దేవుని దృష్టిలో స్త్రీ యొక్క ప్రాముఖ్యత

09/05/2010 09:30

దేవుని దృష్టిలో స్త్రీ ఎలాంటి ప్రాధాన్యతను కలిగియుందో తెలియాలంటే క్రింద వ్రాయబడినది ఖచ్చితంగా చదవాలి. అది ఏమిటో చూద్దాం.

          అసలు స్త్రీ ఎలా సృష్టించబడింది? ఎందుకోసం సృష్టించబడింది? వివాహమైన తరువాత స్త్రీ ఎలా ఉండాలి? స్త్రీ చర్చిలో ఎలా ఉండాలి? స్త్రీ యొక్క నిజమైన అందం ఏది? ఈ ప్రశ్నలన్ని స్త్రీలందరు ఒకసారి వేసుకున్నట్లయితే లేదా ఆలోచించినట్లయితే, నిజమే కదా! ఏమిటి? ఎందుకు? అని ఆశ్చర్యపోతాం. కాని వాటన్నింటికి సమాధానం మన దగ్గర ఉందా? ఖచ్చితంగా వీటన్నిటికి సమాధానం ఉన్నాయి. కాని ఒక విషయం. ఇలాంటి ప్రశ్నలు గురించి ఆలోచించే శక్తి మరియు మైండ్ దేవుడు మనకు ఇచ్చాడు? ఒకసారి నీవు వీటన్నింటి  గురించి ఆలోచించు. ఈ ప్రశ్నలన్నింటికి ఖచ్చితమైన సమాధానాలు దేవుని వాక్యంలో ఆధారాలతో సహా ఉన్నాయి.

          దేవుడు మానవులను సృజించి వారు ఎలా జీవించాలో చాలా చక్కగా తెలియపరిచాడు. పురుషులు స్త్రీలు వారెందుకు సృష్టించబడ్డారో తెలుసుకొని జీవించాలి. కాని ఈ రోజున విచ్చలవిడిగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు నడుస్తున్నారు. అసలు స్త్రీలు వారెవరో, ఎందుకు సృష్టించబడ్డారో తెలియని అంధకారంలో ఉన్నారు. ఏం చేయాలో తెలియక మరియు చెప్పేవారులేక ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు. కాని ఎవ్వరు మొసపోవద్దు. “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.”(గలతి 6:7).

స్త్రీ ఎలా, ఎందుకు, ఎవరికోసం సృష్టించబడింది?

          అసలు మనం దేవుని పోలికలో ఉన్నాం. అంటే దేవుడు మనలో తనని తాను నిర్మించుకొంటున్నాడు. ఎవరైతే తన సొంత ఇష్టంతో దేవునికి విధేయులౌతారో వారు దేవుని కుటుంబంలో జన్మిస్తారు.

          దేవుడు అనేక జీవులను సృజించాడు. అవి నేలపై తిరిగేవి, ఆకాశంలో ఎగిరేవి, నీటిలో తిరిగేవి. అయితే ఏ జీవికి దేవుడు మేధస్సు(మైండ్) అనుగ్రహించలేదు. అవన్ని మూగజీవులు. కాని దేవుడు మానవులకు మాత్రం మేధస్సు(మైండ్) అనుగ్రహించాడు. అందుకే మనం ఆలోచిస్తున్నాము. అందుకే మనం అనేక రకాలుగా ప్రవర్తించగలం(We can express ourselves in so many ways.). కేవలం మానవుడు మాత్రమే ప్రత్యేకమైనవాడు. దేవుడు మనిషికి మాత్రమే ఇంత ప్రత్యేకత ఎందుకో ఇప్పుడు మనకు అర్ధమైయింది.

దేవుడు స్త్రీని సృజించాడు. కాని స్త్రీ కంటే ముందుగా నరుని సృజించాడు. దేవుని స్వరూపమందు మరియు పోలికలో వానిని సృజించాడు. “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.”(ఆ.కా1:27).

