రక్షించు క్రీస్తు సువార్త

12/10/2011 08:56

నిన్ను రక్షించు క్రీస్తు సువార్త?

దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రకటించిన సువార్తను తెలుసుకొని,

విశ్వసించి ఆ ప్రకారము పరిశుద్ద జీవితము జీవించువారు

మాత్రమే రక్షింపబడతారు.

 

యేసుక్రీస్తు సువార్తను ప్రకటించెను. ఆయన ప్రకటించిన సువార్త మీరు ఎప్పుడైన విన్నారా? దేవుని వాక్యములో ఎప్పుడైన చదివారా? కేవలము ఎవరైతే ఆయన ప్రకటించిన సువార్తను అనగా మంచి వార్తను తెలుసుకొంటారో వారే రక్షింపబడతారు.

సిలువ అనే మాట

                            కాని ఇక్కడ ఒక ప్రత్యేకమైన సంగతి ఉంది. అదేమిటంటే, ఆయన దేవుని కుమారుడైయుండి నేరస్తుడి వలే ఎందుకు సిలువ వేయబడి మరణ శిక్ష పొందినాడు. కాబట్టి, ఆయన ప్రకటించిన మాటలు వింటున్నారు కాని, మరి సిలువెందుకు వేయబడ్దాడు అని ఆనాటి జ్ఞానులు ప్రశ్నించారు. సిలువ వేయబడిన వాడు శాపగ్రస్తుడు. కనుక ఆనాడు, సిలువ వేయబడటం అనేది ఒక విలువలేనిదిగా కనబడినది. అంతేకాని నిజానికి యేసుక్రీస్తు ప్రకటించిన సువార్తలో సిలువ లేదు. కాని సిలువ అనే మాట(వార్త) చాలా మందికి వెర్రితనంగా కనబడింది. “సిలువను గూర్చిన వార్త , నశించుచున్నవారికి వెర్రితనముగాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.(1 కొరింధీ 1:18)”. నిజానికి యేసు సిలువ మరణం కారణంగా ప్రతి మానవునిలో అప్పటి వరకు ఉన్న పాపాలకు పరిహారం సాధ్యమైయింది. కనుక ఆయన సిలువ మరణం ఒక శక్తివలే పనిచేసి మానవులకు రక్షణ కలుగజేస్తుంది.

భిన్నమైన సువార్త

                            యేసు యొక్క మరణ పునరుద్దానాలను ఆయన ఎప్పుడు సువార్తవలె ప్రకటించలేదు. అపోస్తలుడైన పౌలుకూడా సువార్త ఈ రకాంగా మారిపోవడం చూసి బహు ఆశ్చర్యపోయాడు. తాను ప్రకటించిన క్రీస్తు సువార్త కాకుండా వేరే ప్రకటించబడటం చూసి, వారిని దేవుని పేరిట శపించించాడు కూడా! “క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. అది మరియొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచు వారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరంచిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించినపక్షమందు వాడు శాపగ్రస్తుడవునుగాక. (గలతీ 1:6-9)”

యేసు యొక్క సిలువ మరణమే సువార్తా? లేదా పాప పరిహారమే సువార్తా? లేదా మారుమనస్సే సువార్తా? ఇంతకి యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త ఏమిటి?  మళ్లి చెపుతున్నా: యేసు క్రీస్తు సువార్త తెలియకుండా మరియు అర్ధం కాకుండా మరియు విశ్వాసముంచకుండా ఎవరికిని నిజమైన మారుమనస్సు కలుగదు. నీవు ఎలాంటి మారుమనస్సు పొందావు?

నిజమైన క్రీస్తు సువార్త

                    ప్రస్తుతం అనేక రకాల సువార్తలు ప్రచారంలో ఉన్నాయి. అనేక మంది సువార్తికులు మరియు అనేక చర్చీలు నిత్యము సువార్తను ప్రకటిస్తున్నట్లు చెపుతారు. రేడియో ద్వారా, TVల ద్వారా మరియు మహా సభల ద్వారా అనేక మంది సువార్తను ప్రకటిస్తున్నట్లు చెపుతారు. అయితే వీరందరు ప్రకటిస్తున్నది దేవుని సువార్తేనా? అసలు దేవుని సువార్త అంటే ఏమిటి? దేవుని వాక్యం ఏమి చెపుతుంది?

