మొట్టమొదటి అబద్ధము - దాని ప్రభావము

18/02/2010 23:15

        ప్రపంచంలో అందరు విశ్వసించేది ఏమటంటే మనిషి మరణించిన వెంటనే పరలోకానికి (స్వర్గానికి) వెళతాడని లేదా నరకానికి వెళతాడని. ఇట్టి విషయాలకు ఋజువు ఏమైన ఉందా? ఈ విషయం గురించి దేవుని వాక్యం ఏమి చెపుతుంది?

                 దేవుడు సృష్టి కార్యక్రమంలో భాగంగా మనిషిని(పురుషుడు) ఆరవ రోజున సృష్టించినాడు. తరువాత పురుషుడు(ఆదాము) నుండి స్త్రీ(అవ్వ) నిర్మించినాడు. దేవుడు ఆదామును అవ్వను ఏదేను అను తోటలో ఉంచి ఫలించి అభివృద్ది చెందమన్నాడు. దేవుడు ఆదాముతో "నీవు ఎప్పుడైతే మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలం తింటావో నీవు నిశ్చయముగా చచ్చెదవు(ఆ.కా. 2:17)." అని చెప్పినాడు. కాని సాతాను అవ్వతో "మీరు చావనే చావరు(ఆ.కా. 3:4)" అని అబద్దమాడెను. అదే ఇంగ్లీషు బైబిల్ లో ఇలా ఉంది "Ye shall not surely die (KJV)”  అంటే "మీరు నిజంగా చావరు" అని అర్ధం. అంటే నిజానికి మీరు చావులేని ఆత్మ గలవారు కనుక మీరు నిజంగా చావరు అని సాతాను అబద్దమాడింది.

మరి క్రైస్తవులనేవారు కూడా సాతాను ఏదైతే అబద్దమాడిందో అలానే బోధిస్తున్నారు. ఏలాగంటే మనుష్యులు చనిపోయినప్పుడు నిజంగా చావరు వారిలోఉన్న ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. ఇప్పటి సిద్దాంతం ప్రకారం "మనిషి అంటే ప్రాణం, ఆత్మ మరియు శరీరం. మనిషి మరణించినపుడు అతనిలో ఉన్న ఆత్మ చావదు.

             ఆ ఆత్మే అసలు మనిషి. అదే దేవుని యొద్దకు వెళుతుంది." అయితే ఇవే మాటలు చెప్పడం ద్వారా సాతాను మానవుని మోసం చేసింది. దీనిని బట్టి చూస్తే మనం ఇప్పటికి ఆ మోసంలోనే ఉన్నాం. ఆ అబద్దమునే నమ్ముతున్నాం. అంటే నశింపని ఆత్మ (చావులేని ఆత్మ, దేవదూతలవలే) మనిషిలో ఉన్న దని సాతాను అబద్దమాడితే మరి మనం విశ్వసి స్తున్నదేమిటి? అదే కదా!

            “నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంద్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ(జీవించు ప్రాణి) ఆయెను (ఆ.కా. 2:7)." అని దేవుని వాక్యం చెపుతుంది. ఈ నరుడే జీవించు ఆత్మ, సాతాను చెప్పినట్లుగా వేరే చావేలేని ఆత్మ నరునిలో లేదు.  

            మనం చాలా ప్రత్యేకంగా సృష్టింపబడి నాము. మనం దేవుని పోలిక మరియు స్వరూపం. అందుకే మనిషికి దేవుడిచ్చినది ఈ ప్రపంచంలో మరేజీవికి ఇయ్యలేదు.  అదే మేధస్సు అంటే మైండు (Human Mind). మానవ మేధస్సు ఆత్మ కాదు. మానవ మెదడుకు ఆలోచనా శక్తి నిచ్చే వాయువే (Spirit Essence) మైండు. "అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ జేయును (యోబు 32:8)".  ఇది గాలి వంటిది. ఈ మైండులో మనిషి యొక్క రూపురేఖలు, స్వభావం, ఇంకా ఆ మనిషి సంబందిం చిన అన్ని విషయాలు దాచి ఉంచుతుంది. "ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనష్యాత్మకే (Spirit Essence)  గాని మనుష్యలలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకేగాని(Holy spirit) మరి ఎవనికిని తెలియవు (1కోరింథి 2:11)".