          దేవుడు మనిషిని దేనినుండి సృష్టించెను? దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించాడు. వాని నాసికారంధ్రములలో జీవ వాయువు ఊదగా నరుడు జీవించు ఆత్మ ఆయెను.  “దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.”(ఆ.కా 2:7).

          అయితే దేవుడు అన్నింటిని సృష్టించినప్పుడు ప్రతిజాతి చొప్పన ఒకటి మగదిగాను మరోది ఆడుదిగాను అంటే ఒక జతగా వాటిని సృజించాడు. అలానే నరుడుని సృష్టించి ఆదాము అని పేరు పెట్టెను. ఆదాముని మాత్రం తన పోలికలో తన స్వరూపంలో సృజించాడు. అంటే మానవుడు దేవుని జాతిలో సృష్టించబడ్డాడు. కాని ఆదాము ఒంటరిగా ఉన్నాడు. తనకు జతలేదు. ఈ సృష్టిలో అన్న జీవులకు తోడు ఉన్నది. కాని ఆదాముకు తనతో మాట్లాడటానికి ఎవరులేరని మరియు నరుడు ఒంటరిగా ఉండటం మంచిదికాదని గ్రహించి, వానికి సాటియైన సహాయమును చేయులనుకొనెను. “మరియు దేవుడైన యెహోవానరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయ మును వానికొరకు చేయుదుననుకొనెను.”(ఆ.కా2:18).

          ఒకరోజు దేవుడు ఒక స్త్రీని ఆదాము యొద్దకు తీసుకొనివచ్చెను. అయితే ఆ స్త్రీని ఎక్కడనుండి తీసుకువచ్చాడు? దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి దానిని మాంసముతో నింపి స్త్రీనిగా నిర్మించి ఆదాము యొద్దకు తీసుకొని వచ్చెను. “అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.”(ఆ.కా2:21,22).  అప్పుడు ఆదాము ‘నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము. నీవు నాలోనుండి తీయబడ్డావు కాబట్టి నారి అనబడతావనెను. “అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.”(ఆ.కా 2:23).

          గమనించండి. వారిద్దరు ఏకశరీరం కలవారు. అందుకే దేవుడు ఇలా అన్నాడు. “కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.”(ఆ.కా2:24). అంటే స్త్రీ పురుషుడు వేరుకాదని ఇక్కడ అర్ధం. అయితే పురుషుడులోనుండి ఒకభాగం తీసి స్త్రీనిగా నిర్మించెను. స్త్రీ పురుషునిలోనిదేగాని వేరు కాదు. అందుకే పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును.

          కనుక పురుషుని కొరకే స్త్రీ సృష్టింపబడింది. “మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింపబడలేదు.”(1 కొరింథీ 11:9).

అయితే ప్రస్తుతం స్త్రీ ఎలా ఉంది?        

          ఈ రోజున స్త్రీ ఎ విధంగా ఉంది? తన ఆలోచన, నడువడి, ఏ విధంగా ఉంది? ఆమె దేనికోసం పరుగెడుతుంది? దేనికి ఆమె ప్రాముఖ్యతనిస్తుంది? వివాహం అయిన తరువాత ఆమె ఎటువంటి ఆలోచన ధృక్పదం కలిగియుంటుంది? మన చుట్టు ఉన్న ప్రపంచం కొంచం గమనిస్తే స్త్రీ వివిధరకాల పరిస్థితుల్లో ఉంటు తన ఉనికిని మరియు జీవిత పరమార్ధాన్ని మరచిపోయినట్లుంది.

          అంటే కొంతమందికి డబ్బు పిచ్చి, అందం పిచ్చి, మతం పిచ్చి, కులం పిచ్చి మరియు కుటుంబరాజకీయాల పిచ్చి ఇంకా అనేక రకాలైన అలవాట్లకు బానిసై అదే జీవితం అనుకొంటు జీవిస్తున్నారు. అసలు తనకేం కావాలో తనకే తెలియడం లేదు. ఇదే జీవితమనుకుంటే దేవుడు స్త్రీని సృష్టించడంలో అర్ధమే లేదు. ఉపయోగం కూడా లేదు. దేవుడు ఆమెను అలా ఉండాలని చెప్పలేదు. మరి స్త్రీ ఎలాంటి క్యారక్టర్ దేవుడు కలిగియుండాలని చెపుతున్నాడు?