                   గాస్పల్ ( Gospel ) అంటే సువార్త లేదా శుభవార్త అని అర్ధం. ఈ ప్రపంచంలో మొట్టమొదటి సారిగా దేవుని సువార్తను ప్రకటించినది ఎవరు? యేసుక్రీస్తు తన 30వ యేట దేవుని సువార్తని ప్రకటించడం ద్వారా సేవను ప్రారంభించాడు.  “యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడై యుండెను. (లూకా 3:23)”. ఆ తరువాత తన శిష్యులు కొనసాగించారు. తండ్రియైన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మానవులందరి కొరకు ఒక శుభ సందేశం (Message) పంపించినాడు. “యేసు వారితో ఇట్లనెను-.... నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్నుపంపెను. (యోహాను 8:42)”. ఇంతకి ఆ సువార్త సందేశం ఏమిటి?

                  దేవుని సువార్తను అర్ధం చేసుకొంటే మానవుల యొక్క భవిష్యత్తు ఎంత మహోన్నతమైనదో అర్ధమౌతుంది. మానవుల కొరకు సృష్టికర్త పంపించిన ఎంతో ఆనందకరమైన, ఉన్నతమైన ఊహలకందని శుభవార్తే ఈ సువార్త. మానవులు ఈ భూమి మీద ఎందుకు ఉంచబడ్డారో కేవలం ఈ సువార్త ద్వారా మాత్రమే తెలియబడుతుంది. మానవ జీవితానికి అర్ధం పరమార్ధం తెలిపేదే ఈ శుభవార్త. దేవుడు తనను తాను మానవునిలో నిర్మించుకొంటున్నాడు. అందుకే దేవుని కుటుంబములోకి మానవులను ఆహ్వానిస్తున్నాడు. మానవ కుటుంబములో జన్మించివారు మానవులు మరి దేవుని కుటుంబములో జన్మించువారు?

                  యేసుక్రీస్తు 3½  సంవత్సరాలు ఈ భూమి మీద సంచరించి సువార్తను ప్రకటించినాడు. రాబోవు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించెను. “యోహాను చెరసాలలో వేయబడిన తరువాత యేసు-- కాలము సంపూర్ణమై యున్నది, దేవుని రాజ్యము సమీపించి యున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలైయకు వచ్చెను (మార్కు 1:14,15)”.  కేవలం ప్రకటించినాడు (just an Announcement). అంగీకరించమని గాని, నమ్మమని గాని, పాటించమని గాని యేసుక్రీస్తు ఎవరిని ఎన్నడూ బలవంతం చేయలేదు.

దేవుని రాజ్యసువార్త

                యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశంలో అనేక పట్టణములలోను సంచరించి దేవుని రాజ్యసువార్తను ప్రకటించెను. “ఆయన - నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే గదా నేను పంపబడితినని వారితో చెప్పెను (లూకా 4:43)”. ఆయన గ్రామములలో కూడా సంచరించి దేవుని రాజ్యసువార్తను ప్రకటించెను. “అటుపిమ్మట ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతిగ్రామములోను సంచారము చేయుచుండగా (లూకా 8:1)”. దేవుని సువార్తను అందరు అర్ధం చేసుకొను రీతిగా ప్రకటింపబడలేదు. ప్రస్తుతం కొంతమందికే ఆయన శిష్యులవుటకు ఆ యొక్క గ్రహింపు అనుగ్రహింపబడింది. “ఆయన శిష్యులు - ఈ ఉపమానభావమేమిటని ఆయనను అడుగగా, ఆయన - దేవుని రాజ్యమర్మములెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండనట్లు వారికి ఉపమానరీతిగా బోధింపబడుచున్నవి. (లూకా 8:9,10)”. ఆయన తనను వెంబడించిన జనసమూహములందరికి చాలా ఓపికగా దేవుని రాజ్యసువార్తను క్షుణ్ణంగా ప్రకటించెను. “జన సమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. (లూకా 9:11)”.

