విత్తువాడు-విత్తనాలు

31/08/2010 15:34

 

విత్తువాడు విత్తనాలు

 యేసుక్రీస్తు ‘విత్తువాడు – విత్తనాలు’ గూర్చిన ఒక చాలా లోతైన ఉపమానమును చెప్పెను.

 

            యేసుక్రీస్తు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించెను. ఇది సువార్త ప్రకటన మాత్రమే. అంటే జనరల్ గా ఎనౌన్స్ చేసాడు. ఎవరికి ప్రత్యేకంగా గాని వ్యక్తిగతంగా బోధించలేదు. ఆ క్రమంలో ఆ సువార్తను వినే ప్రజలను గూర్చిన ఉపమానము చెప్పెను. అందరికి చూచునట్లు మరియు వినబడునట్లు దేవుని రాజ్యసువార్త అనే విత్తనాలు వెదజల్లెను. అప్పుడు నాలుగు రకాల పరిస్థితులలో ఉన్న దానిని విన్నారు. సాధారణంగా మనుష్యులు వారు ఉన్న పరిస్థితులను బట్టి వారి ప్రతిస్పందన ఉంటుంది.

            విత్తువాడు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తనములను వెదజల్లినప్పుడు అవి నాలుగు రకాల ప్రదేశములలో పడెను. ఆ విత్తనాలు 1. త్రోవ ప్రక్కన 2. రాతినేల మీద 3. ముండ్ల పొదల మద్య 4. మంచినేల మీద పడెను.

త్రోవపక్కన పడిన విత్తనాలు:-

                             కొన్ని విత్తనాలు త్రోవపక్కన పడెను. అప్పుడు పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. అంటే కొందరు మనుష్యులు దేవుని వాక్యమును వింటారు లేదా చదువుతారు కాని వారికి గ్రహింపులేనందున వారికి ఆ చదివిన దానిని లేదా విన్నదానిని కొద్దికాలంలోనే మరచిపోతారు. అసలు వీరికి విషయ పరిజ్ఞానం లేదన్నమాట. అంటే వీరికి background knowledge కొంచం కూడా లేదన్నమాట.

          ఇలాంటి వారికి సమాజిక రాజకీయ ప్రపంచక జ్ఞానం అసలుండదు. అందుకే వీరికి దేవుని రాజ్యసువార్త వాక్యం బోధపడదు. అర్ధం కాదు. దాని అర్ధం ఏమిటంటే సాతాను వీరిని మోసంచేసి దేవుని రాజ్యసువార్త కొంచం కూడా అర్ధం కాకుండా చేసేస్తాడు. వీరికి basic knowledge ఉండదు కాబట్టి ఎవరు ఏం చెబితే అటు వెళుతు చంచలమైన మనస్సు కలిగిఉంటారు.

రాతినేలమీద పడిన విత్తనాలు:-

                             కొన్ని విత్తనాలు మన్నులేని రాతినేలమీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అని వెంటనే మొలచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. ఇలాంటి వారు సువార్తవాక్యం వినగానే లేదా చదివిన వెంటనే అర్ధమోతుంది. మరియు అంగీకరిస్తారు కూడా!

          కాని ఆ తరువాత వారు ఆత్మసంబంధమైన దేవుని అనేక విషయాలతో పోషింపబడాలి. అంటే అంగీకరించినప్పుడు వారు చిన్నబిడ్డవలే నూతనముగా జన్మించినవారౌతారు. కనుక వారు దేవుని సంగతులు ఖచ్చింతంగా తెలుసుకోవాలి. ఆ రీతిగా ఎదగాలి.  లేనిచో బలహీనుడై, ఫలహీనుడై ఏదైన కొంచం శ్రమకలుగ గానే వెనక్కి పాతజీవితంలోకి వెళ్లిపోతారు. వీరు క్రమంగా దేవుని వాక్యాన్ని రుచి చూడనందువల్ల వారిలో బలములేక విశ్వాస జీవితంలో ఆగిపోతారు.

          దీనికి కారణం సాతానే. వాడు మనుష్యులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి వారి బలహీనతలమీద దెబ్బతీస్తాడు. తిండి లేదా డబ్బు లేదా సోమరితనం లేదా ఏదో ఒక వ్యసనం లాంటివాటిని వాడు ఉపయోగించుకొంటాడు.

