దేవుని ప్రభుత్వం

07/08/2012 13:33

                        యేసుక్రీస్తు రాజుగా దేవుని ప్రభుత్వము రానైయున్నది. ఆయన పరిశద్ధ శిష్యులే ఆ ప్రభుత్వంలో పాలకులు. ఇదే యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త. “ఆయన - నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే గదా నేను పంపబడితినని వారితో చెప్పెను (లూకా 4:43)”.  ఇది ప్రజాసామ్య ప్రభుత్వం కాదు. ఇది రాజరిక ప్రభుత్వం. ఇది ఈ లోక సంభందమైన ప్రభుత్వము కాదు. మానవులు ప్రభుత్వాల వంటిది కాదు. ఇది అంతములేని ప్రభుత్వము. “అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు; వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. (దానియేలు 7: 17,18)”. పరిశుద్ధులు, ఆత్మసంబంధంగా తిరిగి జన్మించిన వారు, నిత్యజీవం పొందినవారు, మరణం లేనివారు ఈ యొక్క ప్రభుత్వములో పాలకులు. వీరు యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు. దేవుని రాజ్యమన్నా, పరలోక రాజ్యమన్నా ఈ దేవుని ప్రభుత్వమే.  “జన సమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. (లూకా 9:11)”.

                      ఆయన తన మొదటి రాకలో వచ్చి, తన ప్రభుత్వములోకి(రాజ్యములోకి) రాజులుగా మరియు యాజకులుగా ఉండుటకు మానవులను పిలిచినాడు(ఆహ్వానించినాడు). “అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. (1 పేతురు 2:9)”. తన రెండవ రాకతో ఆయన ప్రభుత్వము మొదలౌతుంది. కాని మానవులు అర్హతలేని పాపులు. అందుకే ముందుగా తన మరణం ద్వారా పాప పరిహారం చేసి మానవులు పరిశుద్ధులవుటకు అర్హులుగా చేసినాడు. “ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారుని రాజ్యనివాసులనుగా చేసెను. ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది”(కొలస్సి 1:13, 14). ఇప్పుడు ఎవరైతే ఆయన మాట విని, విశ్వసిస్తారో వారు నిత్యజీవం పొందుకుంటారు మరియు వారే ఆయన ప్రభుత్వములోకి వస్తారు. ఆయన ఎవరిని బలవంతం చేయడు. ఇదే యేసుక్రీస్తు ప్రకటించిన రాజ్యసువార్త.

                    ఆయన రెండవరాకలో వచ్చినప్పుడు మొదటి 1000 సంవత్సరాలు ఈ భూమి మీద పరిపాలన జరుగును. చనిపోయిన పరిశుద్ధజనము ముందుగా పునరుత్థానము చెందుతారు. ఆ తరువాత బ్రతికియున్న  పరిశుద్ధజనము పునరుత్థానము చెందుతారు. యేసుక్రీస్తు రాజులకు రాజుగా ఆయన శిష్యులు రాజులుగా ప్రభుత్వము చేస్తారు. వీరినే ప్రధమ ఫలాలంటారు. “ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునైయందురు ఇట్టివారిమీద రెండవ మరిణమునకు అధికారములేదు; ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యముచేయుదురు.”(ప్రకటన 20:6).  పాలింపబడు వారు మానవులే. 1000 సంవత్సరాల తరువాత మరి కొంతమంది ఆయన ప్రభుత్వమలోకి చేర్చబడతారు. వీరు నిత్యజీవము పొందుకుంటారు కాని ప్రధమ ఫలములవంటి ఆధిక్యత ఉండదు. తరువాత ఈ ప్రభుత్వము తండ్రియైన దేవునికి అప్పగించబడి సృష్టి యావత్తుకు విస్తరింపబడుతుంది. “అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.” (1 కొరింథి 15:24)

                      ఈ ప్రభుత్వములోకి వచ్చేవారందరు నిత్యజీవము కలవారు. మరి మిగిలినవారి పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు సువార్తను ఒకసారైన వినని వారు, విని కూడా విశ్వసించనివారు, లేదా అబద్ధబోధ విని మోసపోయిన వారి పరిస్థితి ఏంటి? ఆదాము మొదలుకొని 1000 సంవత్సరాల రాజ్యము అంతము వరకు ఈ ప్రభుత్వములో చేరని వారి పరిస్థితి ఏంటి? దేవుడు ప్రేమకలిగినవాడు. ఆయన అందరిని సమానంగా  ప్రేమిస్తున్నాడు. ఇలాంటి వారందరికి ఒక మంచి అవకాశము ఉంది. 1000 సంవత్సరాల రాజ్యము అంతములో వీరందరు భౌతికంగా బ్రతికింపబడతారు. (ఉ.దా యేసుక్రీస్తు లాజరును బ్రతికించినట్లు). అప్పుడు చివరిసారిగా ఈ రాజ్యసువార్త వీరికి ప్రకటింపబడుతుంది. అప్పుడు విశ్వసించిన అనేకులు దేవుని ప్రభుత్వములోకి (రాజ్యములోకి) చేర్చబడతారు. ఇంకా విశ్వసించని వారు మరియు ఒకప్పుడు విశ్వసించి వెనుకకు తిరిగినవారు మహాతీర్పులోనికి వెళ్ళి ఆ తరువాత నరకములో(అగ్నిలో) నశించి పోతారు.

                      నిత్యజీవం పొందిన మానవులందరు యేసుక్రీస్తుతో పాటు యుగయుగాలు ప్రభుత్వము చేయుదురు. “నేను జయించి నా తండ్రితో కూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను.”(ప్రకటన 3:21). దేవుని రాజ్యము అంతములేనిదై చిరకాలము ఈ యావత్తు సృష్టిని పరిపాలిస్తుంది.