                యేసుక్రీస్తు పన్నెండుమంది  శిష్యులను ఏర్పరచుకొనెను. వారికి కూడా అధికారమునిచ్చి దేవుని రాజ్యసువార్తను ప్రకటించుటకు పంపించెను. “ఆయన తన పన్నెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటకును వారినంపెను. (లూకా 9:1,2)”. యేసుక్రీస్తు ఒక వ్యక్తిని సువార్తను ప్రకటించుటకు పిలిచినప్పుడు అతడు తన తండ్రి చనిపోయునాడని తనను పాతిపెట్టి వస్తానని చెప్పెను. అయితే దేవుని రాజ్యసువార్త ఈ లోకంలో అన్నింటికంటే ప్రాముఖ్యమైనదని ముందు దేవుని రాజ్యమును ప్రకటించమని చెప్పెను. “ఆయన - మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. (లూకా 9: 60)”.

                గమనించండి. దేవుని రాజ్యమును తెలుసుకొనడమే అన్నింటికంటే ముఖ్యమైనది. “కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి; అప్పడవన్నియు మీకనుగ్రహింపబడును. (మత్తయి 6:33)”. యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణమవక ముందు మరియొకమారు దేవుని రాజ్యమును గూర్చి బోధించెను. “ఆయన శ్రమపడిన తరువాత నలువది దినముల పర్యంతము వారికగుపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములనుచూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను. (అ.కా 1:3)”.

                మరి యేసుక్రీస్తు శిష్యులు ఏ సువార్తను ప్రకటించెను? శిష్యుడైన ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించెను. “అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చియు యేసు క్రీస్తు నామమునుగూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతనిని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి. (అ.కా 8;12)”. అయితే దేవుని రాజ్యమును కనుగొనువారు కొందరే. వారు అనేక శ్రమలననుభవించి దేవుని రాజ్యములోకి ప్రవేశిస్తారని యేసుక్రీస్తు శిష్యులు భోధించినారు. “శిష్యుల మనస్సులను దృఢపరచి - విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. (అ.కా 14:22)”.

                అపోస్తులుడైన పౌలు ప్రకటించిన సువార్త ఏమిటి? దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను పౌలు ప్రకటించెను. పౌలు ఎక్కువ శాతం అన్యజనుల మధ్య దేవుని సువార్తను ప్రకటించెను. “ఇదిగో (దేవుని) రాజ్యమునుగూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని గదా? (అ.కా 20:25)”. దేవుని రాజ్యసువార్తను గురించి పౌలు చాలామంది మొండివారితో కూడా తర్కించాడు మరియు అనేక విధాలుగా వివరించాడు. “తరువాత అతడు సమాజమందిరములోకి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమునుగూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను. (అ.కా 19:8)”.  పౌలు రాబోవు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను అనేక ఆధారాల ద్వారా నిరూపించి వివరించి ప్రకటించినాడు. “అతని బసలోకి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములో నుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. (అ.కా 28:23)”. మరియు “ఏ ఆటంకమునులేక పూర్ణధైర్యముతో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. (అ.కా 28:31)”.

                గమనించండి. ఈ లోకసంభంధమైన అర్హతలు (ఈలోక ధనికులు, పేరుప్రతిష్టలు గలవారు, విధ్యావంతులు, గొప్పవారు) దేవుని రాజ్యాన్ని అర్ధం చేసుకొనుటకు మరియు చేరుటకు ఏమాత్రము ఉపయోగపడవు. “.......లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటనయను వెర్రితనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను.(1కొరంథీ 1 :21)”.

దేవుని రాజ్యమంటే ఏమిటి?

                దేవుని సువార్త తెలుసుకోకుండా ఎవరును పరలోక రాజ్యాన్ని చేరలేరు. దేవుని రాజ్యమును గూర్చిన సువార్త యేసుక్రీస్తు ప్రకటించెను. కాని ఈ సువార్త చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. దేవుని రాజ్యమన్నా, పరలోక రాజ్యమన్నా, దేవుని కుటుంబమన్నా, రక్షింపబడటమన్నా, దేవుని ప్రధమ ఫలమన్నా, నిత్యజీవమన్నా, తిరిగి జన్మించడమన్నా ఒకటే.