          దేవుడు తన క్యారక్టర్ని మనలో నిర్మించుకొంటున్నాడు. అంటే ఆయన స్వభావాన్ని మనం కలిగియుండాలి. మరి మనం ఎలాంటి స్వభావం కలిగియున్నాము? దేవుడు నిన్ను దేనికోసం మరియు ఎందుకు సృజించాడో ఎప్పుడైనా ఆలోచించావా? నీ పట్ల దేవునికున్న ప్లాన్ మరియు సంకల్పం ఏమైయున్నదో ఒక్కసారైనా ఆలోచించావా?

          స్త్రీలు ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి? ఆమె కలిగియుండవలసిన నిజమైన అందం ఏది?

స్త్రీ యొక్క నిజమైన అందం ఏమిటి?

        అసలు స్త్రీ ఎలాంటి అందం కలిగియుండాలి? ప్రస్తుత లోకం చూస్తే అందం గూర్చి ఆరాటపడని ఆడవారుండరు. ఈ రోజున అందం కోసం ఎన్నో క్రీములు. అది యొక పెద్ధ వ్యాపారం. నిజానికి దాని ఉపయోగం ఏమిలేదు. అది కేవలం వ్యర్ధమే. మరి ఈ లోకానుసారులైన స్త్రీలు సాతాను మోసములోపడి అందం కోసం పరుగులెడుతున్నారు. కనుక ఏమి పెట్టుకుందాం? ఏం ధరించుకుందాం? ఏ విధంగా మేంటెన్(Maintain) చేద్దాం? అని బయటకు కనిపించే శరీరం గూర్చి విపరీతంగా ఆలోచిస్తారు? దీని వలన ఈ లోకసంబంధముగ అందంగా కనబడవచ్చు కాని అది అక్కడ జ్ఞానం లేకపోతే లేదా మంచి క్యారక్టర్ లేకపోతే అది ఎందుకు పనికిరాదు. “వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది.”(సామెతలు 11:22).

          దేవుడు మన బాహ్యసౌందర్యాన్ని చూడడు కాని మన అంతరంగ అందమును చూస్తాడు. అంటే మన హృదయమును చూస్తాడు. దేవుని ఇచ్చిన జీవితమును గౌరవిస్తూ ప్రతి స్త్రీ తన స్వపురుషులకు లోబడియుండవలెను. మరియు సాధువైనట్టియు మృదువైన స్వభావమును కలిగియుండాలి. వివాహం కాని యువకులు చూసి తమకు ఇలాంటి స్త్రీ పెండ్లి భార్యగా కావాలని కోరుకోవాలి. ఈవిధంగా మాదిరిగా తన క్యారక్టర్ కలిగియుండాలి. ఇదే ఒక స్త్రీకి ఉండవలసిన నిజమైన అందం. ఇలాంటి అందం దేవుని దృష్టిలో చాలా విలువైనది. “సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగస్వభావముమీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది”. (1 పేతురు 3:4).  ఇలాంటి కొంతమంది పరిశుద్ధ స్త్రీల గురించి దేవుని వాక్యంలో వ్రాయబడింది. “అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.  ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను.”( 1 పేతురు 3:5,6).

          స్త్రీలు వినయంగా, నమ్రతగా నెమ్మదిగా, ఓర్పుకలిగి, సహనం కలిగి, తనను తాను తగ్గించుకొని మరియు అన్నింటికి తట్టుకొనే మనస్సు కలిగియండి తన భర్తకు లోబడేదే నిజమైన విలువగల స్త్రీ జీవితం. ఇలా జీవించడం చాలా కష్టం. కాని ఇదే స్త్రీల యొక్క జీవిత ఉద్ధేశ్యము. ఇలా జీవించిన స్త్రీ జీవితం మాత్రమే ధన్యమౌతుంది. “మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రములచేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్ క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.”(1 తిమోతి 2:9).

