విశ్రాంతిదినమును జ్ఞాపకము చేసుకో....

26/10/2011 20:01

విశ్రాంతిదినమును జ్ఞాపకము చేసుకో....

              విశ్రాంతిదినం అంటే ఏమిటి? ఎందుకు పాటించాలి? విశ్రాంతిదినం కేవలం యూదులకేనా? క్రైస్తవులకి కూడానా? ఏదో ఒక రోజు పాటిస్తే ఏమైన సమస్య ఉందా? ఇంతకి దేవుని వాక్యం ఏమి చెపుతుంది. మన మొదటి క్రైస్తవులు ఏ దినమును విశ్రాంతిదినముగా పాటించారు?  వారు యేసు క్రీస్తుతో కలసి జీవించినవారు. యేసు చనిపోయి తిరిగిలేచి ఆరోహనుడైన తరువాత, వారు ఏ రోజున దేవుని ఆరాధించారు? ఏ రోజుని విశ్రాంతిదినంగా ఆచరించారు తెలుసుకొంటే మనం ఈ రోజున ఏలా ఆచరించాలో ఏ రోజున ఆచరించాలో సులభంగా తెలిసిపోతుంది కదా!!!. ఆయా విషయాలన్ని అపోస్తులుల కార్యములు పుస్తకములో చాలా చక్కగా వ్రాయబడినాయి. 

నిజమైన 7వ దినము

                మన మొదటి క్రైస్తవులు ఏ దినమును విశ్రాంతిదినముగా పాటించారు?  వారంలో ఏడవ దినము విశ్రాంతిదినమని దేవునివాక్యం చెపుతుంది. “ఆరు దినములు పనిచేయవలెను; వారములో ఏడవ దినము విశ్రాంతి దినము; అది పరిశుద్ధసంఘపు దినము. అందులో మీరు ఏ పనియైనను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతిదినము.(లేవి 23:3)”.  విశ్రాంతిదినం అంటే ఇప్పుడు శనివారం.  ఎందుకంటే శనివారము తరువాత ఆదివారం వచ్చును.

“విశ్రాంతి దినము గడచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా (మత్తయి 28:1)”.

                అది సరే! కాలక్రమంలో వారంలో దినములు కూడా మారి ఉండవచ్చు ఎవరైన అనుకొవచ్చు. అలా అనుకోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే వారంలో దినములు కూడా దేవుడే నిర్ణయించాడు. ఏ రోజు మెదటి దినమో మరియు ఏది చివరి దినమో చాలా తేటగా తెలియపరిచాడు.

                గమనించండి. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉండగా వారికి మన్నా అనే ఆహారం ఆకాశమునుండి కురిపించాడు. వారికి వరుసగా ఆరు రోజులు ఆ ఆహారము ఆకాశమునుండు కురియును కాని ఏదవ రోజున మాత్రము అది కురియదు. “ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను; ప్రజలలో కొందరు ఏడవ దినమున దాని కూర్చుకొన వెళ్లగా వారికేమియు దొరకక పోయెను. (నిర్గమ 16:26,27)”.  ఆ విధంగా ఏది నిజమైన ఏడవ దినమో మనకు దేవుడే తెలియజేసినాడు. కనుక అందులో ఏమి తప్పు జరుగటానికి ఆస్కారమే లేదు.

వాడుక

                  అది సరే! యేసు తన జీవితకాలములో సమాజ మందిరానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాడు? యేసు చిన్ననాటి నుండి ప్రతి విశ్రాంతిదినమున సమాజ మందిరానికి వెళ్ళడం అలవాటు. “తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను తన వాడుకచొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోకి వెళ్లి చదువుటకై నిలుచుండగా...(లూకా 4:16)”. తన సేవ మొదలుపెట్టిన తర్వాత ప్రతి విశ్రాంతిదినమున ఆయన భోధించాడు “విశ్రాంతిదినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు (లూకా 13:10)”. యేసుక్రీస్తు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడు. ఆయనే దానిని సృష్టించినాడు “అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువై యున్నాడని వారితో చెప్పెను (మార్కు 2;28)”.  

                  యేసుక్రీస్తు చనిపోయి తిరిగి ఆరోహనుడైన తరువాత అపోస్తులుడైన పౌలు యేసునందు విశ్వాసముంచి దేవుని పరిచర్య చేసినాడు. మరి పౌలు ఏ రోజును పాటించాడు? పౌలు కూడా యేసుక్రీస్తు మాదిరిగానే విశ్రాంతిదినమునే పాటించాడు. “గనుక పౌలు తన వాడుకచొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి - క్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట అవశ్యమనియు, నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పిచెప్పుచు, వారితో మూడు విశ్రాంతిదినములుతర్కించుచుండెను (అ.కా 17:2,3)”. పౌలు అన్యుల దేశాలలో దేవుని సేవా చేసినాడు. అయినా సరే ప్రతి విశ్రాంతిదినమున మాత్రమే బోధించెను. “అతడు ప్రతి విశ్రాంతిదినమున సామాజమందిరములో తర్కించుచు, యూదులను హెల్లేనీయులను ఒప్పించుచుండెను (అ.కా 18:4)”.

