ప్రేమంటే

08/03/2010 17:14

            ప్రేమ హీరో హీరోఇన్ల మధ్య మాత్రమే కలుగదు. లేదా కేవలం యౌవ్వనస్తులైన అమ్మాయిల మరియు అబ్బాయిల మధ్య మాత్రమే పుట్టదు. ప్రేమంటే ఏదో కొంతమందికి సంబంధించినది కాదు. ప్రేమ మనిషికి మనిషికి సంబంధించినది విషయం. ఆడమగ తేడా లేదు. ఒక మనిషి మరో మనిషిని ప్రేమించగలగాలి. ప్రేమ కేవలం మేలును ఆనందాన్ని మాత్రమే కోరుకుంటుంది. దాని కోసం అవసరమైతే త్యాగం చేస్తుంది. “Love is an unselfish outgoing concern for the fellow human being’’. ప్రేమ ఎప్పుడు తనను ప్రేమించమని బలవంతం చేయదు. ప్రేమ నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించమని అంటుంది. ప్రేమలో స్వార్ధం ఏమాత్రము ఉండదు. అసలు ప్రేమ కలిగియుండుట అనేది చాలా కష్టం. ప్రేమ కలిగియుండుటకు చాలా ప్రయాసపడవలెను.

            ప్రేమ ఒక ఫీలింగ్ కాదు. ప్రేమ ఒక క్రియ (Action). జంతువులు ప్రేమించలేవు. మనం జంతువులం కాదు. ప్రేమ కోసం జంతువులాగా ప్రవర్తింపకూడదు. దేవుడు మనలను ప్రేమించాడు. ఆయన తన కుమారుని ఇచ్చాడు. అంతేకాదు తన కుమారునితో సమానంగా వారసులను చేశాడు. మనలను మనము ఎలాగు ప్రేమించుకోవాలో ప్రేమించి చూపించాడు. మనమెంత దౌర్భాగ్యులము ప్రేమ అర్ధమే మార్చివేసినాము. మన తోటి మానవులను మనుషుల్లాగ చూసి ప్రేమించలేక పోతే ఇంకా దేవుడుని ఏలాగు ప్రేమించగలము? ఆ దేవునితో సహవాసం ఎలా చేస్తాము? ప్రేమించడానికి మన దగ్గర ప్రేమఉండాలి. మన సృష్టికర్తతో సంబంధం ఏర్పడకపోతే వారికి నిజమైన ప్రేమ తెలియదు.

            పాతనిబంధనలో పది ఆజ్ఞలే క్రొత్తనిబంధనలో రెండు ప్రేమ ఆజ్ఞలు. పది ఆజ్ఞలో మొదటి 4 ఆజ్ఞలు నీవు పాటించగలిగితే దేవుని ప్రేమించినట్లు. “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననుదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.” (మత్తయి 22: 37,38). పది ఆజ్ఞలో చివరి 6 ఆజ్ఞలు నీవు పాటించగలిగితే పొరుగు వానిని ప్రేమించినట్లే. “నిన్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే”. (మత్తయి 22:39). ఆజ్ఞలు పాటించుట వలన అసలు క్రమంగా ప్రేమంటే ఏమిటో అర్ధమౌతుంది. ఎందుకంటే ఆజ్ఞలు పాటించటమే ప్రేమ. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట.”(1 యోహాను 5:3).