విశ్వాసము అంటే ఏమిటి? : Faith

20/02/2010 09:38

            దేవుని వాక్యములో చాలా చోట్ల ఇలా వ్రాయ బడివుంది. “యేసునందు విశ్వాసముంచుము అప్పు డు నీవు రక్షించబడుదువు”. యేసునందు విశ్వాసముంచడం అంటే ఏమిటి? యేసుక్రీస్తును నమ్ముకోవడమా? లేదా ఏదైనా సువార్త సభలో చెయ్యెత్తడమా? దేవుని వాక్యం ఏమి చెపుతుంది?

             యేసుక్రీస్తు ప్రకటించిన లేదా భోధించిన మెస్సేజ్ ని నమ్మి అనుసరించడమే యేసునందు విశ్వాసముంచడమంటే. ఇంతకి యేసు ప్రకటించిన దేమిటి? యేసుక్రీస్తు సువార్తను ప్రకటించెను. మానవు లకు ఇంతకంటే పెద్ద శుభవార్త వుండదు. యేసుక్రీస్తు దేవుని రాజ్యము గూర్చిన సువార్తను ప్రకటించెను. పరిశుద్ధులు మాత్రమే దేవుని రాజ్యమును చేరతారు. కనుక యేసునందు ఒక్కసారి విశ్వాసముంచితే సరి పోదు. దానిని కొనసాగించాలి. “మనముకూడ ప్రతిభా రమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడి చిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మనయెదుట ఉంచ బడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము (హెబ్రి 12:2)”. పరిశుద్ధాత్మ ఫలాలలో విశ్వాసము కూడా ఒకటి. “అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోష ము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహ ము. (గలతి 5:22)”.

            ఈ ప్రపంచంలో ఎవరు ఎవర్నైనా విశ్వసించవచ్చు. కాని నీవు విశ్వసించినది లేదా విశ్వసించిన వాడు మోసపూరితమైనదైతే నీ విశ్వాసము వ్యర్ధమౌతుంది. అంటే మనము ఎవరిమీద విశ్వాసముంచు తున్నామో అన్నది ముఖ్యమైన విషయం. గమనించండి! ఒక అమ్మాయి తనను పెళ్లిచేసుకొంటాడని ఒక తెలిసిన ఒక అబ్బాయి మీద విశ్వాసముంచింది అను కొండి. తీరా ఆ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లిచేసు కొంటే ఆ అమ్మాయి విశ్వాసము ఏమౌతుంది? ఆ అమ్మాయి విశ్వాసముంచడం అనే ప్రక్రియలో తప్పులేదు కాని ఒక నమ్మకస్తుడుకాని అబ్బాయి మీద విశ్వాస ముంచి తప్పుచేసింది. అలాగే మన విశ్వాసము ఎవరి మీద లేదా ఏ మాట మీద ఉంచుతున్నాం అన్నది ప్రాముఖ్యమైన విషయం.

            యేసుక్రీస్తు సువార్తను ప్రకటించెను. “ఆయన - నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమేగదా నేను పంపబడి తినని వారితో చెప్పెను. (లూకా 4:43)”. అయితే ఆయనను మనం ఎందుకు నమ్మాలి? ఎందుకు విశ్వాసముంచాలి? ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. వాగ్ధానము చేయబడిన మెస్సయ్య. ఆయన జననం, మరణం ప్రత్యే కం. ఆయన నీతిమంతమైన జీవితం జీవించెను. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును లేదు. మనకొరకు తన ప్రాణం పెట్టెను. “క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలనుబట్టి నడు చుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను. ఆయన పాపముచేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కన బడలేదు. ఆయన దూషింపడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమపెట్టబడియు బెదరింపక, న్యాయము గా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతివిష యమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. (1 పేతురు 2:21-24)”.

             ఆయన సువార్త ప్రకారం మనం పరిశుద్ధుల మవుటకు తన శరీరం చీల్చి మార్గము ఏర్పరచినాడు. “సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమును, అనగా నూతనమైనదియు, జీవము గలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పర చబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి యున్నది (హెబ్రి 10:19,20)”. మనకోసం ఆయన సిలువ మరణం పొందెను అనే విషయం ఆ రోజుల్లో అన్యజనులకు వెర్రితనంగా అనిపించినది. ఎందుకంటే అలాంటి మరణం కేవలం ఒక భయంకరమైన నేరస్తుడికి వేస్తారు. “సిలువనుగూర్చిన వార్త నశించుచున్నవారికి వెర్రితనముగాను రక్షింపబ డుచున్న మనకు దేవుని శక్తి. (1 కొరింథీ 1:18)”. అన్నింటికంటే ముఖ్య విషయం—ఆయన చెప్పినట్లు మూడు రోజుల తరువాత మరణం గెలచి తిరిగి లేచాడు. కనుక దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్తను ఖచ్చితంగా విశ్వసించవచ్చు. ఆయనయందు విశ్వాసముంచినప్పుడు మన జీవితాలలో స్వస్థత, జ్ఞానము, వివేకము, శాంతి, సమాధానము, పరిశుద్ధత మరియు చివరికి నిత్యజీవమును(రక్షణ) అనుగ్రహిస్తాడు. 

             యేసు నందు విశ్వాసముంచడం అంటే ఆయన సువార్త యందు విశ్వాసముంచడం, ఆయన బోధయందు విశ్వాసముంచడం. “అయ్యలారా, రక్షణ (నిత్యజీవమును) పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు - ప్రభువైన యేసునందు విశ్వాసముం చుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ (నిత్యజీవమును) పొందుదురని చెప్పిఅతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము(దేవుని సువార్తను) బోధించిరి. (అ.కా 16:30-32)”.

కనుక! యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవు రక్షించబడతావు. ◌