సంపాదకీయం

08/03/2010 16:51

ప్రియమైన పాఠకులకు,

           దేవుని నామమున మీ అందరికి శుభములు.

           క్రైస్తవులు పాటించే పండుగలన్ని దేవుని వాక్యంలో ఉన్నాయా? మన మొదటి అపోస్తలులు వాటిని పాటించి మనలను కూడా పాటించమని చెప్పినారా? అని ప్రశ్నించుకొంటే సమాధానం ఉండదు. ఎందుకంటే ఆ పండుగలన్ని దేవుని వాక్యంలో లేవు. ఉదాహరణకు యేసుక్రీస్తు మంచి శుక్రవారం మరణించలేదు మరియు ఆదివారం పునరుద్ధానం చెందలేదు. కాని అందరు ఈ పండుగలు వ్యర్ధముగా పాటిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే దేవుని వాక్యములో ఉన్న పండుగలు ఎవరూ పాటించుటలేదు కాని లేనివి మాత్రం అందరు పాటిస్తున్నారు.

          ప్రేమ కలిగిన దేవుడు మనలను ప్రేమించి మనకు ఆ పండుగలనిచ్చినాడు. ఆ పండుగలన్ని పరిశుద్ధ దినాలు. ఆ పండుగలన్ని దేవుడు మనకొరకు చేసిన/చేయపోతున్న కార్యాలను తెలియజేస్తున్నాయి. దేవుడు తన ప్రవక్తలకు అంత్యదినాలలో సంభవింపబోవు సంగతులను ముందుగానే తెలియపరిచాడు. కాని వాటి అర్ధం మాత్రం తెలియకుండా అంత్యదినాల వరకు ముద్రవేసినాడు. “అతడు ఈ సంగతులు అంత్యకాలమువరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక, దానియేలూ, నీవు ఊరకుండుమని చెప్పెను.” (దానియేలు 12:9).

            ఇప్పుడు దేవుడు వాటన్నిటిని బయలుపరిచాడు. ఈ అంత్యదినాలలో దేవుని అన్నీ విషయాలు బయలుపరచబడి ఉన్నవి కాని కేవలం బుద్ధిమంతులు మాత్రమే గ్రహించెదరు. దుష్టులకు ఈ సంగతులు అర్ధం కానేరవు. “దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు.” (దానియేలు 12:10).

 

దేవుడు మిమ్ములను దీవించును గాక!