బాప్తిస్మము ఎందుకు?: Baptism

20/02/2010 09:50

               బాప్తిస్మము అంటే ఏమిటి? “యేసుక్రీస్తు నందు మనకు కలిగిన విశ్వాసమునకు తద్వారా మన మనస్సులో కలిగిన మార్పుకు గుర్తుగా బహిరంగముగా మనము చేయు ప్రక్రియే బాప్తిస్మము”. బాప్తిస్మము ఎవరు పొందవలెను? ఎవరైతే నిజసువార్తను విని, నిజమైన పశ్చాత్తాపం చెంది విశ్వాసముతో మారుమనస్సు పొందుతారో వారే బాప్తిస్మము పొంద వలెను.

            నిజమైన మారుమనస్సు పొందకుండా మనము పొందిన బాప్తిస్మమునకు ఉపయోగం ఉండదు. యేసుక్రీస్తు మొదలుకొని ఆయన శిష్యులందరు బాప్తిస్మము పొందినారు. మారుమనస్సు పొందిన వారు ఖచ్చితంగా బాప్తిస్మము పొందవలెను. “పేతురు - మీరు మారుమనస్సుపొంది, పాపక్షమాపణ నిమి త్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు (అ.కా 2:38)”. బాప్తిస్మము పొందినవారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. తద్వారా దేవుని పరలోకసంభంధమైన విషయాలను అర్ధం చేసుకోవటం సాధ్యపడుతుంది. బాప్తిస్మము పొందటం అనేది చాలా అర్ధవంతమైన ప్రక్రియ. కేవలం నీటిలో ముంచబడిన బాప్తిస్మమే వాక్యానుసారమైన బాప్తిస్మము. బాప్తిస్మములో –ఎప్పుడైతే పూర్తిగా నీటిలో ముంచబడతారో అప్పుడు పాతజీవితం దాని సమస్త పాపాలతో సహా మరణించినదానితో సమానం. “కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచు కొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో (పాలుపొందుటకై ) ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి. (రోమా 6:4)”. ఎప్పుడైతే మరలా నీటిలోనుండి పైకితే బడతారో నూతన హృదయం కలిగి యేసుక్రీస్తునందు నూతన సృష్టి అవుతారు. దేవునిలో ఒక క్రొత్త జీవితం ప్రారంభమౌతుంది. “.....ఆయనను మృతులలోనుండి లేపిన దేవుడు కనుపరచిన ప్రభావమందు విశ్వాసముంచుటచేత ఆ బాప్తిస్మమువలన ఆయనతో కూడ లేచితిరి.  (కొలస్సి 2;12)”. స్వార్ధపూరితమైన, దురాశ కలిగిన, అసూయబరితమైన, నీతికొరకు ఏ మాత్రము ఆశలేని మరియు దేవుని అధికారమునకు లోబడనటు వంటి జీవితమునుండి దేవుని ఎడల మరియు పొరుగువాని ఎడల ప్రేమకలిగిన (ధర్మశాస్త్రముకు లోబడునటువంటి) మరియు దేవుని అధికారమునకు లోబడునటువంటి పరిశుద్ధ జీవితములోకి ప్రవేశిస్తారు.

            బాప్తిస్మము పొందటం అవసరం లేదనికొందరు భోధిస్తున్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడైయుండి తానే బాప్తిస్మము పొందినాడు. ఆయన శిష్యులు పొందినారు. యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహనుడైన తరువాత శిష్యులు అనేకమందికి బాప్తిస్మము ఇచ్చినారు. బాప్తిస్మమునకు వ్యతిరేఖముగా దేవునివాక్యంలో ఒక్క వచనంకూడా లేదు.

        గమనించండి. యేసుక్రీస్తు బాప్తిస్మము కొరకు గలిలయనుండి యొర్దానుకు వచ్చెను. అయితే యేసు క్రీస్తు ఎవరో బాప్తిస్మమిచ్చు యోహానుకు బాగా తెలుసు. కనుక బాప్తిస్మమిచ్చుటకు తనకు అర్హతలేదని నివారింపజూసాడు. కాని యేసుక్రీస్తు ఇవ్వమన్నాడు కాబట్టి మారుమాట్లాడకుండా బాప్తిస్మము ఇచ్చినాడు. దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవలసింది ఏమిటంటే బాప్తిస్మము చాలా చాలా ప్రాముఖ్యమైనది. “ఆ సమయమున  యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను - నేను నీచేత బాప్తిస్మము పొంద వలసినవాడనై యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింప చూచెను గాని యేను - ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. (మత్తయి 3:13-15)”. యేసుక్రీస్తు బాప్తిస్మము పొందిన వెంటనే దేవుని యొద్దనుండి దేవుని పరిశు ద్ధాత్మ యేసుక్రీస్తు మీదికి వచ్చెను. “యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను; అప్పుడు ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. (మత్తయి 3:13-16)”. అలాగే మనం కూడా బాప్తిస్మము పొందిన వెంటనే దేవుని యొద్ద నుండి దేవుని పరిశుద్ధాత్మ ను పొందుకొంటాము. “మీరు మారుమనస్సుపొంది, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామము న బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు (అ.కా 2:38)”.

            మనం బాప్తిస్మము పొందినప్పుడు యేసుక్రీస్తును ధరించుకొంటాము. అంటే ఆయన మనస్సు మనకు వచ్చును. “క్రీస్తులోకి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొన్నారు. (గలతి 3:27)”. అపొస్తలుడైన పౌలు ఈవిధంగా బోధించెను. “అందుకు పౌలు - యోహాను తనవెనుక వచ్చువాని యందు, అనగా యేసునందు విశ్వాసముంచ వలెనని ప్రజలతో చెప్పుచు, మారుమనస్సు విషయమైన బాప్తిస్మ మిచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. (అ.కా 19:4-6)”. కనుక మనము బాప్తిస్మము పొందినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాము.

            యేసుక్రీస్తు ఆరోహనుడైనప్పుడు తన శిష్యులకు ఆజ్ఞాపించినదేమిటి? “కాబట్టి మీరు వెళ్లి సమస్త (దేశాలకు ప్రకటించుడి) జనులను శిష్యులగా చేయుడి; తండ్రియొక్కయు (మరియు) కుమారునియొక్కయు (మరియు) పరిశుద్ధాత్మయొక్కయు నామములోకి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏయే సంగతుల ను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తిపర్యంతము సదాకాలము మీతోకూడా ఉన్నానని వారితో చెప్పెను. (మత్తయి 28:19,20)”.

            గమనించండి. ప్రతి ఒక్కరు తండ్రి యొక్కయు (అంటే “నన్ను పంపిన తండ్రి ఆకర్షించితేనే గాని యెవ డును యేసుక్రీస్తు యొద్దకు రాలేడు (యోహాను 6:44)”). మరియు కుమారుని యొక్కయు ( అంటే కుమారుని సువార్త విని ఆయనయందు విశ్వాసముంచడం) మరియు పరిశుద్ధాత్మయొక్కయు (అంటే మారుమనస్సు పొంది పరిశుద్ధాత్మ పొందునట్లు) బాప్తిస్మము పొందవలెను. అంతేకాకుండా యేసుక్రీస్తు శిష్యులతో చాలా చాలా clearగా చెప్పాడు—“ నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో( బాప్తిస్మము కూడా ) వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి”.

 

కాబట్టి! మారుమనస్సుపొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ ము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ◌