జ్ఞానము

03/04/2011 14:34

       దేవునియందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమని దేవుని వాక్యం చెపుతుంది. మరి దేవుని యందు భయము మరియు భక్తి కలిగిఉంటే జ్ఞానం ఎలా అవుతుందో తెలుసా మీకు? ఆదాము మొదలుకొని ఈనాటి వరకు మానవుడు ఎంతో అభివృద్ధి చెందినాడు. నాగరికత బాగా అభివృద్ధి చెందినది. రాతియుగం నుండి ఈనాటి అంతరిక్ష యుగం వరకు మానవుడు అనేక క్రొత్త క్రొత్త విషయాలను పరిశోధించి వివిధ రకాలుగా అభివృద్ధి చేందినాడు. ఇలా అభివృద్ధి చెందడానికి మానవునికున్న ఒకటే ఒక మార్గం ‘ప్రయోగం’ (Experiment: Trial and Error). ప్రయోగం చేస్తాడు కాని ప్రయోగ ఫలితం ఏమిటో తెలియదు. కాని ఏదో ఒక ఫలితాన్నిస్తుంది. ఈవిధంగా మానవుడు క్రమక్రమంగా కాలక్రమంలో అభివృద్ధి సాధించాడు.

          ఈరోజున మన ప్రయాణాలన్ని ఇంతకుముంద్దెన్నడు లేని విధంగా చాలా చాలా వేగవంతమైనవి. అలాగే విద్య, వైద్యం మరియు వార్తలు కూడా చాలా వేగవంతమైనవి. మానవుడు అనేకరకాల టెక్నాలజీలలో అభివృద్ధిని సాధించాడు. కాని భయంకరమైన విషయం ఏమిటంటే పాపాలు చేయడంలో కూడా అభివృద్ధి బాగానే సాధించాడు. అందుకే రోజుకో క్రొత్త రోగం వస్తుంది.

మానవుడు టెక్నాలజీలో ఇంత అభివృద్ధి చెందినా గాని ఇంకా అంతు తెలియని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.

          ఈ యొక్క భౌతిక జ్ఞానం వలన మనం అభివృద్ధి అయితే సాధించాము గాని మానవ హృదయంలో ఉన్న అవినీతిని, పాపాన్ని, దుష్టత్వాన్ని తీసివేయడంలో మనం ఇంకా అభివృద్ధి సాధించలేదు. మానవుడు నాగరికతను అలవర్చుకుని బాగానే అభివృద్ధి చెందాడు కాని మనిషి మాత్రం మారలేదు. అంటే అన్ని అభివృద్ధి చెందాయి కాని మానిషి మాత్రం అభివృద్ధి చెందలేదు. ఎందుకని?

నేనెవరు?

        ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా కాని మనిషి మాత్రమే ఎందుకు మారడం లేదంటే అతనేవరో అతనికి తెలియదు. మనిషికి అన్నిరకాల జ్ఞానం ఉంది కాని అసలు నేనెవరిని ఇక్కడ భూమి మీద ఎందుకున్నాను అని ప్రశ్నించుకొనే జ్ఞానం రావడం లేదు. మనచుట్టు ఉన్న పరిసరాలను గమనిస్తే మనిషి ఒక ప్రత్యేకమైన మరియు ఉన్నతమైన జీవి అని తెలుస్తుంది. అయితే ఇతను ఈ భూమి మీద ఎందుకు పెట్టబడ్డాడో, ఎక్కడనుండి వచ్చాడో, ఎక్కడికి వెళుతున్నాడో అనే జ్ఞానం సంపాదించడం చాలా అవసరం. కేవలం మానవులను సృజించిన సృష్టికర్త మాత్రమే ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలడు. అప్పుడు మానవజీవితాల్లో వివాహం, కుటుంబం, సహజీవనం మొదలైనవి ఎందుకు ఏర్పాటుచేయబడ్డాయో అర్ధం అవుతుంది. గమనించండి. దేవుని యందు భయము భక్తి కలిగిన వారికి మాత్రమే ఈ జ్ఞానం ఇయ్యబడుతుంది. కనుక దేవునియందు భయభక్తలు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము.

నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించుము.

          మానవ చరిత్రలో ప్రభువైన యేసుక్రీస్తు తరువాత రాజైన సొలోమాను ఒక గొప్ప జ్ఞాని. దేవుడు సొలోమానును తనకేం కావాలో కోరుకోమన్నప్పుడు అతను డబ్బునికాని, బంగారమును కాని, రాజ్యాధికారమునుకాని కోరుకోకుండా, జ్ఞానం ఉంటే ఇవన్ని సంపాదించుకోవచ్చు అని ఎరిగినవాడై జ్ఞానం అనే వరాన్ని అడిగినాడు. అందుకే చరిత్రలో ఒక జ్ఞానిగా మిగిలిపోయాడు.

