సీతాకోకచిలుకను గూర్చిన పాఠము

12/03/2010 22:47

              ఒకానొకరోజున ఒకతను రోడ్డున నడిచివెళ్తు ఒక చెట్టుకొమ్మన అంటిపెట్టుకొనియున్న ఒక గొంగలి పురుగును చూసెను. అది గొంగలి పురుగుగూడు నుండి సీతాకోకచిలుకగా మారే క్రమంలో ఉంది. చాలా కష్టంగా శ్రమిస్తూ చిన్న రంధ్రం చేసింది. ఆ రంధ్రంలో నుండి బయటకు రావడానికి చాలా చాలా కష్టపడటం అతడు గమనించాడు. రంధ్రమేమో చిన్నది. దాని శరిరమేమో పెద్దగా ఉంది. ఎంతసేపు కష్టపడిన ఫలితం రావడం లేదు. అందులోనుండి బయటకు రావడం దానికి చాలా చాలా కష్టంగా వుంది.

            దాని బాధను, శ్రమను చూసి అతను చాలా బాధపడి దానికి సహాయం చేద్దామని అనుకున్నాడు. ఒక చిన్నకత్తి తీసుకొని ఆ యొక్క రంధ్రమును పెద్దది చేసినాడు. అప్పుడు ఇంకేముంది ఆ యొక్క గొంగలి పెంకులో నుండి బయటకు అది చాలా సులువుగా వచ్చేసింది. తేలిగ్గా అయితే బయటకు వచ్చేసింది కాని శరీరం ద్రవరూపంలోఉంది మరియు రెక్కలు చిన్నవిగా ఉండి ఎగురలేక పోయింది. ఫలితం, దాని జీవితం వృధా అయిపోయింది.

            అలా ఎందుకు అయ్యిందంటే దేవుని సృష్టి ప్రకారం ఆ సీతాకోకచిలుక ఆ చిన్న రంధ్రంలో నుండే బయటకు రావలెను. ఆ వచ్చే క్రమంలో చాలా ద్రవం బయటకు స్రవించి నరాలలోకి రెక్కలలోకి వెళుతుంది. తద్వారా ఆ రెక్కలు వెడల్పయి శక్తిని పొందుతాయి. తరువాత రెక్కలు ఎండిపోయి ఉపయోగకరమైన రూపంలోకొచ్చి అది విజయవంతంగా ఎగురటానికి ఉపయోగపడతాయి.

               కాని అతను చేసిన పని చూస్తే, దాని శ్రమను కష్టాన్ని తొలగించినట్లువుంది కాని ఫలితం దాని జీవితం వృధా అయ్యింది. కేవలం శ్రద్దకలిగి శ్రమపడటం వలననే దానికి అందం మరియు ఆనందంగా ఎగురగలిగే జీవితం ఆ సీతకోకచిలుకకు వస్తాయి. కాని అతను చేసిన పని వలన దాని జీవితం వేస్ట్ అయ్యింది.

                 ఈ సొసైటి ఆ వ్యక్తి లాంటిది. ప్రతిదానిలో సులభ మార్గాలు మరియు షార్ట్ కర్ట్స్ తీసుకోమని నిన్ను ఎల్లప్పుడు ప్రోత్సహిస్తుంది. ఎటు తక్కువ అవరోధం ఉంటే అటు వెళ్లమంటుంది. ఈజీగా ఉంటుందని అలా వెళ్తే ఆ సీతాకోకచిలుక మాదిరిగా మన జీవితాలలో చాలా బాధపడాల్సి వస్తుంది. ఒక్కసారి జీవితాలు ఉపయోగంలేకుండా అంతమైపోతాయి.

            దేవుని మార్గం కూడా అంతే. అంత సులువైనది కాదు. ఇరుకుమార్గం. అందులో షార్ట్ కర్ట్స్ లేవు. ఆ సీతాకోకచిలుక వలే చాలా చాలా చిన్న రంధ్రాలలో నుండి వెళ్లవలసి వస్తుంది. కాని ఆ తరువాత ఫలితం చాలా చాలా గొప్పగా ఊహించలేనంతగా ఉంటుంది. గమనించండి. కొన్ని వాటిల్లో అలా వెళ్తేనే ఫలితం ఆశించినట్లు ఉంటుంది.

            అందుకే ప్రతి తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా శ్రద్ద తీసుకోవలసిన అవసరం ఉంది. పిల్లలు ఏ వయస్సులో నేర్చుకోవసింది ఆ వయస్సులో నేర్చుకొనేటట్లు శ్రద్ద వహిం చాలి. ప్రస్తుతం ఈ ప్రపంచ దుస్దితికి తల్లిదండ్రులే కారణం. తల్లిదండ్రులకే తెలియకపోతే వారు తల్లిదండ్రులు ఎలా అయ్యారో వారే ఆలోచించాల్సిన విషయం.

            ఒక మంచి పనికి లేదా గొప్ప పనికి అవరోధాలు ఆటంకాలు ఎప్పుడు ఎదురౌతునే ఉంటాయి. అందుకని షార్ట్ కర్ట్స్ ని ఎంచుకోకూడదు. కాని శ్రద్ద కలిగి కష్టపడితే విజయం మనదే. ◌