          అంతేకాక స్త్రీలు మౌనముగా ఉండాలి. అంతేకాని ఉపదేశించుటకు మరియు తన స్వపురుషని మీద అధికారం చేయుటకు ఆమెకు సెలవియ్యబడలేదు. ఎందుకంటే మనం ఆత్మసంబంధంగా ఆలోచించినట్లయితే పురుషుడేమో యేసుక్రీస్తు సంఘమేమో స్త్రీ. కనుక సంఘము యేసుక్రీస్తుకు లోబడాలే కాని అధికారం చూపడానికి అవకాశం లేదు. “స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణవిధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారముచేయుటకైనను ఆమెకు సెలవియ్యను.”( 1 తిమోతి 2:11,12).

          యౌవనస్త్రీలు తమ జీవిత భాగస్వామిని ఎంచుకొనుటలో తమ అందం ఉపయోగించకూడదు. అలా చేస్తే మీరే చాలా చాలా పశ్చాత్తాప పడవలసి వచ్చును. గ్రహించండి. తమ భర్తను ఎంచుకొనుటలో మీ నిజమైన అందం అంటే జ్ఞానం వివేకం ఉపయోగించవలెను. దేవుని సహాయంతో మీ అంతరంగ స్వాభావమును మాత్రమే ఉపయోగిస్తే మీకు మంచి వివాహ జీవితం అనుగ్రహించబడుతుంది.

          మరి నీవు ఎలాంటి అందం కలిగియున్నావు? దేవునికి మనం ఎలాఉంటే ఏమి? ఎందుకు మనమీద ప్రేమచూపి మనకోసం ప్రాణం పెట్టాడు? మన జీవితాలయొక్క మహిమగల ఉద్దేశ్యాన్ని నెరవేర్చట కొరకేగదా!!

సంఘములో స్త్రీ ఎలా ప్రవర్తించాలి?

        ప్రభువైన యేసుక్రీస్తు మనం ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలో మాదిరి ఉంచిపోయెను. స్త్రీల యొక్క క్రైస్తవ జీవతం ఎలా కొనసాగించాలో బోధించి దేవుని వాక్యములో పొందుపరిచాడు.  స్త్రీలు ప్రార్ధించునప్పుడు లేదా ప్రవచించునప్పుడు ఖచ్చితంగా ముసుగు వేసుకోవలెను. లేనిచో వారి జుత్తును కత్తిరించుకొనవలెను. ఇలాగు చేయలేకపోతే వారు దేవుడిచ్చిన తన జీవితాన్ని అవమానపరిచిన వారౌతారు. “ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.  స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తలవెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించుకొనుటయైనను స్త్రీ కవమానమైతే ముసుకు వేసికొనవలెను. ”(1 కొరింథీ 11:5,6).

          సంఘములో స్త్రీలు మౌనముగ ఉండవలెను. అంటే తను సంఘములో బోధించుటకు ఆమెకు సెలవియ్యబడలేదు. “స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను వారు లోబడియుండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవులేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.”(1 కొరింథీ 14:34).  కాని ప్రత్యేకముగా స్త్రీల కొరకు ముఖ్యముగా యవ్వన స్త్రీలకు కుటుంబ జీవితము గురించి దేవుని వాక్యము ద్వారా నేర్పవచ్చు. సంఘములో ఉన్న స్త్రీలు దేవునిదృష్టిలోగల నిజమైన మంచి పనులను చేయవలెను. వారు నడవడి అంతా దేవుని నామానికి విలువ తెచ్చేదిలాగ ఉండవలెను. “దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్ క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.”(1 తిమోతి 2:10).

కుటుంబములో స్త్రీ ఎలా ఉండాలి?

