6వ పరిశుద్ధ దినం –గుడారాల పండుగ

12/03/2010 22:03

         ఈ పండుగను పర్ణశాలల పండుగ అని కూడా అంటారు. ఇది వారం రోజుల పండుగ. 7వ నెల 15వ తారీఖునండి వారం రోజులు దీనిని ఆచరించవలెను. యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.”(లేవి 23:34). వాటిలో మొదటి దినమున అందరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. పండుగలో జీవ నోపాధియైన యే పనియు చేయకూడదు. ఈ పండుగలో అందరు వారి స్వంత నివాసములలో నివసించకూడదు. మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తుదేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.”(లేవి 23: 41,42).

            ఈ పండుగలో నీవును నీస్వజనులందరు సంతోషింపవలెను. ఇది దేవుని ఆజ్ఞ. “ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులును పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతిపనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.”(ద్వితియో 16:14).

            ఈ పండుగ యేసుక్రీస్తు వెయ్యి సంవత్సరములు రాజ్యమును తెలియజేస్తుంది. క్రీస్తు రెండవ రాకతో దేవుని రాజ్యము మొదలౌతుంది. దేవుని పాలనలో జనులు ఎంత సంతోషముగా ఉంటారో అంతగా ఈ పండుగలో సంతోషింపవలెను. దేవుని రాజ్యములో వేదన, దుఃఖము, బాధలు, శ్రమలు, కన్నీరు, కష్టాలు, రోగాలు, భయాలు, ఆందోళనలు, పేదరికం అనే మాటే వినపడదు. ప్రజలందరు నిజమైన సుఃఖసంతోషాలు అనుభవిస్తారు. అందరు యేసుక్రీస్తు మార్గము అనుసరించెరు. ఆ రాజ్యములో ఆనందమే ఆనందము ఉంటుంది. అప్పుడు  ఈ పండుగను ఆచరించుటకు సమస్త అన్యదేశాల వారు యెరుషలేముకు ప్రతి సంవర్సరం వచ్చెదరు. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరును సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలల పండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.”(జకర్యా 14:16).

                ఈ పండుగలో దేవుని రాజ్యమును కొంత రుచిచూడవలెను. మంచిగా సంతోషించి ఆనందించవలెను.