ఇశ్రాయేలు ప్రజలందరు ఒక వ్యక్తి (యాకోబు) సంతానం. ఒకే కుటుంబం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక నిభంధన చేశాడు. మోషే దానికి మధ్యవర్తి. అప్పుడు ఆ ఒకే కుటుంబం ఇశ్రాయేలు రాజ్యముగా ఏర్పడింది. తరువాత దేవుడు తన కుమారున్నిలోకానికి పంపి రాజ్యసువార్త ప్రకటించడం ద్వారా నూతన నిబంధన చేశాడు. దేవుని రాజ్యములో కేవలం ఆత్మసంబంధులైన దేవుని కుమారులు మాత్రమే ఉంటారు. “....ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు (1 కోరింథి 15:50 )”. ఆనాటి ఇశ్రాయేలు రాజ్యమేమో మానవ కుంటుంబం కాని దేవుని రాజ్యమేమో దేవుని కుటుంబము (తిరిగి జన్మించిన దేవుని కుమారుల కుటుంబం). 

దేవుని కుటుంబం

                ఈ దేవుని రాజ్యసువార్తను అంగీకరించి మన పాపల విషయమై పశ్చాతాపపడినప్పుడు దేవుని పరిశుద్ధాత్మను పొందుకుంటాం. దేవున్ని మనం తండ్రి అని పిలువవచ్చు. అప్పుడు మనం దేవుని పిల్లలం అవుతాము. ఇంకా దేవుని వారసులం అవుతాము. అంతేకాదు మన యేసుక్రీస్తుతో సహవారసులం అవుతాం. “దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని స్వీకృతపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము నాయనా తండ్రీ అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోటి వారసులము.  (రోమా 8:14-17)”.  ఇలాంటి దేవుని కుమారుల కొరకు ఈ సమస్త సృష్టి వేచిచూస్తూ ఉంది. “దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. (రోమా 8:19)”.

1 కొరింథీ 15వ అధ్యాయము

                పౌలు సువార్తను ప్రకటించెను. “మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలుపుచున్నాను. మీరు దాని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశరూపకముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న పక్షమందు ఆ సువార్తవలననే మీరు రక్షణ పొందువారై యుందురు.(1 కొరింథీ 15:1-2)”. ఆయన సువార్త యొక్క పూర్తి ఉపదేశమును ఈ అధ్యాయములో వివరించెను. 3వ వచనం నుండి 27వ వచనం వరకు యేసు సువార్త యొక్క సారాంశమును పూర్తిగా వివరించెను.

              యేసుక్రీస్తు ప్రకటించిన దేవుని రాజ్యసువార్తను పౌలు ఈ ఆధ్యాయములో సంపూర్తిగా వివరించెను. “ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయనవారు బ్రదికింపబడుదురు. అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.( 1 కొరింథీ 15:23,24)”. అంతేకాని పౌలు యొక్క సువార్త ఉపదేశం కేవలం 3వ వచనంతో ఆగిపోలేదు.

