ఈ విశ్వం ఎందుకు?

31/08/2010 15:30

ఈ సృష్టి గురించి ఎప్పడైనా ఆలోచించారా? భూమి, సూర్యుడు, చంద్రుడు మొదలైన గ్రహాలన్ని గాలిలో ఎందుకు వ్రేలాడదీయబడియున్నవి. అవి శూన్యములో ఏ ఆధారం లేకుండా ఎలా వ్రేలాడదీయబడియున్నవి? ఎప్పుడైన ఆలోచించారా? కొన్ని వందల సంవత్సరాలుగా సైన్సు ఆలోచిస్తునే ఉంది. కాని జవాబు లేదు?

ఈ భూమిని 7 ఖండాలుగా విభజించారు. ప్రతి ఖండములో దేశాలుంటాయి. దేశాలలో రాష్టాలు, రాష్టాలలో జిల్లాలు, జిల్లాలలో మండలాలు, మండలాలలో గ్రమాలుంటాయి. గమనించండి. అదేవిధంగా ఈ సర్వ సృష్టిని గెలాక్సీలుగా విభజించారు. ప్రతి గెలాక్సీలో నక్షత్రాలుంటాయి. నక్షత్రాల చుట్టు గ్రహాలు మరియు గ్రహాలచుట్టు ఉపగ్రహాలుంటాయి.

ఇంతవరకు ఎన్ని గెలాక్సీలున్నాయో ఖచ్చితంగా తెలియదు. కాని సుమారుగా పదివేల కోట్ల గెలాక్సీలున్నట్లు శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ప్రతి గెలాక్సీలో సుమారుగా కోటి కోట్ల నక్షత్రాలున్నట్లు అంచనా. ప్రతి నక్షత్రంచుట్టు కొన్ని గ్రహాలు తిరుగుతుంటాయి. ప్రతి గ్రహాంచుట్టు కొన్ని ఉపగ్రహాలు తిరుగుతుంటాయి.

గమనించండి. మనము భూమి అనే గ్రహము మీద నివసిస్తున్నాం. చంద్రుడు అనే ఉపగ్రహం భూమిచుట్టు తిరుగుతుంది. సూర్యుడు అనే నక్షత్రంచుట్టు భూమి తిరుగుతుంది. సూర్యుడు అనే నక్షత్రంచుట్టు తిరిగే గ్రహాలలో భూమి మూడవది. సూర్యుడు అనే నక్షత్రం పాలపుంత అనే గెలాక్సీలో ఉంది.

కాంతి సంవత్సరం:-

          100 కిలో మీటర్ల దూరాన్ని మనం ఒక మోటర్ బైక్ ద్వారా ఒక గంటలో చేరుకొంటే మనం గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణించినట్లు. అలాగే కాంతి ఒక సంవత్సరకాలంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. కాంతి ఒక సంవత్సరకాలంలో 9,460,730,472,580.8 కిలో మీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది.

          ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి కొన్ని కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. మన నక్షత్రమైన సూర్యుడినుంచి అతి దగ్గరగా ఉన్న మరో నక్షత్రం 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. రాత్రులు మనం చూసే నక్షత్రాలన్ని సూర్యుడులే. అని కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అందుకే అవి అంత చిన్నగా కనిపిస్తాయి.

          మన గెలక్సీ పేరు పాలపుంత. దానిలో మన సూర్యుడు మాదిరిగా కోటాను కోట్ల నక్షత్రాలున్నాయి. అయితే కేవలం 20% నక్షత్రాలు మాత్రమే మనం రాత్రిపూట చూడగలము. మిగతా 80% నక్షత్రాలు మనకు కనబడనంత దూరంలో ఉన్నాయి.

