నీవూ జీవిస్తున్నావు!!

06/07/2011 13:01

నీవూ జీవిస్తున్నావు!!

జీవితంలో మనకు ఎన్నో కోరికలు, ఆశలు, ప్రణాళికలు ఉంటాయి. ఈ వయస్సులో ఇది చేద్దాం. ఆ వయస్సులో అది చేద్దాం అని అనుకుంటూ ఉంటాం. ఫలాన ప్రదేశం చూసొద్దాం, ఫలాన ఇల్లు కట్టుకుందాం. ఫలాన ఆహారం తిందాం. లైఫ్ ని బాగా ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటూ ఉంటాం. ఫలాన వారిని ప్రేమిద్దాం మరియు పెళ్లి చేసుకొందాం. ఇంతమంది పిల్లల్ని కందాం అని అబ్బో ఎన్నో ఆలోచనలు.

            గమనించండి. ఇవన్ని అలోచించడానికి మరియు కార్యరూపం దాల్చడానికి నేను అను ఒక మనిషిని ఉన్నాను. నేను అనేవాడిని లేకపోతే ఇన్ని ఆలోచనలు లేవు. నేను జీవిస్తున్నాను కనుక నాకు ఇన్ని రకాల ఆలోచనలకు అవకాశం వచ్చింది. అవును నేను లేదా మానవులు ఇక్కడకు ఎలా వచ్చారు? ఇంతకు ముందేమి జరిగిందో తెలియదు, తరువాత ఏం జరుగుతుందో అసలే తెలియదు కాని ప్రస్తుతానికి నేను మాత్రం జీవిస్తున్నానని మాత్రం నాకు తెలుసు. నాకులాగే ఇది చదువుచున్న నీవు కూడా జీవిస్తున్నావు.

            అవును నేను జీవిస్తున్నాను. ఇలా నేను ఎంత కాలం జీవిస్తానో తెలియదు కాని నాకు మాత్రం ఇది బాగుంది. తినడం, త్రాగడం, చూడడం, వినడం, తాకడం, రుచి చూడడం, చలించడం, అలోచించడం అబ్బ చాలా బాగున్నాయి. నా మనస్సు పెట్టి ఆలోచించినప్పుడు ఇవన్ని చాలా బాగున్నాయి కదా అని అనిపిస్తుంది. అవును నేను జీవిస్తున్నాను. ఈ జీవితం ఒక అద్బుతం.

            మనం కొంచం న్యాయంగా ఆలోచిస్తే, ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా ఎవరు చేశారు? ఇలాంటి పరిస్థితిని ఎవరు కల్పించారు? అని ప్రశ్నించుకోకపోవడం నా దృష్టిలో పెద్ద తప్పు. నీవూ జీవిస్తున్నావు. నీవు ఎప్పుడైనా ఇలా ఆలోచించావా? మనకు ఇంతమంచి ఒక పరిస్థితిని కల్పించిన వారెవరోగాని వారికి కనీసం థ్యాంక్స్ చెప్పాలని అనిపిస్తుంది. జరిగిన మేలుల విషయమై మనము కనీసం కృతజ్ఞత కలిగిఉండవలెను కదా!

            నేను జీవిస్తున్నాను. కాని నా మనస్సులో ఒక ప్రశ్న ఉన్నది. అదేమిటంటే నా భవిష్యత్తు ఏలా ఉంటందా అని. చాలామంది జీవించినవారు మన ముందే మరణించారు. నాకు కూడా ఇలా సంభవిస్తుంది అని తెలుసుకున్నాను. కాని నాకు ఈ జీవితం బాగుంది. ఇలానే జీవించాలని ఒక కోరిక ఉంది. నా భవిష్యత్తులో అందరిలాగా కాకుండా నిత్యం జీవించాలని ఉంది. ఎందుకంటే నేను ఈ జీవితాన్ని ఇష్టపడుతున్నాను.  నాకు ఈ జీవితం పొందుకోవడమే చాలా గొప్పగా అనిపిస్తుంది.

            ఎవరైనా మరణం తరువాత జీవించారా? నాకైతే మరణించకుండా జీవించాలని ఉంది. ఈ జీవితం కలుగజేసిన వారు ఎవరోకాని, మరణం తరువాత కూడా జీవితం కలుగజేస్తే బాగుండు అని వెతికినప్పుడు నాకు దేవునివాక్యం కనబడింది. అందుకు యేసు -నేనే పునరుత్థానమును జీవమునై యున్నాను; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు. (యోహాను 11:25,26). నా యొక్క ఈ జీవితాన్ని మరియు మరణం తరువాత జీవితాన్ని కూడా కలుగజేయసిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనకోసం మరణించి మరియు తిరిగి లేచినాడు. ఆయనయందు విశ్వసముంచడం వలన నేను ఇష్టపడిన జీవితం పొందుకొంటాను. కనుక ఆయనయందు విశ్వసముంచడం నేను నేర్చకోవాలి.

            నీకు ఈ జీవితం అంటే ఇష్టమేనా? నీవు ఇలా ఆలోచిస్తున్నావా? ఆలోచించాలి కదా! ఎందుకంటే నీవూ జీవిస్తున్నావు.

*****************************************************************************************