                    ఈ వచనం గమనించండి: “వారు సమాజమందిరములోనుండి వెళ్లుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిదినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి (అ.కా 13:42)”. పౌలుగారు ఈ విధంగా తన బోధను Next విశ్రాంతిదినమున కొనసాగించారు. ఆదివారంలో బోధించినట్లు ఈ ఒక్కచోట వ్రాయబడింది. “ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను (అ.కా 20:7)”. ఇక్కడ సందర్బాన్ని గమనించండి! దేవునివాక్యం ప్రకారం శనివారం సూర్యాస్తమయంతో ఆదివారం మొదలౌతుంది. మరియు ఆదివారం సూర్యాస్తమయంతో సోమవారం మొదలౌతుంది. పౌలు శనివారం సూర్యాస్తమయం దాటి అర్ధరాత్రివరకు (అంటే ఆదివారంలో) ప్రసంగిచాడు. ఆ అర్ధరాత్రి వారితో బోజనం(ఆదివారంలోనే రొట్టే విరిచాడు) చేసాడు. మరలా తన తెల్లవారి వరకు ప్రసంగం కొనసాగించాడు. ఎందుకంటే మరునాడు ఉదయమునే అక్కడ నుండి వెళ్ళనైయున్నాడు. ఇదే వారికి ఆయన చివరి ప్రసంగం. ఆ తర్వాత ఆయన యెరుషలేంలో హతసాక్షి అయినాడు. నిజానికి ఆ యొక్క కూడిక శనివారమే (విశ్రాంతిదినమునే) మొదలైంది కాని అలా కొనసాగించాడు. ఎందుకంటే ఆ యొక్క సందర్బం అలాంటిది.

విశ్రాంతిదినము పాటించటం దేవుని ఆజ్ఞ

                        పది ఆజ్ఞలలో నాల్గవ ఆజ్ఞ “విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము (నిర్గమ 20:8)”.

                        గమనించండి. విశ్రాంతిదినమును జ్ఞాపకమునకు తెచ్చుకోవలెను. ఇది ఎప్పుడో సృష్టించబడింది. అంతేకాని దేవుని పది ఆజ్ఞలలో కొత్తగా చేర్చబడలేదు. దేవుడు మొదటి ఆరు రోజులు ఈ సృష్టికోసం పనిచేసి ఏడవ రోజున విశ్రమించాడు. “దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను (ఆ.కా 2:2)”. మరియు ఏడవ రోజును ఆశీర్వదించి పరిశుద్దపరచాడు. గమనించండి. దేవుడు ఏడవ రోజును ఆశీర్వదించి పరిశుద్దపరచాడు. “కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను (ఆ.కా 2:3)”.            

                        విశ్రాంతిదినము అంటే దేవుని సబ్బాతుదినం. సబ్బాతు అంటే విశ్రాంతి (Rest) అని అర్ధం. ఆనాటి నుండి ఏడవరోజు సృష్టికర్తకు తన ప్రజలకు గుర్తుగా ఉంది. “ఇశ్రాయేలీయులు తమ తర తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను; అది నిత్యనిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతైయుండును; ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవదినమున పని మాని విశ్రమించెనని చెప్పుము (నిర్గమ 31:16,17)”.

                        ఇది సలహా కాదు. ఆజ్ఞ. “ఆజ్ఞాతిక్రమమే పాపము (1 యోహాను 3:4)”. ఇది చిన్న విషయం కాదు. క్రైస్తవులు అని చెప్పుకొనే వారు దేవునియందు భయభక్తులు కలిగియుండ వలెను. యేసు చెప్పేను -నేనే మార్గమును సత్యమును జీవమునై యున్నాను.   మరి ఆదివారం ఆరాధనా ఎక్కడనుండి వచ్చింది?

నీవు వ్యర్దముగా ఆరాధిస్తున్నావా?

                    చాలామంది యేసుక్రీస్తు శుక్రవారం మరణించాడని మరియు ఆదివారం పునరుద్ధానము చెందినాడని నమ్ముతారు. అలా అని వాక్యంలో లేదు.(పూర్తి వివరణ కోసం మా అడ్రస్ కు వ్రాయండి). ఈ విధంగా ఆదివారంను ప్రభువుదినముగా చేసుకొని పాటించడం(ఆరాధించడం) జరుగుతుంది. నిజానికి దేవునివాక్యంలో లేదు. కాని రోమన్ క్యాథలిక్ సంఘం మాత్రం విశ్రాంతి దినమును ఆదివారమునకు మార్చి, కొన్ని వందల సంవత్సరాలుగా ఆదివారమునే పాటిస్తు వస్తున్నది. ఆ తరువాత వచ్చిన ప్రొటెస్టెంట్లు కూడా దానినే అనుసరించాయి.

                      మనము ప్రభువును సత్యముతో ఆరాధించవలెను. “దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.(యోహాను 4:24)”. అంతేకాని మనకు ఇష్టమైన రీతిలో ఆయనను ఆరాధించకూడదు. దేవుడు మనకు ఇచ్చిన దేవోపదేశములను మరియు విశ్రాంతి దినములను పాటించవలెను. అంతే అర్ధంలేని మానవుల పద్దతులను పాటించకూడదు. అలా చేస్తే మనం ఆయనను వ్యర్ధముగా ఆరాధించిన వారమౌతాము. “అందుకాయన వారితో ఈలాగు చెప్పెను -ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే.(మార్కు 7:6,7)”

                    సాతాను సర్వలోకమును మోసం చేసి దేవునికి దూరం చేసాడు. కాని ఈ విషయంలో మోసపోయం అని అంటే అందులో దేవుని తప్పేంలేదు. ఎందుకంటే “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును (గలతి 6:7)”. సత్యం ఎప్పుడు మనందరికి అందుబాటులోనే ఉంది.

                   విశ్రాంతిదినాన్ని మనందరం జ్ఞాపకం చేసుకొని పరిశుద్దముగా ఆచరించవలెను.