దేవుని సంఘం ఎందుకు

03/04/2011 14:28

అసలు దేవుడు సంఘమును ఎందుకు ఏర్పాటు చేశాడో ఎప్పుడైనా ఆలోచించారా?

సంఘం అంటే ఎమిటి? సంఘమును ఎవరు స్థాపించారు? ఎందుకు స్థాపించారు? అనే ప్రశ్నలు ప్రతి క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యం. ఇవి తెలియకుండా ఎవరూ క్రైస్తవుడవరు అంతేకాకుండా అతడు దేవుని సంఘ సభ్యుడవడు.

సంఘం అంటే ఏమిటి?

        దేవుని సంఘము అను మాట గ్రీకు పదం ‘ఎక్లీషియా’ నుండి వచ్చినది. ఎక్లీషియా అంటే పిలువబడిన వారి యొక్క సమూహం లేదా గుంపు.  పిలువబడిన వారు అంటే ఏవరు? ఎవరు పిలుస్తారు? ఎవరిని పిలుస్తారు? ఎక్కడనుండి పిలుస్తారు?

          జీవంగల దేవుడు పాపులైనా మనుషులను పిలుస్తున్నాడు. ఈ పాప ప్రపంచంలో నుండి లేదా పాప జీవితంలో నుండి నీతిగాను పరిశుద్దంగా జీవించుటకు, దేవుని సత్యవిషయాలను నేర్చుకొనుటకు మరియు చివరకు నిత్యజీవమును పొంది దేవుని రాజ్యములోకి ప్రవేశించుటకు పిలుస్తున్నాడు.

          ఎవరైతే తనను తాను పాపి అని గుర్తించి మరియు పరిశుద్ద జీవితం కొరకైన తృష్ణ కలిగియుంటారో అలాంటి వారిని దేవుడు పిలుస్తాడు. కాని దేవుడు ఎవరిని పిలుస్తాడో ముందుగా ఎవరికి తెలియదు. ఈలాగు పిలువబడినవారిని దేవుని సంఘము అంటారు. వీరు దేవుని సంఘము ద్వారా దినదినము విశ్వాసములో ఎదుగుతూ క్రీస్తు వచ్చు పర్యంతము దేవుని సాక్షులుగాను, అనేకులకు మాదిరిగాను జీవితమును కొనసాగిస్తారు.

సంఘమును ఎవరు, ఎందుకు స్థాపించారు?

        దేవుడు మొదట ఆదాము, అవ్వను సృజించి, ఏదేను తోటలో వారిని ఉంచి, వారు జీవించటానికి వారికి ఆజ్ఞలు ఇచ్చినాడు. అయితే వారు తినవద్దన్న పండుతిని దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినారు. ఫలితంగా వారు మరణ పాత్రులైనారు. అంతేకాకుండా జీవ వృక్షఫలం తినే అర్హత కోల్పోయినారు. అంటే నిత్యజీవమును పొందే అర్హత కోల్పోయినారు. “అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.”(ఆ.కా. 3:24) వారియొక్క అవిధేయతకు ఫలితం ఇదే.

          కాని దేవుడు మానవులను ఎంతో ప్రేమించెను. కనుక అర్హత కోల్పోయిన మానవ జాతికి ఆ నిత్యజీవమును మరలా వారికి తన కుమారుని ద్వారా అందుబాటులోకి తెచ్చినాడు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారుడుగాపుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”(యోహాను 3:16). దేవుని ఆజ్ఞలను అతిక్రమించి మానవులు చేసిన పాపానికి (“పాపముచేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.” 1 యోహాను 3:4 ) దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించి మానవుల యొక్క పాపాన్ని పరిహరించినాడు. కనుక ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుతారో వారందరు పాప క్షమాపణ పొందుకొంటారు. “మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్ణీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.”( 1 యోహాను 1:9). అంతే కాకుండా మానవుడు అర్హతకోల్పోయిన నిత్యజీవమునికి కూడా వారిని పాత్రులుగా చేసినాడు. “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు; కుమారునికి విధేయుడు కానివాడు జీవముచూడడు గాని దేవుని యుగ్రత వాని మీద నిలిచియుండును.” (యోహాను 3:16).

          కాబట్టి ఎవరైతే ఈ విషయములయందు విశ్వాసముంచి పాప క్షమాపణ పొంది, మారుమనస్సు విషయమై బాప్తిస్మము పొందుతారో వారిని దేవుడు యేసుక్రీస్తు యొక్క సంఘములోకి ఆహ్వానిస్తాడు. ఇలా ప్రవేశించిన మానవులు దినదినము అన్న విషయాలలో ఎదుగుతూ, యేసుక్రీస్తు యొక్క గుణగణాలను ప్రచురముచేస్తు, దేవుని శక్తి కలిగి అనేకులకు మాదిరిగా ఉంటూ, క్రమంగా యేసుక్రీస్తులోకి రూపాంతరం చెందుతారు. అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.(1 పేతురు 2:9)

          ఆ తరువాత యేసుక్రీస్తు రెండవ రాకలో తిరిగి వచ్చినప్పుడు పిలువబడిన వారందరు నిత్యజీవం పొందుకొని నిరంతరం యేసుక్రీస్తుతో పాటు ఈ సృష్టియావత్తును పరిపాలిస్తారు. ఈ యొక్క గొప్ప ఉద్దేశ్యం కొరకే యేసుక్రీస్తు సంఘమును స్థాపించినాడు.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++