          సృష్టికర్తయైన యేసుక్రీస్తు మానవునిగా జన్మించి మనలో ఒకనిగా జీవించినాడు. ఆయన మనవులకు వారి బలహీనతలను తెలియజేసి, వారు ఆనందంగా జీవించడానికి జ్ఞానయుక్తమైన ఎన్నో బోధలు చేసినాడు. ఆయన బోధించిన వాటిలో కొన్ని మాటలు

 1. నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించుము.
 2. మనుష్యుడు రొట్టెవలన మాత్రమే కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట వలన జీవించును.
 3. హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
 4. నీ కంటిలో నున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుట ఏల?
 5. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. మీ ముత్యములను పందులయొదుట వేయకుడి.
 6. మంచి చెట్టు చెడ్డ ఫలములను ఫలింపనేరదు. పనికిమాలిన చెట్టు మంచి ఫలముల ఫలింపనేరదు.
 7. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకరాక్యములో ప్రవేశింపడు కాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
 8. ఎవడును పాతబట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు.
 9. రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు కదా?
 10. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
 11. తనకు తానే విరోధముగా వేరు పడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు.
 12. హృదయము నిండి యుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా?
 13. మీరు మార్పునొంది చిన్న బిద్డలవంటివారైతే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

 

యేసుక్రీస్తు మానవులను అత్యధికంగా ప్రేమించి వారికొరకు తన ప్రాణమును పెట్టెను. ప్రేమించడం అంటే ఏమిటో ఆయన ప్రేమించి చూపించాడు. ఆయన మానవులను ప్రేమించిన ప్రకారం మానవులందరు ఒకరినొకరు ప్రమించుకోమన్నాడు. మానవులు ఒంటరిగా జీవించడం మంచిది కాదని ఎల్లప్పుడు ఐక్యంగా సహవాసముతో జీవించాలని బోధించినాడు.

          మానవులు టెక్నాలజీలలో అభివృద్ధిని సాధించారు కాని మనిషి నిజంగా అభివృద్ధి సాధించాలంటే యేసుక్రీస్తు చెప్పినట్లు మారుమనన్సు పొంది ఐక్యంగా సహవాసము చేస్తు ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగియుండాలి. కాబట్టి దేవునియందు భయభక్తులు కలిగియుండుటయే మనిషి జ్ఞానానికి మూలం.

 

భయభక్తులు

        దేవునియందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానము. అంటే ఏమిటి? దేవుడు సర్వశక్తిమంతుడని నీవు గుర్తించాలి. ఈ సర్వ సృష్టిని అందులోని జీవరాశిని శూన్యమునుండి నిర్మించినాడు. మహా శక్తి కలిగిన దేవుని ఎడల మానవులందరు భయము కలిగియుండవలెను. తప్పు చేసిన వారినందరిని ఆయనే శిక్షించును. దేవునికి మరియు దేవుని నిజమైన దాసులకు అందరు భయపడవలెను. పాపముచేయు ప్రతివాడు ఆయన శిక్షనుండి తప్పించుకోలేడు. దేవుడు వేయు అంతిమ శిక్ష నరకము.

          అంత సర్వశక్తిమంతుడైన దేవుడు నిత్యము కోపించువాడు కాదు. ఆయన ఈ లోకమును ఎంతోగానో ప్రేమిస్తున్నాడు. ఆయన మానవులందరి ఎడల మహా ప్రేమను కలిగియున్నాడు. మానవుల పాప పరిహారం కొరకు ఆయన తన కుమారుడునే బలి ఇచ్చినాడు. ఆయన ఆజ్ఞలను అందరు పాటించి ఆయనకు లోబడవలెను. కనుక ఎవరైతే దేవునికి లోబడతారో వారు దేవుని ఎడల భక్తి కలిగిన వారౌతారు. అలాంటివారి యొక్క జీవితము నిజముగా ఆనందమయమౌతుంది. చివరకు నిత్యజీవము పొందుకొంటారు. కనుక ఎవరైతే దేవుడు వాగ్దానము చేసిన నిత్యజీవమును పొందుకొంటారో వారు మాత్రమే నిజముగా జ్ఞానము కలిగినవారు.

          కనుక దేవునియందు భయము మరియు భక్తి కలిగియుండుటయే జ్ఞానము.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++