ముండ్ల పొదలలో పడిన విత్తనాలు:-

                             కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి మొలచిన మొక్కును అణచివేసెను. అంటే ఇలాంటివారు కూడా రాజ్యసువార్త వాక్యమును వినిన లేదా చదివిన వెంటనే అంగీకరిస్తారు. చాలా దేవుని విషయాలు అర్ధం కూడా అవుతాయి.  దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను నేర్చుకుంటు ఎదగటానికి ప్రయత్నం కూడా చేస్తారు. కాని వీరు భూసంబంధమైన జీవితమును పూర్తిగా విడనాడలేకపోతారు. ఈ లోక ఆశలు వీరిలో ప్రధమ స్థానాన్ని ఆక్రమిస్తాయి. ముఖ్యంగా ధనాశ వీరి ఎదుగుదలను ఆపేస్తుంది. ధనాశ కారణంగా వీరి ఆధ్యాత్మక జీవితం గతి తప్పి దేవుని విషయాలలో ఎదగలేక ఆగిపోతారు.

                   సాతాను మనుష్యుల యొక్క ఈ లోక ఆశలను ఆధారం చేసుకొని వారిని ఎదగనీయకుండా నాశనం వైపు నడిపిస్తారు.

మంచినేల మీద పడిన విత్తనాలు:-

                             మంచినేలను విత్తబడినవాడు రాజ్యసువార్తను విని గ్రహించువాడు. అట్టవారు సఫలులై ఒకడు నూరంతలుగాను, అరవదంతలుగాను మరియు ముప్పదంతలుగాను ఫలించును. ఇలాంటివారు సువార్త వాక్యమును విని లేదా చదివి, గ్రహించి సరైన నిర్ణయం తీసుకొంటారు. వీరికి దేవుని ఆత్మసంబంధమైన విషయాలలో ఆసక్తి కలిగి, చిత్తశుద్ధితో క్రమక్రమంగా ఎదగటానికి ప్రయత్నిస్తారు. దేవుని శక్తిని ఆశ్రయిస్తారు.

                        భౌతిక జీవితమునకు మరియు ఆత్మసంబంధమైన జీవితానికి ఉన్న సంబంధమును పూర్తిగా గ్రహిస్తారు. నీతి, సత్యం, ప్రేమ, న్యాయం, త్యాగం మరియు ధర్మశాస్త్రము మొదలైన విషయాలు దేవుని వాక్యం నుండి సొంత జీవితాలకు అన్వయించుకొంటారు. ప్రతిదానికి దేవుని మీద ఆధారపడతారు. సత్యవాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును క్రమంగా పొందుకొంటారు. క్రమక్రమంగా ఎదుగుతూ చిన్న యేసుక్రీస్తువలే తయారవుతారు. “క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.”(ఫిలిప్పి 2:4).

                        వారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు దేవుని వాక్యపు వెలుగులో తీసుకొంటారు. గమనించండి! అందరు ఒకేసారి ఒకేలాగ ఎదగరు. వారు పిలువబడిన పిలుపు మేరకు వారు నూరంతలుగాను, అరవదంతలుగాను మరియు ముప్పదంతలుగాను ఫలించుచు దేవుని నామానికి మహిమతెచ్చేవారివలె ఈ భౌతిక జీవితం జీవిస్తారు.

ఏర్పరచనడిన వారు

          దేవుడు తన రాజ్యసువార్త ద్వారా ప్రస్తుతం ఈ లోకానంతటిని పిలువలేదు కాని కొందరినే పిలుస్తున్నాడు. ఈ ఉపమానమే అందుకు సాక్షం. కేవలం మంచినేలను విత్తబడినవాడు మాత్రమే దేవుని రాజ్యాన్ని చేరతారు. మిగతావారు తమ తమ వ్యాపకాలలోపడి ఆసక్తి చూపకుండా ఈ ఉపమనంలో వలే పిలుపును వ్యర్ధపరుచుకొంటున్నారు.

అందుకే పిలువబడినవారు అనేకులు కాని ఏర్పరచబడినవారు కొందరే!!!!