        వివాహం అయిన తరువాత స్త్రీకి తన కుటుంబం ఏర్పడుతుంది. వివాహమైన స్త్రీలు ఈ లోక ఉద్యోగాలు చేయకుండా ఉండటమే దేవుని దృష్టిలో ఉత్తమం. వారు వారి వివాహ జీవితాలలో పిల్లలను కని మరియు కుటుంబమును జాగ్రత్తగా చూసుకోవలెను. ఇలా ఉండటమే స్త్రీలకు సుఖము సంతోషము ఆరోగ్యకరము. ఇలా స్త్రీల జీవితాలు ధన్యమౌతాయి. స్త్రీలు ఇలా ఉండటమే వాక్యానుసారం. “కాబట్టి యౌవనస్త్రీలు వివాహము చేసికొని, పిల్లలు కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను.” (1 తిమోతి 5:14).

          దేవుడు మానవులను సృజించి వారు ఎలా జీవించాలో చాలా చక్కగా తెలియపరిచాడు. పురుషులు స్త్రీలు వారెందుకు సృష్టించబడ్డారో తెలుసుకొని జీవించాలి. దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు ప్రవర్తించాలి. భర్తకు లోబడాలి. భర్తను ప్రేమించాలి. పిల్లలను ప్రేమించి వారి మంచి బుధ్ది కలుగునట్లు పెంచాలి. ముఖ్యంగా ఎల్లప్పుడు ఇంటిలోనే ఉండుటకు ఇష్టపడాలి. వారి మంచి జీవితం ద్వారానే ఇతరులకు బోధించాలి. “దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు, యౌవనస్త్రీలు తమ భర్తలకు లోబడుచు, పతిప్రియులును శిశుప్రియులును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధిచెప్పుచు, మంచి ఉపదేశము చేయువారునై యుండవలెననియు బోధించుము.”(తీతు 2:3).

          కుటుంబములో భర్తే నాయకుడు. ఆ పాత్రను స్త్రీ పోషించకూడదు. వివాహజీవితంలో స్త్రీలు ప్రతి విషయంలోను భర్తకు లోబడాలి. ఎందుకంటే భర్తే స్త్రీకి శిరస్సు. ఈ విషయం చాలామందికి తెలిసిన పాటించలేక అనేక శ్రమలు కష్టాలపాలౌతున్నారు. “స్త్రీలారా, ప్రభువునకువలె మీ స్వపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై యున్నుడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతివిషయములోను తమ పురుషులకు లోబడవలెను.”(ఎఫెసి 5:22-24).  గమనించండి! కేవలం భర్త మంచివాడైతే ఇలా ఉండాలని దేవుడు చెప్పలేదు. కానుక వివాహమైన ప్రతి స్త్రీ ఈవిధంగా జీవించాలి. ఇదే దేవుని వాక్యానుసారం. “మెట్టుకు మీలో ..............., భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.” (ఎఫెసి 5:33).  దైవభక్తిగల స్త్రీలు భర్తను గౌరవించడం మరియు భర్తను లోబడటం మరియు భర్తకు భయపడటం వంటివి చేయుటం కేవలం భర్తను సృజించిన ఆ గొప్ప దేవునికి మీరు చేసినట్లవుతుంది. పురుషుడు దేవునికి మహిమయైయున్నాడు. అలాగే స్త్రీ పురుషునికి మహిమయైయున్నది. “పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునైయున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది”(1 కొరింథి 11:7).

దేవుని మార్గం

        దేవుని వాక్యమే సత్యం. “నీ వాక్యమే సత్యము.”(యోహాను17:17). దేవుని వాక్యం మాత్రమ మానవ జీవితాలకు దిశానిర్ధేశం చేయగలదు. ఈ మార్గం తప్పా వేరే మార్గమే లేదు. దేవుని సువార్తవిని లోబడిన దైవభక్తిగల స్త్రీలు యొక్క హృదయాలలో పరిశుద్దాత్మ వలన దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. “మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది”.(రోమా 5:5). దేవుడు మిమ్మును దీవించును గాక!!!