నిత్యజీవము -- Eternal life

28/04/2010 21:46

             మన ఈ చిన్న జీవితంలో అనేక వివిధ సంధర్బాలలో రకారకాలుగా స్పందిస్తాం. కాని చావుపుట్టకలు గూర్చి మాట్లడితే మాత్రం, ఏంటి వేధాంతం మాట్లడుతున్నారు అని తేలిగ్గా చూస్తాం. కాని మనం మన జీవితాల గురించి ఖచ్ఛితంగా ఆలోచించాలి. లేకపోతే మనిషిగా పుట్టినందుకు అర్ధమే ఉండదు. మానవుడు ఎందుకు జన్మించాలి? కొన్ని సంవత్సరాలకే ఎందుకు మరణించాలి? నిత్యము ఎందుకు జీవించకూడదు? ఎప్పుడైనా ఆలోచించారా?

          ఈ ప్రపంచంలో మరణాన్ని ఎవరు కోరుకోరు. కాని మానవులకు మరణం తధ్యం. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఎంత ఆస్థిపరుడైనా, ఎంత విద్యావంతుడైనా, ఎంత గొప్పవంశీకుడైనా, ఎంత గొప్ప పేరుప్రతిష్టలు గలవాడైనా, మంచివాడైనా, చెడ్డవాడైనా మరియు ఏ మతస్తుడైనా మరణం తప్పనిసరి.

          మనిషి కేవలం క్షణబంగురమైన ఈ మానవ జీవితం కొరకు నానాగడ్డి తింటు, శ్రమలు, కష్టలు,మోసాలు, ద్రోహాలు చేస్తు జీవిస్తున్నాడు. ఇంకా రోగాలు రొప్పులు వలన బహు ప్రయాస పడుతు జీవితాన్ని సాగిస్తున్నాడు. మనిషి బ్రతికేది కేవలం 80 సంవత్సరాలు లేదా కొంచం బలముంటే 90 సంవత్సరాలు. దీనికోసమే గదా మనిషి ఇంత ప్రయాసపడుతున్నాడు. కాని నిత్యము జీవించే జీవితాలను అంటే మరణమే లేని జీవితాలను దేవుడు మానవులకు ఇస్తానంటున్నాడు. గమనించండి! దేవుడు నిత్యజీవమును మానవులకు వాగ్దానము చేసినాడు.

          గమనించండి! మానవులమైన మన పుట్టుక మన చేతిలో లేదు. మనం పుట్టిన తరువాత అంటే కొన్ని సంవత్సరాలకు మనకు ఆలోచించే వయస్సు వచ్చినప్పుడు మాత్రమే మనం జన్మించామన్న సంగతి అర్ధమౌతుంది. అసలు నేనెందుకు పుట్టాను అనే ప్రశ్నవేసుకుంటే అప్పుడు అర్ధమౌతుంది ‘నా జన్మ నా చేతిలో లేదు’. నన్నెందుకు కన్నారు అని తల్లిదండ్రులను అడుగగలమే కాని మన చేతిలో ఏమి లేదు. కనుక ఈ జీవితం కొనసాగించాల్సిందే! కాని మొదటి మానవుడైన ఆదాము ఎందుకు జన్మించాడో తెలుసుకొంటే మన పుట్టకకు కూడా కారణం దొరుకుతుంది.

          దేవుడు ఆదామును అవ్వను సృజించి, ఏధేను తోటలో ఉంచి, చాలా clear గా చెప్పాడు. “ఫలించండి, అభివృద్ధి చెందండి మరియు ఈ భూమిని ఏలండి”. అలా ఒక అద్బుతమైన మానవ జీవితాన్ని ఇచ్చాడు. దీనితోపాటు దేవుడు మనిషికి నిత్యము జీవించి ఉండేటట్లు చేయాలనుకున్నాడు. దేవుడు అసలు మానవులను సృజించిడానికి కారణం ఇదే. అందుకే దేవుడు మానవుని ముందు ఒక ప్రపోజల్ పెట్టినాడు. నీకు నిత్యజీవం కావాలా? లేదా మరణం కావాలా? మానవుడినే డిసైడ్ (నిర్ణయించుకోమని) చేసుకోమన్నాడు.

          దేవుడు ఆ తోటలో రెండు ప్రత్యేకమైన చెట్లు మొలిపించినాడు. ఒకటి జీవృక్షఫలముల చెట్టు మరొకటి మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలముల చెట్టు. ఒకటేమే నిత్యజీవము చూచిస్తుంది. మరొకటేమే మరణమును చూచిస్తుంది. నిర్ణయం మనిషిదే. ఏ ఫలము తినాలంటే అది తినవచ్చు. అయితే మానవుడు సాతానుచేత మోసగించబడి మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలం తిని మరణపాత్రుడైనాడు. దేవుని మాటను వినకుండా సొంతనిర్ణయం తీసుకొన్నాడు. ఫలితం -ఆనాటి నుండి మరణం మానవులను ఏలుతుంది. కనుక నిత్యజీవము మనిషిని అందకుండా మూయబడింది. (సాతాను ఎవరు? ఎందుకు మోసం చేసింది: దీనికోసం మాకు వ్రాయండి, లోకాధికారి ఎవరు అనే ఆర్టికల్ని ఉచితంగా పంపిస్తాం.)

          ప్రేమగల దేవుడు మారణపాత్రుడైన మనిషిని అలానే వదిలివేయలేదు. నిత్యజీవమునకు మరల ద్వారం తెరిచినాడు. నిత్యజీవమును తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చాడు. దేవుడు మానవులను ఎంతో ప్రేమించాడు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారుడుగాపుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”(యోహాను 3:16). మానవులు దేవుని పోలిక మరియు ఆయన స్వరూపం. పాపంతో, మరణభయంతో నిత్యం వేదన అనుబవిస్తున్న మానవ జీవితాలకు దేవుడు క్రీస్తునందు నిత్యజీవము అను వరమును అందుబాటులోకి తెచ్చాడు. “ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.”(రోమా 6:23).

          మానవుడు చేసిన ఆ అవిధేయతకు ప్రతిగా దేవుడు యేసుక్రీస్తు మీద శిక్ష విధించాడు. మనిషి చేసిన పాపాలకు క్షమాపణ యేసు క్రీస్తు మరణం ద్వారా అనుగ్రహింపబడింది. అందుకే క్రీస్తుయేసునందన్న వారికి ఏ శిక్షావిధి లేదు. “కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.”(రోమా 8:1). వారు మరణంలో నుండి జీవములోనికి దాటియున్నారు.