ప్రవక్తయైన దానియేలు ముందే చెప్పెను

                ప్రవక్తయైన దానియేలు దేవుని రాజ్యము గురించి వ్రాశాడు. మొట్టమొదటి ప్రపంచ చక్రవర్తియైన నెబుకద్నెజరు కనిన కలకు దానియేలు భావం తెలియజేసాడు. ఆ యొక్క కలలో ఆ రాజు ఒక ప్రతిమను చూసెను, ఆ కల యొక్క భావం ఈ విధంగా తెలియజేసెను. “ఆ కల 5 ప్రపంచ రాజ్యములను గూర్చి తెలియజేయుచున్నది. మొదటిది కల్దీయుల రాజ్యము (బబులోను రాజ్యము), రెండవది పర్షియ రాజ్యము, మూడవది గ్రీకుమాసిదోనియ రాజ్యము, నాలుగవది రోమా సామ్రాజ్యము, ఇంక ఐదవది దేవుని రాజ్యము. మొదటి నాలుగు రాజ్యాలు అలా వచ్చి పోతాయి కాని  ఐదవ రాజ్యమునకు నశింపులేదు మరియు యుగ యుగములు నిలుచును. “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిం చును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును. (దానియేలు 2:44)”. మొదటి నాలుగు రాజ్యాలు భూసంబంధమైన రాజ్యాలు. కాని ఐదవది దేవుని సంబంధమైనది. దానికి అంతమే ఉండదు. దానిని ఏలువారు పరిశుద్ధులు. “ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను (రాజ్యములను) సూచించుచున్నవి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు; వారు యుగ యుగములు యుగయుగాంతములవరకు రాజ్యమేలుదురు. (దానియేలు 7: 17,18)”. పరిశుద్ధులు అంటే ఆత్మసంబంధంగా తిరిగి జన్మించిన వారు. “అందుకు యేసు అతనితో - ఒకడు క్రొత్తగాజన్మించితేనే కాని అతడు దేవునిరాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. (యోహాను 3:3)”. అంటే యేసుక్రీస్తు యొక్క రాజ్య సువార్త విని రక్షింపబడి నిత్యజీవం పొందినవారు. వారు యేసుక్రీస్తుతో పాటు రాజ్యాన్ని యుగ యుగములు ఏలుదురు. “.....ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయెను; ఆయన యుగయుగముల పర్యంతము ఏలుననెను. (ప్రకటన 11:15)”.

                కనుక దేవుని రాజ్యము అంటే యేసుక్రీస్తుతో పాటు పరిపాలన చేయు ఆత్మసంబంధముగా తిరిగి జన్మించిన పరిశుధ్ధులు. అంటే దేవుని ప్రధమ ఫలములు. అంటే దేవుని ప్రపంచ ప్రభుత్వము. “నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతో(యేసు) కూడ నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. (ప్రకటన 3:21)”. యేసుక్రీస్తు రెండవ రాకతో దేవుని రాజ్యము ఏర్పడుతుంది. ఇదే మొదటి పునరుద్ధానము. దేవుని రాజ్యము ఏర్పడిన మొదటి 1000 సం||రాలు ఈ భుమి మీద పరిపాలన జరుగును. “ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునైయందురు ఇట్టివారిమీద రెండవ మరిణమునకు అధికారములేదు; ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యముచేయుదురు. (ప్రకటన 20:6)”. పాలించేవారేమో యేసుక్రీస్తు మరియు ఆత్మసంబందులు (దేవుని కుటుంబం అంటే తిరిగి జన్మించిన పరిశుద్ధులైన రాజులైన యాజకులు) పాలింపబడేవారేమో మానవులు.

తిరిగి జన్మించుట

          తిరిగి జన్మించినవారు దేవునిరాల్యములో ఉంటారు. నీకొదేమను ధర్మశాస్త్ర ఉపదేశకుడొకడు రాత్రివేళ యేసుక్రీస్తు నొద్దకు వచ్చెను. అప్పుడు యేసు ‘ఒకడు క్రొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యమును చూడలేడు’ అని చెప్పెను. అందుకు నీకొదేము ‘ముసలివాడు ఏలాగు మరలా తల్లి గర్బములోకి వెళ్ళి మళ్ళి జన్మించగలడు’ అని అడిగెను. అందుకు యేసు ‘ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు.’ అని చెప్పెను. అందుకు నీకొదేము ఈ సంగతులు ఏలాగు సాధ్యమని యేసుక్రీస్తును అడిగెను. అందుకు యేసు ‘నీవు ఇశ్రాయేలు భోధకుడవైయుండి వీటిని ఎరుగవా? భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోకసంబంధమైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురు?’ అని ప్రశ్నించెను. “అందుకు యేసు అతనితో - ఒకడు క్రొత్తగాజన్మించితేనే కాని అతడు దేవునిరాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ........... నీవు ఇశ్రాయేలుకు బోధకుడవైయుండి వీటిని ఎరుగవా? భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోకసంబంధమైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురు? (యోహాను 3:4-12)”.