          గమనించండి. మన గెలాక్సీలోఉన్న అన్ని నక్షత్రాలను మనం చూడలేకపోతున్నాం. కేవలం 20% మాత్రమే చూడగలుగుతున్నాం. అయితే అలాంటి గెలాక్సీలు 10 వేల కోట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఒక గెలక్సీకి మరొక గెలక్సీకి మధ్య ఎన్నో వేల కాంతి సంవత్సరాల దూరం ఉంది. ఈ విశ్వం ఎంత అనంతమైనదో గ్రహించారా? శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ఈ సృష్టి ఇంకా పెరుగునే ఉంది. ఇంత పెద్ద మహా విశ్వాన్ని దేవుడు సృజించినాడు.

          ఇంతపెద్ద సృష్టితో పోల్చుకుంటే మనం నివసిస్తున్న భూమి ఒక దుమ్ము కణంతో సమానం. కాని ఈ అనంత విశ్వంలో భూమి మీద తప్పా జీవ ఎక్కడాలేదు. కేవలం భూమి మీద మాత్రమే జీవము మరియు వాతావరణం ఉన్నాయి. ఎందుకు?

దేవుని కుమారులు

        దేవుడు ఈ అనంత విశ్వాన్ని సృజించి దానిని ఏలుటకు తనకు అనేక కుమారులను నిర్మించుకొంటున్నాడు. ఎందుకంటే ముందుగా నిర్మించుకొన్న కొన్ని దేవదూతలు మరియు లూసిఫర్(మహాదేవదూత) ఆ పనిని దేవుని ఆజ్ఞలననుసరించి చేయలేక విఫలమైనాయి. ఆ క్రమంలో లూసిఫర్ సాతానుగా(దేవుని శత్రువు) మారినాడు. అవి చావులేని మార్పుచెందలేని జీవులు కనుక దేవుడు వాటిని అంధకారంలో బంధించినాడు. కేవలం దేవుని స్వభావం కలిగిన దేవుని కుమారులు మాత్రమే ఆ పనిని చేయగలరు. కనుక దేవుడు మానవులను నిర్మించినాడు. కాని దేవుడు మానవులను మరణపాత్రులు గాను మరియు మార్పుచెందుటకు వీలుగాను సృష్టించినాడు.

          సాతాను మోసం వలన మానవుడు తప్పిపోయినాడు. అయితే మానవుడు మార్పుచెందుటకు వీలుగా సృష్టింపబడ్డాడు కనుక దేవుడు తన సొంత కుమారుని పంపి మానవుడు మార్పు చెందుటకు అవకాశం కల్పించినాడు. అయినా సాతాను మానవులను ఇంకా మోసం చేస్తునే ఉన్నాడు.

          గమనించండి. కేవలం ఈ భూమి మీద మాత్రమే జీవమున్నది. దేవుడు మానవులను నిత్యజీవముతో తన కుమారులను చేసుకొనుటకు భయంకరమైన ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఒక మహత్తరమైన ప్రణాళికతో ఈ అభ్యాసము జరుగుతుంది. “ఆకాశముక్రింద జరుగునది అంతటిని జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని; వారు దీనిచేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటుచేసిన ప్రయాసము బహు కఠినమైనది.”(ప్రసంగి 1:13).

          మానవులు 80 సంవత్సరాల ఈ భౌతికమైన జీవితం కొరకు నానారకాలుగా ప్రయాసపడి భారము మోస్తున్నారు. దేవుడు శాంతిని నిత్యజీవాన్ని ఇస్తానని వాగ్దానము చేసినాడు. అయితే ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు సువార్త పిలుపునందుకొని తగిన రీతిగా అర్హత సాధించాలి. దేవుడు మానవులను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే ఇంత పెద్ద మహా సృష్టినేలుటకు తన సొంత స్వభావమును మానవునిలో నిర్మించుకొంటున్నాడు.    

            ఈనాడు భూమి మీద నుండి ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ పొంది దేవుని స్వభావమును ధరించుకొంటారో వారు ఈ అనంతసృష్టికి యేసుక్రీస్తుతో పాటు దేవుని వారసులౌతారు. “మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోటి వారసులము. మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.” (రోమా 8:16-19).

దేవుడు మిమ్మును దీవించునుగాక!!!