            కాబట్టి మనిషినిలో వేరే మనిషి లేడు కాని Spirit అనేది ఉంది దీనినే ఆత్మ అని మన తెలుగు బైబిల్ లో తర్జుమా చేయబడింది. మరి మరణించినవారు ఏమౌతారు.? "బ్రతికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువ బడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు (ప్రసంగి 9:5,6)". కాని మనిషి మరణించినప్పుడు దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చిన ఈ మైండు(Spirit) దేవుని యొద్దకు వెళుతుం ది. "మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ(Spirit)  దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును (ప్రసంగి 12:7.)". మరల మృతుల పునరద్దానము వరకు దేవుని యొద్దనే ఉంటుంది. ఎప్పుడైతే మనిషి పునరుద్దానుడవుతాడో లేదా తిరిగి బ్రతుకుతాడో శరీరంలోకి ఆ యొక్క మైండును తిరిగి ఇస్తాడు. ప్రపంచ పునరద్దానములో మానవులు మరలా శరీరంతో తిరిగి లేపబడినప్పుడు ఎవరి మైండును వారికి దేవుడు ఇస్తాడు. ఆ తరువాత తీర్పు జరుగును. "దీనికి ఆశ్చర్య పడకుడి ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలుచేసినవారు జీవపునరుత్థానమునకును కీడుచేసి నవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు (యోహాను 5:28, 29)".

            ఒకవేళ చనిపోయిన వెంటనే మానవులు పరలోకానికి లేదా నరకానికో వెళితే మరి మృతుల పునరుద్ధానం ఎందుకు? (1 కొరింథీ 15 :12, 13)

        ఈ వచనం చూడండి. "మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి.(మత్తయి 10:28)". ఈ వచనాన్ని ఇలా చదవాలి "మరియు ఆత్మను(Spirit Essence) చంపనేరక దేహమునే చంపువారికి భయప డకుడి గాని, ఆత్మను(Spirit Essence) దేహమును కూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి." అంటే కేవలం ఈ భౌతిక జీవితాన్ని చంపేవారికి భయపడద్దు కాని ఈ భౌతిక జీవితాన్ని ఆ తర్వాత వచ్చే అసలు జీవితాని చంపగలిగే దేవునికి భయపడండి అని అర్ధం.

        సాతాను అబద్దమాడినట్లు మనిషిలో ఆ చావులేని ఆత్మ లేనేలేదు. మనిషే ఆ ఆత్మ  ( యెహెజ్కేలు 18:20 [Eze 18:20 The soul that sinneth, it shall die.]). దేవుని వాక్యమే సత్యం. కాబట్టి సర్వలోకము సాతాను చేత మోసపోయినది అని ప్రకటన 12: 9 లో "కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము......" వ్రాయబడిఉంది. సర్వలోకము ఈ యొక్క విషయము లో మోసపోయినారు. ఇది మూలంగా చేసుకొని క్రైస్తవులందరిని వారు నిజమైన క్రైస్తవులనుకొనేలాగా మోసంలో పడవేసింది.

         సాతాను అబద్దానికి జనకుడని దేవుని వాక్యం చెపుతుంది. "మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దరాశలు నెరవేర్చ గోరుచు న్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్య మేలేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభా వము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధి కుడును అబద్ధమునకు జనకుడునైయున్నాడు." (యోహాను 8:44). ఈ విధంగా సాతాను తన మొదటి అబద్దం మొదలుకొని ఎన్నో అబద్దాలు చెప్పి దేవుని విషయాలు మనిషికి అర్దం కాకుండా చేసి దేవునికి మనలను దూరం చే్స్తున్నాడు.

            మనం ఇప్పటికైనా మేలుకొని సత్య వాక్య మును గూర్చిన అనుభవజ్ఞానం కలిగి మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వసించి వెంబడించవలెను. ◌