మారుమనస్సు : Conversion

20/02/2010 09:44

             మారుమనస్సు అంటే మార్పు చెందిన మనస్సు. ఎవరైతే నిజమైన సువార్తను విని విశ్వాసముంచి నిజమైన పశ్చాత్తాపం చెందుతారో వారు మారుమనస్సు పొందినవారౌ తారు. నిజమైన సువార్త మరియు నిజమైన పశ్చాత్తాపం అని ఎందుకంటున్నానంటే అబద్ధమైనవి కూడా ఉన్నాయి. అబధ్ధ సువార్త గురించి పౌలు ఆనాడే హెచ్చరించాడు. “క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. అది మరియొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమై నను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిదివరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరంచిన సువార్తగాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించినపక్షమందు వాడు శాపగ్రస్తుడవునుగాక. (గలతి 1:6-9)”.

        మారుమనస్సు అనేది మనస్సుకి సంబందించిన విషయం. అందం, డబ్బు, పేరు ప్రతిష్టలు మరేవియు నిజమైన మారుమనస్సును కలుగజేయలేవు. దేవుడు బలవంతంగా ఎవరిని మారుమనస్సు లోకి తీసుకురాడు. అలాగే మనము కూడా మార్పు చెందమని ఎవరిని బలవంతం చేయకూడదు. ఎందుకంటే తండ్రియైన దేవుడు ఆకర్షించితేనే గాని మనం యేసుక్రీస్తునందు విశ్వాసముంచలేము. “నన్ను పంపిన తండ్రి ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు (యోహాను 6:44)” మరియు యేసు ఇలా చెప్పెను. “యేసు - తండ్రిచేత వానికి కృప అనుగ్ర హింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను. (యోహాను 6:65) ”. దేవుడే మనకు మారుమనస్సు దయచేస్తాడు. “దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్ర హైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? (రోమా 2:4)”.

        మారుమనస్సు అంటే ఏ ప్రశ్నలు కాని షరతులు కాని లేకుండా దేవునికి మరియు దేవుని ఆజ్ఞలకు మనస్ఫూర్తిగా విధేయులవటం. మారుమనస్సు పొందిన వ్యక్తి తన పూర్వ(లేదా పాత) జీవితానికి మాత్రమే క్షమాపణ పొంది పరిశుద్దుడుగా తీర్చబడినవాడవుతా డు. అతడు ఒక నూతన సృష్టి. ఇకనుండి జీవించు జీవి తం ఒక క్రొత్త జీవిత విధానంలో వెళుతుంది. లోకము, పాపము మరియు శరీరము యొక్క బలహీనతలను జయించుకొంటూ ముందుకు సాగవలెను. దేవుని continuous సహాయం అవసరము. మారుమనస్సు అంటే మన హృదయములో ఆలోచించే విధానంలో కలిగే మార్పు. ఇప్పటి వరకు ఈలోక విధానంలో ప్రతిదానికి స్వార్ధంగా ఆలోచించే (నాకేంటి లాభం) మనస్సు ఇక నుండి పరిశుద్ధంగాను మేలుకరంగాను ఆలోచించడం మొదలెడుతుంది. ఇక్కడే మన మైండ్ లో ఒక పోరాటం మొదలౌతుంది. మన మనస్సులో మంచి ఆలోచనకి చెడు ఆలోచనకి మద్య పోరాటంజరుగుతుంది.

             ఈ పోరాటం సామాన్యమైనది కాదు. చేయా లనుకున్న మంచిని చేయలేక మరియు చేయకూడదనుకున్న చెడును చేయకుండా ఉండలేక భయంకరమైన స్థితిలోకి వెళతాము. పౌలు కూడా మొదట్లో ఈ భాధనే అనుభవించాడు. “మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగు చున్నది గాని, దాని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను. (రోమా 7:18,19)” . కేవలం దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే మనం విజయము సాధించగలము.కనుక మారుమనస్సు ఒకసారి పొందాను కదా ఇంక ఏ ప్రాబ్లం ఉండదు అని అనుకోకూడదు. ఎప్పుడైతే మనము మారుమనస్సు పొందుతామో అప్పుడు కేవలం మారుమనస్సు అనే దేవుని ప్రక్రియ మనలో ప్రారంభమౌతుంది. యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు అది కొనసాగుతుంది. అంటే మనం “మహిమ శరీరం” పొందేంతవరకు ఈ ప్రక్రియ కొనసాగించవలె ను. దేవుని యొక్క సహాయంతో క్రమక్రమంగా ప్రతి రోజు spiritualగా ఎదుగుతూ “నీతి గల దేవుని స్వభావము” ను మనలో అభివృద్ధి చేసుకొంటూ సాగిపోవలెను.

            ఈ విధంగా చెడును, పాపాన్ని ద్వేషించి మరియు ఎల్లప్పుడూ మంచినే కోరుకొనే “నీతి గల దేవుని స్వభావము” మారుమనస్సు అనే ప్రక్రియ ద్వారా మన మనస్సులో నాటబడుతుంది. కనుక నిజమైన మారుమనస్సు పొందిన తరువాత బాప్తిస్మము పొందవలెను. ◌