                  ఆనాడు నీకొదేముకు అర్ధం కాలేదు. ఈనాడు కూడా చాలామందికి అర్ధమైనట్లులేదు. మళ్ళి చెపుతున్నాను—దేవుని పరిశుద్దాత్మ ద్వారా మాత్రమే మనకు దేవుని సంగతులు అర్ధంమౌతాయి. “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి; అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. (1 కోరింథి 2:14)”. ఇంతకి తిరిగిజన్మించుట లేదా క్రొత్తగా జన్మించుట అంటే ఏమిటి?

                  మొదటిగా నీటి మూలముగా జన్మించవలెను. అంటే యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను. అంటే దేవుని నిజరాజ్య సువార్త విని, విశ్వసించి, పశ్చాత్తాప పడి, మారుమనస్సుపొంది, బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈవిధంగా ముందు నీటిమూలముగా జన్మించవలెను.

                  ఆ తరువాత ఆత్మ మూలముగా జన్మిస్తాము. అంటే నీవు యేసుక్రీస్తునందు పరిశుద్ధ జీవితమును కొనసాగించి మారుమనస్సుకు తగిన ఫలములు( గలతి 5:22) ఫలించినప్పుడు యేసుక్రీస్తు తన రెండవ రాకడలో ఆత్మ సంబంధిగా జన్మిస్తావు. “మృతుల పునరుత్థానమును ఆలాగే (శరీరము) క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును; ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును;  ప్రకృతిసంబంధ శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధ శరీరమున్నది గనుక ఆత్మసంబంధ శరీరముకూడ ఉన్నది. (1 కోరింథి 15:42-44)”. దేవుని కుటుంబములో ఆత్మజీవిగా జన్మిస్తావు. గమనించండి. శరీర మూలముగా జన్మించేది శరీర జీవులు ఆత్మ మూలముగా జన్మించేది ఆత్మజీవులు. “శరీరమూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది. (యోహాను 3:6)”.

                  యేసుక్రీస్తు నీకొదేముతో చెప్పినట్లు మనమ ఎప్పుడైతే క్రొత్తగా జన్మిస్తామో direct గా దేవుని రాజ్యములో ఉంటాము. “సహోదరులారా, నేను చెప్పనది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. (1 కోరింథి 15:50 )”. అయితే ప్రస్తుతం ఎంతమంది దేవుని రాజ్యములో ఉన్నారు. అంటే ఎంతమంది ఇప్పటివరకు తిరిగి జన్మించారు? అంటే ఎంతమంది అత్మ మూలముగా జన్మించారు? ఒకే ఒక్కడు. ఆయనే యేసుక్రీస్తు. “ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయనవారు బ్రదికింపబడుదురు. (1 కోరింథి 15:23)”. ఆయన శరీరముతో మరణించి ఆత్మ మూలముగా లేచి (మనకు రుజువు చూపించి) ఆరోహనుడై తండ్రి యొద్దకు వెళ్ళెను. మనము కూడా యేసుక్రీస్తు వలె పరిశుద్ధ జీవితమును జీవిస్తే ఆత్మ సంబంధముగా జన్మించగలము.

దేవుని రాజ్యములోకి ఎవరు వస్తారు

                రాజ్యమంటే ఒక దేశం. రాజ్యంలో 1) ప్రజలు మరియు 2) రాజ్యాన్ని పాలించే ప్రభుత్వము ఉంటాయి. దేవుని రాజ్యమంటే యేసుక్రీస్తు మరియు ఆయనయందు విశ్వాసముంచిన పరిశుధ్దులందరు పాలించే ప్రభుత్వము. యేసుక్రీస్తు సువార్త ప్రకటనతో మనలను పిలిచి, మన పాప పరిహారార్ధం తన ప్రాణం పెట్టి తన శిష్యులనుగా చేసికొని తన సొంత కుటుంబముగా మనలను  ఏర్పరచుకొన్నాడు. “అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. (1 పేతురు 2:9)”. మరియు “నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి,  ప్రతి వంశములోను, ఆ యా భాషలు మాటలాడువారలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులనుకొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులగాను చేసితివి (ప్రకటన 5:10)”.

