రెండు చెట్ల యొక్క మర్మము : Mystery of two trees

20/02/2010 10:15

              దేవుడు ఆదామును అవ్వను సృజించి ఏదేను తోటలో ఉంచినాడు. దేవుడు ఆదామును అవ్వను పెద్దవారుగా సృజించినాడు. అంటే కనబడతానికేమో 25 సం||రాల గలవారు కాని మనస్తత్వమేమో ఏమి తెలియని పసిపిల్లల వంటిది. సృజించిన తరువాత దేవుడు వారికిచ్చిన మొట్టమొదటి జ్ఞానం ఏమిటి? రెండు చెట్లను గూర్చిన జ్ఞానం. ఆ రెండు చెట్లు ఏదేను తోటలో చాలా ప్రత్యేకమైనవి. ఒకటేమో మంచిచెడ్డల తెలివినిచ్చు ఫలముల చెట్టు మరొకటేమో జీవవృక్ష ఫలములనిచ్చు చెట్టు.

            అసలు దేవుడు ఆ రెండు చెట్లును ఎందుకు ఆ తోటలో పెట్టాడు? ఆ రెండు చెట్లు లేకపోతే అసలు ఆదాము అవ్వలు పాపం చేసేవారు కాదు కదా! కాని ఆదాము అవ్వలు పాపం చెయ్యాలని దేవుడు ఎన్నడూ కోరుకోలేదు. అందుకే ఆ రెండు చెట్లను గూర్చిన జ్ఞానం మొదటిగా ఆదాముకు తెలియజేసెను. “మరియు దేవుడైన యెహోవాఈ తోటలోనున్న ప్రతి వృక్షఫల ములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయ ముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. (ఆ.కా 2:16,17) ” . మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినడం వలన మనకు మరణం తెచ్చిపెట్టాయి కాబట్టి మనం వాటిని మరణ వృక్ష ఫలములు అనవచ్చు. కనుక మరణ వృక్ష ఫలముల వలన మరణము, జీవవృక్ష ఫలముల వలన జీవము వస్తాయన్నమాట. మరి ఏ ఫలమును తినాలి అనే ఛాయుస్ (choice) దేవుడు మనిషికే ఇచ్చినాడు. ఆ రెండు చెట్ల ఫలాలు రెండు మార్గాలను తెలియజేస్తున్నాయి. ఒకటేమో జీవమార్గ ము మరొకటేమో మరణ మార్గము.

             దేవుడు మరణ వృక్ష ఫలం తినవద్దన్నాడు. సాతాను మరణ వృక్షఫలం తినవచ్చు అన్నాడు. అయితే ఆదాము ఎవరిమాట నమ్మాడు? తప్పు ఎవరిది? మనిషిదే. గమనిచండి. మరణ వృక్ష ఫలం కంటికి చాలా అందం గాను తినుటకు మంచి ఆహారముగాను కనబడెను. కాని మరణమును తెచ్చిపెట్టినది. అప్పటివరకు ఏమి తెలియని ఆదాము అవ్వ మరణ వృక్ష ఫలం తినంగానే వారు దిగంబరులుగా ఉన్నారని తెలిసివచ్చినది. దాని ఫలితం ప్రస్తుత ప్రపంచం. ఎప్పుడైతే సాతాను మాటవిని మరణ వృక్ష ఫలం తిన్నారో మరణ పాత్రులైపోయారు. దేవునికి లోబడకుండా సాతానుకు లోబడినారు. సాతాను మార్గంలోకి పడిపోయారు. సాతాను మార్గంలో పోటీతత్వం, అహంకారం, గర్వము, దురాశ, అసూయ, ఐక్యత లేని తనం, మొదలైనవి ఉన్నాయి. మంచి చెడుల మధ్య నలిగిపోతున్నాడు మానవుడు. ఏది మంచో ఏది చెడో తెలియడం లేదు. చేసే ప్రతి పనిలో చెప్పే ప్రతిమాటలో 50% మంచి 50% చెడు దాగిఉంటున్నాయి. అంతకంటే ఎక్కువ చేయలేడు, చెప్పలేడు ఎందుకంటే మన ఇంకా జీవ వృక్ష ఫలం తినలేదు కాబట్టి!

        మానవుడు దేవుని జ్ఞానమును తిరస్కరించి అవిధేయుడయ్యాడు. పర్యవసానంగా జీవమార్గం మానవునికి మూసివేయబడింది. జీవవృక్ష ఫలం తిని ఉంటే నిత్యజీవం పొందగలిగే వారు. ఆదాము దేవుని మాటవిని జీవవృక్ష ఫలము తిన్నట్లయితే ఈ ప్రపంచం మరోవిధంగా ఉండేది. ఆదాము మానవజాతికే ప్రతినిధిగా దేవుడిని తిరస్కరించి మరణాన్ని కోరుకున్నాడు. మరణ పాత్రుడైన ఆదాము జీవవృక్ష ఫలం తినకుండా దేవుడి దానిని మూసివేసి ఖడ్గజ్వాలలను కాపలాగా పెట్టెను. “అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. (ఆ.కా 3:24)”. జీవవృక్షం నిత్యజీవానికి సాదృశ్యము. జీవవృక్ష ఫలం పరిశుద్ధాత్మకు సాదృశ్య ము. మరలా దేవుడు తన కుమారుని ద్వారా జీవ వృక్షఫలాలను (పరిశుద్ధాత్మ) తినే అవకాశం ఇచ్చాడు. మరలా నిత్యజీవాన్ని మానవులకు దేవుడు తన కుమారుని ద్వారా అందుబాటు లోకి తెచ్చాడు. ఎవరైతే దేవుని కుమారుని సువార్తను విని, విశ్వాసముంచి, పశ్చాత్తాప పడి, మారుమనస్సు పొందుతారో అప్పుడు దేవుడు పరిశుద్దాత్మను(జీవవృక్ష ఫలం) అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ ఫలాలు—“అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్విక ము, ఆశానిగ్రహము. (గలతి 5;22)”

        ఆదాము ఎక్కడైతే దేవునికి అవిధేయుడై తప్పిపోయాడో మళ్ళి యేసుక్రీస్తు సువార్త ద్వారా విధే యులైన వారిని నిత్యజీవమునకు వారసులను చేసాడు. “ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము. (రోమా 6:23)” .

             గమనించండి. రెండు చెట్లు రెండు మార్గములను రెండు గుణాలను (character)ను సూచిస్తు న్నాయి. మరణానికి దాసులమైన మనల్ని నిత్యజీవానికి, దేవుని కుటుంబములోకి, దేవుని రాజ్యానికి, పరలోకానికి, పిలుస్తున్నాడు. ఇదే దేవుని సువార్త.

              జీవ వృక్షఫలమన్నా జీవజలమన్నా పరిశుద్ధాత్మే. “మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలములనది దేవునియొక్కయు గొర్రెపిల్లయొక్క యు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుటఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈ వలను ఆ వలను జీవవృక్షముం డెను; అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. (ప్రకటన 22:2)” .

 

దేవుడు మానవులకు ఇప్పటికి అదే ఛాయిస్ ఇస్తున్నాడు. మరి మీరు ఏ వృక్ష ఫలాలు తింటున్నారు? ◌