నిజమైన సువార్త : True Gospel

18/02/2010 11:18

         యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త మీరు విన్నారా? ఆయన 3½ సంవత్సరాలు ఈ భూమి మీద సంచరించి సువార్తను ప్రకటించినాడు. కేవలంఈ సువార్తను విశ్వసించడం ద్వారా మాత్రమే మనం రక్షింపబడతాము.ఎవరైనా క్రైస్తవుడవ్వాలంటే కనీసం దేవుని సువార్త తెలిసియుండాలి. ఒకవేళ మీరు క్రైస్తవులని మీరనుకొంటే మీకు ఖచ్చితంగా దేవుని సువార్త అర్ధ మైయుండాలి. ఎందుకంటే “దేవుని సువార్త”ను విని, నమ్మి, పశ్చాతాపపడి, మారుమనస్సు పొంది మరియు విశ్వసించుట వలన మనుష్యులు రక్షణలోకి (పరలోకానికి) వస్తారు. మనం రక్షింపబడుటకు దేవుడి చ్చు శక్తే సువార్త. “ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీకుదేశస్తునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. (రోమా 1:16)” .

        ప్రస్తుతం అనేక రకాల సువార్తలు ప్రచారంలో ఉన్నాయి. అనేక మంది సువార్తికులు మరియు అనేక చర్చీలు నిత్యము సువార్తను ప్రకటిస్తున్నట్లు చెపుతారు. రేడియో ద్వారా, TVల ద్వారా మరియు మహాసభల ద్వారా అనేక మంది సువార్తను ప్రకటిస్తున్నట్లు చెపుతారు. అయితే వీరందరు ప్రకటిస్తున్నది దేవుని సువార్తేనా? అసలు దేవుని సువార్త అంటే ఏమిటి? దేవుని వాక్యం ఏమి చెపుతుంది?

         గాస్పల్ ( Gospel ) అంటే సువార్త లేదా శుభవార్త అని అర్ధం. ఈ ప్రపంచంలో మొట్టమొదటి సారిగా దేవుని సువార్తను ప్రకటించినది ఎవరు? యేసుక్రీస్తు తన 30వ యేట దేవుని సువార్తని ప్రకటిం చడం ద్వారా సేవను ప్రారంభించాడు. “యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడై యుండెను. (లూకా 3:23)”. ఆ తరువాత తన శిష్యులు కొనసాగిం చారు. తండ్రి యైన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మానవులందరి కొరకు ఒక శుభ సందేశం (Message) పంపించినాడు. “యేసు వారితో ఇట్లనెను-.... నేను దేవునియొద్దనుండి బయలు దేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. (యోహాను 8:42)”. ఇంతకి ఆ సువార్త సందేశం ఏమిటి?

        దేవుని సువార్తను అర్ధం చేసుకొంటే మానవుల యొక్క భవిష్యత్తు ఎంత మహోన్నతమైనదో అర్ధమౌతుంది. మానవుల కొరకు సృష్టికర్త పంపించిన ఎంతో ఆనందకరమైన, ఉన్నతమైన ఊహలకందని శుభవార్తే ఈ సువార్త. మానవులు ఈ భూమి మీద ఎందుకు ఉంచబడ్డారో కేవలం ఈ సువార్త ద్వారా మాత్రమే తెలియబడు తుంది. మానవ జీవితానికి అర్ధం పరమార్ధం తెలిపేదే ఈ శుభవార్త. దేవుడు తనను తాను మానవునిలో నిర్మిం చుకొంటున్నాడు. అందుకే దేవుని కుటుంబములోకి మానవులను ఆహ్వానిస్తున్నాడు. మానవ కుటుంబము లో జన్మించివారు మానవులు మరి దేవుని కుటుంబములో జన్మించువారు?

        యేసుక్రీస్తు 3½ సంవత్సరాలు ఈ భూమి మీద సంచరించి సువార్తను ప్రకటించినాడు. రాబోవు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించెను. “యోహాను చెరసాలలో వేయబడిన తరువాత యేసు-- కాలము సంపూర్ణమై యున్నది, దేవుని రాజ్యము సమీపించి యున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను (మార్కు 1:14,15)”. కేవలం ప్రకటించి నాడు (just an Announcement). అంగీకరించమని గాని, నమ్మమని గాని, పాటించమని గాని యేసుక్రీస్తు ఎవరిని ఎన్నడూ బలవంతం చేయలేదు. యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశంలో అనేక పట్టణములలోను సంచరించి దేవుని రాజ్యసువార్తను ప్రకటించెను. “ఆయన - నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలె ను; ఇందునిమిత్తమే గదా నేను పంపబడితినని వారితో చెప్పెను (లూకా 4:43)”. ఆయన గ్రామములలో కూడా సంచరించి దేవుని రాజ్యసువార్తను ప్రకటించెను. “అటు పిమ్మట ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతిగ్రామములోను సంచారము చేయుచుండగా (లూకా 8:1)”. దేవుని సువా ర్తను అందరు అర్ధం చేసుకొను రీతిగా ప్రకటింపబడలేదు. ప్రస్తుతం కొంతమందికే ఆయన శిష్యులవుటకు ఆ యొక్క గ్రహింపు అనుగ్రహింపబడింది. “ఆయన శిష్యు లు - ఈ ఉపమానభావ మేమిటని ఆయనను అడుగగా, ఆయన - దేవుని రాజ్య మర్మములెరుగుట మీకు అను గ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండనట్లు వారికి ఉపమానరీతిగా బోధింపబడు చున్నవి. (లూకా 8:9,10)”.

