారి తెలియదు. మనకు మన గురించి ఆలోచించే సమయం దొరకదు. దొరికిన మనం ఏదైనా ఆలోచిస్తాం గాని మన జీవితాలగురించి ఆలోచించడానికి ఇష్టం ఉండదు. దేవుని సంబంధమైన జీవితం గురించియైతే అసలు మనం ద్వేషిస్తాం.

          బ్రతుకుదెరువు (అంటే కూడు గూడు మరియు గుడ్డ) అనే పనిలో మన సమయం అంతా గడిచిపోయింది. దానికోసం నిత్యం రకరకాల పనులు చేస్తుంటాం. అవును చేసుకోవాలి. అది ఎవరు కాదనరు. కాని అందులో పడి అసలు జీవించడం అంటే ఏమిటో మరిచిపోతున్నారేమో గమనించుకోవాలి. ఎలా బ్రతకాలా? అని ఆలోచిస్తారు. మంచిదే! కాని అది మన భౌతిక జీవితం ఉన్నంతవరకు మాత్రమే పనికొస్తుంది. కాని నీవు మరణిస్తే ఏమౌతుంది? మరి దేనికింత ప్రాకులాట?

మరణం తరువాత    

                మరణించిన తరువాత మన ఆలోచనలు, మనకు దేనికి పనికిరావు. గమనించండి! మనం సిద్దంగా ఉన్నా లేకపోయినా ఒకనొక రోజున మనకు అన్ని అంతమైపోతాయి. ఇంక సూర్యోదయము, సూర్యస్తమయము రోజులు, గంటలు అనేవి మనకు ఉండవు. నీవు సంపాదించినవన్ని అవి నీకు గుర్తున్నా లేకపోయినా వేరేవాళ్లకు వెళ్లిపోతాయి. నీ అస్థి, గొప్పదనము, బలము అన్ని అనవసరమైపోతాయి. నీ కోపాలు, ఆవేశాలు, నిట్టూర్పులు, కక్షలు అన్ని మాయమైపోతాయి. అలాగే నీ ఆశలు, ఆశయాలు, ప్రణాళిలు అన్ని నిరుపయోగం అయిపోతాయి. ఒక్కప్పుడు నీకు ఎంతో విలువ అనిపించిన విజయాలు, ఓటములు గాలిలో కలిసిపోతాయి. నీ వంశం ఎలాంటిది, ఎంత బాగా బతికావు, ఎంత గొప్పవారితో జీవించావు అనేవి అన్ని వ్యర్ధమే. నీవు అందగాడివా, మేధావివా, పురుషుడువా, స్త్రీవా, మంచి చర్మపు రంగు గలవాడివా అనేవన్ని అప్రస్తుతమైపోతాయి.

                ఎప్పుడైనా ఆలోచించారా? యేసుక్రీస్తు, చర్చీలు, దేవుని వాక్యం, ప్రార్ధనా సభలు దైవసేవకులు మొదలైనవన్ని చెప్పేది లేదా బోధించేది దేనిగురించి? బ్రతుకుదెరువు గురించేనా? కాదు. ఈ బ్రతుకు తరువాత వచ్చే జీవితం గురించి అవి బోధిస్తున్నాయి. దేవుడు నిత్యజీవమును యేసుక్రీస్తునందు మనకు వాగ్దానము చేసినాడు. “అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము. ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము. ”(రోమా 6:22,23).  చాలామంది బ్రతుకుదెరువు గురించి మాత్రమే దేవుని సేవ చేస్తున్నారు. వారు వారి జీతం ఖచ్చితంగా పొందుకుంటారు.

                   ఆ జీవితం గురించి ఈనాడే తెలుసుకొని దానికి అర్హత సాధించటానికి ఈ జీవితంలోనే మనలను మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ జీవితం ప్రస్తుతం మనం జీవించే ఈ జీవితాల మీద ఆధారపడిఉంది. చెవులుగలవాడు వినును గాక!