          ఆదాము మొదలుకొని దేవుని భక్తులందరు దేవుని రాజ్యములో ఉంటారు. “అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో నుండుటయు, మీరు వెలపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. (లూకా 13:28)”. అంతే కాకుండా క్రీస్తును ఎరిగిన అన్యజనులు భూమి యొక్క సమస్త దిశలనుండి వచ్చి దేవుని రాజ్యమును స్వతంత్రించుకొందురు. “మరియు జనులు తూర్పునుండియు పడమటనుండియు ఉత్తరమునుండియు దక్షిణమునుండియు వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. (లూకా 13:29)”.  దేవుని రాజ్యసువార్త కొరకు ప్రయాసపడే వారు ఖచ్చితంగా ఇహమందును పరమందును ఆశీర్వదించబడతారు. “ఆయన - దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టినవాడెవడును, ఇహమందు చాలరెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. (లూకా 18:29,30)”.  అయితే కొందరు పరిసయ్యలు దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని యేసుక్రీస్తుని అడిగినప్పుడు అది మీ మధ్యలోనే ఉందని మీకు అందుబాటులోనే ఉందని(ఉన్నానని) చెప్పినాడు. “ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది (లూకా 17:21)”.

దేవుని రాజ్యానికి ప్రవేశం ఎవరికి లేదు

        పరిశుద్ధ జీవితం కొరకు ఆసక్తి కలిగి చిన్నపిల్లవానిని మనం ఇష్టపడినట్లు సువార్తను అంగీకరించవలెను. లేనిచో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరు. చిన్నపిల్లవలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు దానిలో నెంతమాత్రమును ప్రవేశింపడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. (లూకా 18:17)”. ఈ లోకంలో ఆస్తిగల వారి మనస్సులు ఎప్పుడు తృప్తి చెందవు. వారు మారుమనస్సు పొందడం చాలా చాలా కష్టం. “....ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటెదూరుట సులభమని చెప్పెను. (లూకా 18:24,25)”.

          కేవలం పరిశుద్ధులు మాత్రమే దేవుని రాజ్యములోకి వస్తారు. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు రావడం అసంభవం. “అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనముగలవారైనను (మాడాలు), పురుషసంయోగులైనను(గేస్ Gays) దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. (1కొరింథి 6:9,10)”.

            మన శరీరంతో చేసిన పాపాలు దేవుని ఎదుట ఒప్పుకోవడం వలన మనకు దేవునితో తండ్రి కుమారుల/కుమార్తెల సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు మన మనస్సు పరిశుద్ధపరచబడి దేవుని విషయాలను అర్ధం చేసుకొనే సామర్ధ్యం పొందుతుంది. అయితే శరీరకార్యాలను చేయువారు దేవుని రాజ్యమును చేరలేరు. “శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషమును, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేను మునుపు చెప్పినప్రకారము ఇట్టివాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. (గలతి 5:20,21)”.

        కాబట్టి దేవుని రాజ్యములోనికి ప్రవేశించటానికి ఇన్ని షరతులు ఉంటే మరి ఆ దేవుని రాజ్యము యొక్క గొప్పతనమును, మహిమను ఒక్కసారి అర్ధం చేసుకొండి. “తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.(1 థెస్స 2:11)”.

          యేసు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించెను. మానవులు దేవుని రాజ్యము చేరాలంటే పరిశుధ్ద జీవితాలు కలిగియుండవలెను. అందువలన యేసుక్రీస్తు మానవుల పాప పరిహారార్దం సిలువ మరణం చెందినాడు. కాబట్టి దేవుని సువార్తను నమ్మి, యేసుక్రీస్తు మరణపునరుధ్దానాల మీద విశ్వాసముంచవలెను. “పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దెయింట కాపురముండి, తనయొద్దకు వచ్చువారినందరిని సమ్మానముచేసి ఏ ఆటంకమునులేక పూర్ణధైర్యముతో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన సంగతులు బోధించుచు ఉండెను (అ.కా 28:30,31)”.

కనుక సువార్తను నమ్మి దేవుని రాజ్యము అందుబాటులో ఉన్నప్పుడే స్పందించవలెను.