        ఆయన తనను వెంబడించిన జనసమూహములందరికి చాలా ఓపికగా దేవుని రాజ్యసువార్తను క్షుణ్ణంగా ప్రకటించెను.    “జనసమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. (లూకా 9:11)”. యేసుక్రీస్తు పన్నెండుమంది  శిష్యులను ఏర్పరచు కొనెను. వారికి కూడా అధికారమునిచ్చి దేవుని రాజ్యసువార్తను ప్రకటించుటకు పంపించెను. “ఆయన తన పన్నెండు మంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటకును వారినంపెను. (లూకా 9:1,2)”.

        యేసుక్రీస్తు ఒక వ్యక్తిని సువార్తను ప్రకటించు టకు పిలిచినప్పుడు అతడు తన తండ్రి చనిపోయినా డని తనను పాతిపెట్టి వస్తానని చెప్పెను. అయితే దేవుని రాజ్యసువార్త ఈ లోకంలో అన్నింటికంటే ప్రాముఖ్యమైనదని ముందు దేవునిరాజ్యమును ప్రకటించమని చెప్పెను. “ఆయన - మృతులు తమ మృతులను పాతిపెట్టు కొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. (లూకా 9: 60)”.

    గమనించండి. దేవుని రాజ్యమును తెలుసు కొనడమే అన్నింటికంటే ముఖ్యమైనది. “కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి; అప్పడవన్నియు మీకనుగ్రహింపబడును.(మత్తయి   6:33)”. యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణమవక ముందు మరియొకమారు దేవుని రాజ్యమును గూర్చి బోధించెను. “ఆయన శ్రమపడిన తరువాత  నలువది దినముల పర్యంతము వారికగుపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములనుచూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను. (అ.కా 1:3)” .

      యేసుక్రీస్తు శిష్యులు ఏ సువార్తను ప్రకటించెను? శిష్యుడైన ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించెను. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమునుగూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతనిని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి. (అ.కా 8;12)”. అయితే దేవుని రాజ్యమును కనుగొనువారు కొందరే. వారు అనేక శ్రమలననుభవించి దేవుని రాజ్యములోకి ప్రవేశిస్తారని యేసుక్రీస్తు శిష్యులు భోధించినారు. “శిష్యుల మనస్సులను దృఢపరచి -విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అను భవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలె ననియు వారిని హెచ్చరించిరి. (అ.కా 14:22)”. అపోస్తులుడైన పౌలు ప్రకటించిన సువార్త ఏమిటి? దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను పౌలు ప్రకటించెను. పౌలు ఎక్కువ శాతం అన్యజనుల మధ్య దేవుని సువార్తను ప్రకటించెను. “ఇదిగో (దేవుని) రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించు చుంటిని గదా? (అ.కా 20:25)” .

        దేవుని రాజ్యసువార్తను గురించి పౌలు చాలా మంది మొండి వారితో కూడా తర్కించాడు మరియు అనేక విధాలుగా వివరించాడు. “తరువాత అతడు సమాజమందిరము లోకి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమునుగూర్చి తర్కించుచు, ఒప్పించుచు,  ధైర్యము గా మాటలాడుచు మూడు నెలలు గడిపెను. (అ.కా19:8)” .  పౌలు రాబోవు దేవుని రాజ్యమును గూర్చిన  సువార్తను అనేక ఆధారాల ద్వారా నిరూపించి వివరించి ప్రకటించినాడు. “అతని బసలోకి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములో నుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను.(అ.కా 28:23)” . మరియు “ఏ ఆటంకమునులేక పూర్ణధైర్యముతో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. (అ.కా 28:31)” .

        గమనించండి. ఈ లోకసంబంధమైన అర్హతలు (ఈలోక ధనికులు, పేరుప్రతిష్టలు గలవారు, విద్యావంతులు, గొప్పవారు) దేవుని రాజ్యాన్ని అర్ధంచేసు కొనుటకు మరియు చేరుటకు ఏమాత్రము ఉపయోగపడవు. “నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి;  ఈ లోకవిషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానముచేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా? (యాకోబు 2:5)” .

        మరి మీరు యేసుక్రీస్తు భోధించిన ఈ శుభవార్తను ఎప్పుడైనా విన్నారా? దేవుని రాజ్యసువార్త యొక్క పూర్తి వివరణ కోసం దేవుని రాజ్యమును గూర్చిన ఆర్టికల్ చదవండి. ◌