వివాహమెందుకు?

28/04/2010 21:45

                    ఎవరైన ఈ ప్రశ్న అడిగితే మీకేమైన పిచ్చా అని చాలా మంది అంటారు. కాని మానవులు పెళ్లెందుకు చేసుకుంటారు? అని అడిగితే ఎవరి దగ్గర అర్ధవంతమైన జవాబు ఉండదు. గమనించండి! దేవుడు మొదటి వివాహం జరిపించి దానిని కొనసాగించమన్నాడు. వివాహం ద్వారా ఒక కుటుంబం ప్రారంబమౌతుంది.

          గమనించండి! ఆత్మసంబంధమైనది(spiritual) ఉన్నది కాబట్టే భౌతికమైనది(physical) ఏర్పడింది. అంతేగాని భౌతికమైనది ముందుండినది కాదు. భౌతికంగా ఉన్న ప్రతిదానికి ఆత్మసంబంధమైన కారణం ఉన్నది. ఆత్మసంబంధమైన కుటుంబం ఉంది కాబట్టి ఇక్కడ కుటుంబాలున్నాయి. అక్కడ వివాహం ఉంది కాబట్టి మనకు ఇక్కడ వివాహాలున్నాయు. “పరలోకమునందును భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని”(ఎఫెసి 3:15). పరలోకమందున్న మన తండ్రివలన ప్రతికుటుంబము ఏర్పడినది. తండ్రియైన దేవుడు కుమారుడైన క్రీస్తు అని అంటున్నామంటే అక్కడ కుటుంబం ఉందని అర్ధమౌతుంది.

          వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. “వివాహము అన్ని విషయములలో ఘనమైనది”(హెబ్రి 13:4). ఎందుకు? ఏందుకంటే క్రీస్తుకు మరియు సంఘమునకు మధ్య జరిగే నిజమైన ఆత్మసంబంధమైన వివాహాన్ని సూచిస్తున్నది కాబట్టి. అది ఈ సృష్టిలోనే మహిమగల, జీవముగల పరిశుద్ధమైన వివాహం. కేవలం ఈ వివాహం ఉంది కాబట్టి దేవుని పోలికలో మరియు స్వరూపంలో పుట్టిన మానవులకు వివాహలున్నాయి.

          వివాహం అంటే ఏకమవడం. ఒకటైపోవడం. ఐక్యమవడం. క్రీస్తు శిరస్సు అయితే సంఘము మిగతా శరీరం. మొత్తం కలిపితే ఒకే శరీరం. వివాహం చేసుకొన్నవారు ఒక క్రొత్త అవగాహనలోకి వచ్చారన్నమాట. అంటే ఇద్దరు కలసి ఒక నిబంధనలోకి చేసుకున్నారన్నమాట. వారి మాటలు, మనస్సు, నిర్ణయాలు, కోరికలు, క్రమక్రమంగా ఒకటై పోవాలి. అలా ఉండుట కొరకు క్రీస్తు తన భార్య కొరకు తన ప్రాణం అప్పగించి పరిశుద్ధముగా దానిని నిలబెట్టెను. “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దాని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దాని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను”(ఎఫెసి 5:25-27). ఫలితం, తన భార్యయైన సంఘం అత్యంత పరిశుద్ధంగా తన యొద్దకు చేర్చబడును. ఆ రీతిగా వివాహం చేసుకొనే ప్రతివారు ఆలోచించాలి. లేకపోతే మన జీవితాలకు మరియు వివాహాలకు అర్ధం ఉండదు.

          దేవుడు కుటుంబ జీవితంలో చాలా భౌతికమైన ఆనందాలను ఇచ్చినాడు. అన్ని దేవుని వాక్యప్రకారం చేస్తే ఏ తప్పు లేదు. భార్యాభర్తల మధ్య దేవుడు లైంగిక సంబంధమునిచ్చినాడు. ఇది వారి ఐక్యతకు మరియు ఫలించి అభివృద్ధి చెందుటకు ఇచ్చినాడు. లైంగిక సంబంధం కేవలం భార్యాభర్తలకు మాత్రమే. వేరే ఎవరైనా ఈ సంబంధం కలిగియుంటే అది వ్యభిచారం. అది కేవలం పాపం. ఈ మధ్యనే మనదేశ సుప్రీం కోర్టు ఒక సంచలన ప్రకటన చేసింది. అదేమిటంటే పెళ్లికాకుండా స్రీపురుషులు కలసి జీవించవచ్చు(లైంగిక సంబంధం కలిగిఉండవచ్చు). కాని దేవుని వాక్యం ప్రకారం అది పాపము. అది కేవలం వ్యభిచారము. వివాహ సంబంధములో లేని ప్రతి లైంగిక సంబంధం వ్యభిచారమే.

          దేవుడు మానవులకు కుటుంబ జీవితాలనిచ్చి వారికి జ్ఞానమును ఇవ్వదలచినాడు. కుటుంబ జీవితం స్వార్ధంలేని జీవితం. కుటుంబలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత, సంతోషం, సహాయం, బాధలు అందరు పంచుకొని ఐక్యతను ప్రతి ఒక్కరు జీవితకాలంలో నేర్చుకోవాలని దేవుడు కుటుంబాలనిచ్చాడు. తద్వారా అనేక ఆత్మసంబంధమైన సత్యాలను మనకు నేర్పిస్తున్నాడు. గమనించండి. దేవుని సంఘము కూడా ఇందుకే. అందుకే దానిని దేవుని కుటుంబం అంటాం. 

          మానవుల కొరకైన దేవుని ప్రణాళికలో వివాహమనేది చాలా ప్రాముఖ్యమైనది. అసలు వివాహం ద్వారా దేవుని సంఘం తన పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తుతో ఐక్యం చెందినప్పుడు అందరు నిత్యజీవమును పొందుకొంటారు. అందుకే వివాహం అన్ని విషయములలో ఘనమైనది.