1వ పరిశుద్ధ దినం—పస్కా పండుగ

11/03/2010 09:42

         సంవత్సరంలో ఇదే మొదటి పండుగ. పస్కా అనగా “దాటిపోవుట” అని అర్ధం. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి మహా అద్బుతరీతిగా విడుదల కలుగజేసెను. ఐగుప్తు దేశములో సుమారుగా 400 సంవత్సరాలు ఘోరమైన బానిసత్వమును అనుభవించారు. ఐగుప్తు పాపమునకు సాదృస్యము. దేవుడు అనేక తెగుల్లను ఐగుప్తుయుల మీదకు రప్పించెను. వాటిలో చివరిది మహాభయంకరమైనది. అదేదనగా – “ఐగుప్తుదేశములో నివసించు మనుష్యులలో మరియు జంతువులలో తొలి సంతానమును దేవుని దూత వచ్చి హతము చేయును.”  అయితే ఎవరైతే ఒక గొర్రెపిల్లను వధించి దాని రక్తము ఇంటిద్వారము యొక్క రెండు నిలువుకమ్ముల మీద చల్లుతారో ఆ ఇంటిలోనికి రాకుండా దేవుని సంహారకుడు దాటిపోతాడు. అంతేకా కుండా గొర్రెపిల్ల మాంసమును ఆ రాత్రే అగ్నిచేత కాల్చి మొత్తం భుజించవలెను. దేవుని కృప వలన ఇశ్రాయేలు ప్రజలందరు ఈ విధంగా చేసి దేవుని సంహారకుడు నుండి రక్షించబడినారు.

        పస్కా పండుగ వారి తరతరములు పాటించవలెను. “ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతల కందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహోవాను. మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దానినాచరింపవలెను.”  (నిర్గమ 12:12-14).

        యేసుక్రీస్తు పస్కాను క్రమం తప్పకుండా ఆచరించెను. ఆయన మరణమునకు ముందు శిష్యు లతో కూడా పస్కా భోజనమును భుజించెను. ఆ రాత్రి నూతన నిబంధనకు సంబందించి పస్కాను ఎలా ఆచరించాలో క్రమమును తెలియజేసెను. మరుసటి దినము మధ్యాహ్నం 3 గంటలకు సిలువ మీద పస్కా గొర్రెపిల్ల మనందరి కోసం వధింపబడెను. యేసుక్రీస్తు పస్కా పండుగ రోజునే సిలువ మరణం పొందెను. (దేవునివాక్యం ప్రకారం సూర్యాస్తమయం నుండి మరల సూర్యాస్తమయం వరకు ఒక రోజుగా పరిగణించబడుతుంది.) యేసుక్రీస్తు అను మన పస్కా గొర్రెపిల్ల జనులందరి కొరకు వధింపబడెను. “ఇంతేకాక క్రీస్తు అను మన పస్కాపశువు వధింపబడెను.” (1 కొరింథీ 5:7).

        ఎవరైతే పాతనిబంధనలో మాదిరిగా క్రొత్త నిబంధన పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా పాపమునుండి విడుదల పొందుతారో వారు ఈ పస్కా పండుగను మరలా ప్రభువు వచ్చువరకు ఆచరించవలెను. కనుక నిజమైన మారుమనస్సు పొందినవారు మాత్రమే ఈ పస్కా పండుగ ఆచరించుటకు అర్హులు. కనుక ఎవరును అయోగ్యముగా  ప్రభువు యొక్క పస్కాను పాటించకూడదు. “నేను ఈ విషయమై మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి దాని విరిచి - యిది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని - యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీని లోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని యీ పాత్ర లోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చు పర్యంతము ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు.”(1 కొరింథీ 11:23-30).

        గమనించండి. ప్రభువు రాత్రిభోజనమన్నా లేదా పస్కా పండుగన్నా ఒక్కటే. కాని రొట్టెవిరుచుట అంటే ప్రభువు రాత్రిభోజనము కాదు అది కేవలం భోజనం చేయడం. పస్కా పండుగను లేదా ప్రభువు రాత్రిభోజనము ఏ రోజున మరియు ఎప్పుడు పాటించవలెను? సంవత్సరానికి ఒకసారి మాత్రమే పస్కా పండుగను ఆచరించవలెను. దేవుని క్యాలండర్ ప్రకారం మొదటి నెలలో 14వ తారీఖున సాయంకాలమున పస్కా పండుగ ఆచరించవలెను. “మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును.”(లేవి 23:5).