3వ పరిశుద్ధ దినం— పెంతెకొస్తు పండుగ

12/03/2010 21:54

        పెంతెకొస్తు పండుగను ప్రధమ ఫలముల పండుగ లేదా వారముల పండుగ అని కూడా అంటారు. పులియని రొట్టెల పండుగ తరువాత ఈ పండుగ వస్తుంది. పులియని రొట్టెల పండుగలో చివరి సబ్బాతుదినం నుండి 7 వారాలు లెక్కించవలెను. 7వ సబ్బాతుదినం తరువాత రోజే పెంతెకొస్తు పండుగ. ఈ పండుగలో ఇశ్రాయేలీయులు తమ పంట యొక్క ప్రధమ ఫలమును దేవునికి అర్పిస్తారు. ఈ రోజున అందరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. జీవనోపాధికి సంబంధించిన పని చేయకూడదు. అంతేకాకుండా ఆశీర్వదించబడిన కొలది అందరు దేవునికి కానుకలు సమర్పించవలెను. నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాని నియ్యవలెను.”(ద్వితియో 16:10).

            దేవుడు ఇశ్రాయేలును బానిసత్వం నుంచి విడిపించి వారు తమ స్వంతదేశములో స్వంత పొలములను పండించి జీవించే విధముగా చేసెను. కనుక ప్రధమ ఫలములు దేవుని అర్పింపవలెనని దేవుడు కట్టడ నియమించెను.

             క్రొత్త నిబంధనలో క్రైస్తవులు ఈ పండుగను ఆచరించినారు. ఈ పండుగ రోజునే దేవుడు పరిశుద్దాత్మను సంఘమునకు అనుగ్రహించినాడు. పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి ఆకస్మాత్తుగా కలిగి, వారు కూర్చుండియున్న యిల్లంతయు వ్యాపించెను.  మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక నిమీదవ్రాలగా అందరు పరిశద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్ఛక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.”(అ.కా 2:1-4).

            పెంతెకొస్తునాడు సంఘము దేవుడు వాగ్దానము చేసినటువంటి పరిశుద్దాత్మను పొందినది. పెంతెకొస్తు దేవుని ప్రధమఫలములైనా సంఘమును సూచిస్తుంది. ఆదాము మొదలుకొని యేసు రెండవ రాకడ వరకు పరిశుద్దాత్మను పొందిన ప్రతి ఒక్కరు దేవుని రాజ్యములో ఉంటారు. అంటే దేవుని కుటుంబములో ఆత్మసంబంధముగా జన్మిస్తా రు. దేవుడు సృజించిన ఈ సృష్టిలో మొదటిగా దేవుని కుటుంబములోకి ప్రవేశించి నిత్యజీవమును పొందునవారు వీరే. వీరు దేవుని ప్రధమ ఫలము. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్య వాక్యమువలన మనలను తన సంకల్పప్రకారము కనెను.” (యాకోబు 1:18). వీరందరు దేవుని చేత పాపలోకంలో నుండి విమోచింపబడి పరిశుద్దులుగా తమ జీవితమును కొనసాగించినారు. మరియు దేవుని కోసం చాలా మంది హతసాక్షులైనారు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగనివారునైయుండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవుని కొరకును గొర్రెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.”(ప్రకటన 14;4).