4వ పరిశుద్ధ దినం—బూరధ్వని పండుగ

12/03/2010 22:02

 

పెంతెకొస్తు పండుగ తరువాత వచ్చు పరిశుద్ధ దినము బూరధ్వని పండుగ. దేవుని మహత్తరమైన ప్రణాళికలో ఈ పండుగ చాలా ప్రాముఖ్యమైనది. దేవుని క్యాలెండర్ ప్రకారం 7 వ నెల మొదటి తేధీన ఈ పండుగ జరుగును. ఈ రోజున అందరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. జీవనోపాధికి సంబంధించిన పని చేయకూడదు. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతిదినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని(బూరధ్వని) (a memorial of blowing of Trumpets) వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను”(లేవి 23:24).

            యేసుక్రీస్తు రెండవరాకను గూర్చి ఈ పండుగ తెలియజేస్తుంది. నిజమైన క్రైస్తవులు కూడా కరబూర ధ్వని వినిన వెంటనే ఆత్మ సంబంధముగా తిరిగి జన్మిస్తారు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మనమందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పు డు మృతులు అక్షయలుగా లేపబడుదురు, మనము మార్పుపొందుదుము.”(1 కొరింథీ 15:52).  

             ప్రకటన గ్రంధములో 7 బూరలు ఊదబడ్డాయి. ఒక్కొక్క బూర ఊదగా ఒక్కో సంఘటన జరుగుతుంది. ఎప్పుడైతే కడబూర మ్రోగునో అప్పుడు యేసుక్రీస్తు పరలోకము నుండి దిగివచ్చును. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆమీదట సజీవులమై నిలిచియుండు మనము వారతోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతోకూడ ఉందుము.” (1 థెస్స 4:14-17).

            ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు రెండవ రాక వరకు ఉన్న పరిశుద్ధులందరు ఆత్మసంబంధముగా తిరిగి జన్మిస్తారు. అప్పుడు మానవ రాజ్యాలన్ని యేసుక్రీస్తు పరిపాలన క్రిందకు వస్తాయి. యేసుక్రీస్తు వెయ్యేండ్ల రాజ్యం మొదలౌతుంది. వెయ్యేండ్ల వరకు సాతాను బందింపబడుతుంది. తిరిగి జన్మించిన పరిశుద్ధులందరు యేసుక్రీస్తుతో కూడా వెయ్యేండ్ల పరిపాలన చేస్తారు. ఈ మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులును పరిశుద్ధులునైయందురు ఇట్టివారి మీద రెండవ మరిణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.” (ప్రకటన 20:6).

        ఇంతగొప్ప దేవుని ప్రణాళికను సూచించు ఈ పండుగను మహానందముతో ఆచరించవలెను.